Share News

మాఫియాకు ‘ద్వారం’

ABN , Publish Date - Nov 30 , 2024 | 03:58 AM

పేదలకు ఉచితంగా ఇచ్చే రేషన్‌ బియ్యం కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు తరలిపోతోంది. ఒకరకంగా చెప్పాలంటే రేషన్‌బియ్యం ఎగుమతి మాఫియాకు కాకినాడ పోర్టు కేరా్‌ఫగా మారిపోయింది.

మాఫియాకు ‘ద్వారం’

బియ్యం బొక్కేసి.. కోట్లు కొట్టేసి!.. రెచ్చిపోతున్న రేషన్‌ మాఫియా

జగన్‌ హయాంలో రూ.వెయ్యి కోట్ల బియ్యం కాకినాడ నుంచి విదేశాలకు

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

పేదలకు ఉచితంగా ఇచ్చే రేషన్‌ బియ్యం కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు తరలిపోతోంది. ఒకరకంగా చెప్పాలంటే రేషన్‌బియ్యం ఎగుమతి మాఫియాకు కాకినాడ పోర్టు కేరా్‌ఫగా మారిపోయింది. ప్రతి నెలా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇచ్చే రేషన్‌ బియ్యం రోజుల వ్యవధిలోనే కాకినాడకు చేరి అక్కడి నుంచి ఆకర్షణీయమైన పేర్లు, ప్యాకింగ్‌తో విదేశాలకు చేరుతోంది. దీని వెనుక పెద్ద మాఫియానే ఉంది. కాకినాడలో పాతుకుపోయిన రేషన్‌బియ్యం మాఫియా రాష్ట్రవ్యాప్తంగా వీటిని కొనుగోలు చేసి, ఇక్కడకు తరలించేలా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుంది. ఈ బియ్యాన్ని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లోని తమ మిల్లుల్లో రహస్యంగా పాలిష్‌ చేసి, ఆకర్షణీయమైన సంచుల్లో ప్యాక్‌ చేసి అక్కడ నుంచి పోర్టు ద్వారా గుట్టుచప్పుడు కాకుండా ఆఫ్రికా దేశాలకు తరలించేస్తున్నారు. కొన్నేళ్లుగా సాగుతున్న ఈ వ్యవహారం.. గత వైసీపీ హయాంలో మరింత రెట్టింపైంది. కొందరు ప్రభుత్వ పెద్దల సహకారంతో గడచిన అయిదేళ్లలో పోర్టునుంచి వెళ్లిన బియ్యం ఎగుమతుల విలువ రూ.950 కోట్లు పైగానే ఉందని అంచనా. కాకినాడ సిటీ నియోజకవర్గానికి చెందిన వైసీపీ కీలకనేత ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కుటుంబం చేతిలో ఉన్న రైస్‌ మిల్లులు, పౌరసరఫరాలశాఖ అధికారుల సహకారంతో ఈ మాఫియా విస్తరించింది. ఎక్కడా తనిఖీలు, దాడులు లేకుండా అధికారులను మామూళ్ల మత్తులో ముంచి బియ్యాన్ని దేశాలు దాటించేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎంత అడ్డుకట్టవేద్దామన్నా అదుపులోకి రానంత స్థాయికి ఈ మాఫియా ఎదిగిపోయింది.

వైసీపీ అభయంతో!

కాకినాడ కేంద్రంగా రేషన్‌బియ్యం కొన్నేళ్లుగా విదేశాలకు తరలిపోతోంది. ప్రధానంగా యాంకరేజ్‌ పోర్టు నుంచి లక్షల టన్నుల బియ్యం అక్రమంగా సముద్రాలు దాటుతోంది. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి కుటుంబం, ఆయన అనుచరులు లక్షల టన్నుల బియ్యాన్ని తరలించారు. రేషన్‌ బియ్యాన్ని వైసీపీ అండదండలున్న 16 కంపెనీల వ్యాపారులు అనేక ప్రాంతాల నుంచి కిలో రూ.6కి కొనుగోలు చేసి కాకినాడకు తరలించారు. వీటిని ద్వారంపూడి కుటుం బం, ఆయన మనుషులు కొనుగోలు చేసి మిల్లుల్లో పాలిష్‌ చేసి కిలో రూ.70 చొప్పున విదేశాలకు ఎగుమతి చేశారు. ఇలా రూ.కోట్లకు కోట్లు సంపాదించారు. రేషన్‌ బియ్యం విదేశాలకు తరలిపోతుందని తెలిసినా గడచిన అయిదేళ్లపాటు సదరు కీలకనేతకు ఎదురుచెప్పే ధైర్యం చేయలేక వ్యవస్థలు నిస్సహాయంగా మారాయి. పైగా సదరు నేత అప్పటి ప్రభుత్వాధినేతకు అత్యంత సన్నిహితుడు కావడంతో రేషన్‌ బియ్యం ఎన్ని రూపాలు మారినా అడ్డుకునే నాథుడే లేకపోయాడు. రేషన్‌ బియ్యంతోపాటు అనేక జిల్లాల్లో పేదలకు రాష్ట్రప్రభుత్వం పౌష్టికాహారం కింద పంపిణీ చేసిన పోర్టిఫైడ్‌ బియ్యాన్ని సైతం మాఫియా పాలిష్‌ చేసి విదేశాలకు ఎగుమతి చేసింది.


ఒక్కసారిగా రెట్టింపు

వైసీపీ అధికారంలోకి రాకముందు కాకినాడ యాంకరేజ్‌ పోర్టు నుంచి మాత్రమే విదేశాలకు బియ్యం ఎగుమతి అయ్యేది. 2014-2019 మధ్య ఏడాదికి పోర్టు ద్వారా 16 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి కాగా, దీనిలో రేషన్‌ బియ్యం తక్కువ పరిమాణంలో ఉండేది. కానీ, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బియ్యం ఎగుమతులు రెట్టింపయ్యాయి. అదే సమయంలో రేషన్‌ మాఫియా ప్రభుత్వ పెద్దల పరోక్ష సహకారంతో తన నెట్‌వర్క్‌ను విస్తరించింది. ఫలితంగా కాకినాడకు నిత్యం వేల లారీల్లో రేషన్‌ బియ్యం గోదాముల్లోకి రహస్యంగా చేరేది. ఎక్కడా వీటిని తనిఖీలు చేయకుండా అప్పటి పౌరసరఫరాల కార్పొరేషన్‌ సైతం సహకరించింది. ఈ విభాగం కూడా సదరు కాకినాడ కీలకనేత తండ్రి చేతుల్లో ఉండేది. అటు రాష్ట్ర మిల్లర్ల సంఘం కూడా సోదరుడి చేతులోనే ఉంది.

5 నుంచి 14 దేశాలకు

జగన్‌ అధికారంలోకి రాకముందు కాకినాడ పోర్టు ద్వారా 5 దేశాలకు బియ్యం ఎగుమతి అయ్యేది. 2019 తర్వాత ఈ ఎగుమతులు ఏకంగా 14 దేశాలకు విస్తరించాయి. వీటిలో ఎక్కువగా పశ్చిమ ఆఫ్రికా దేశాలు, ఇండోనేషియా, చైనాకు ఎగుమతయ్యాయి. ఆఫ్రికా దేశాలకు బియ్యం వెళ్లిన తర్వాత అక్కడ బిల్లులు వేగంగా రావడం లేదని భావించిన ద్వారంపూడి ఏకంగా ఆయా దేశాల్లో గోదాములు నిర్మించేయడం గమనార్హం.


షిప్పులు దగ్గరకు రావడం లేదని

కాకినాడ యాంకరేజ్‌ పోర్టు నుంచి మాత్రమే జరిగే బియ్యం ఎగుమతులకు ఎక్కువ సమయం పడుతుంది. డ్రెడ్జింగ్‌ సదుపాయం లేకపోవడంతో నౌకలు పోర్టు బెర్త్‌ వద్దకు రావు. పోర్టుకు 9 నాటికల్‌ మైళ్ల దూరంలో ఆగిపోతాయి. అక్కడకు బార్జిల్లో బియ్యం బస్తాలను లోడ్‌ చేసి నౌకవద్దకు తీసుకువెళ్లి లోడింగ్‌ చేస్తారు. దీనివల్ల ఎగుమతులకు సమయం తీసుకుంటుంది. దీంతో వైసీపీ హయాంలో ద్వారంపూడి చక్రం తిప్పారు. పక్కనే ఉన్న ప్రైవేటు పోర్టు.. డీప్‌వాటర్‌ పోర్టు నుంచి ఎగుమతులకు అనుమతుల కోసం అప్పటి ప్రభుత్వాధినేతను ఒప్పించారు. దీంతో 2021లో తొలిసారిగా డీప్‌వాటర్‌ పోర్టు నుంచి బియ్యం ఎగుమతులకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.

కూటమి వచ్చినా

కూటమి అధికారంలోకి రాగానే రేషన్‌ మాఫియాపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. విదేశాలకు అక్రమంగా పాలిష్‌ చేసి ఎగుమతి చేస్తున్న అక్రమార్కులపై ఉక్కుపాదం మోపింది. స్వయంగా మంత్రి నాదెండ్ల మనోహర్‌ కాకినాడకు వచ్చి పోర్టుతో సహా గోదాములను జూలైలో తనిఖీ చేశారు. రూ.157 కోట్ల విలువైన 50,647 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 26,488 టన్నులను రేషన్‌ బియ్యంగా గుర్తించారు. కొత్తగా పోర్టు పరిసరాల్లో రెండు సమీకృత చెక్‌పోస్టులు రేయింబవళ్లు పనిచేసేలా ఏర్పాటు చేశారు. ప్రతి లారీని తనిఖీ చేసి శాంపిళ్లు సేకరించేలా నిఘాపెట్టారు. అయినప్పటికీ రేషన్‌ మాఫియా ఒత్తిళ్లతో రాత్రివేళ తనిఖీలు నిలిచిపోయాయి. పాతిక లారీలకు రెండు లారీలను కూడా తనిఖీ చేయకుండా అధికారులు లోపలకు పంపేస్తున్నారు. చెక్‌పోస్టులో సిబ్బంది ఫోన్‌ నెంబర్లు సేకరించిన బియ్యం మాఫియా వారికి మామూళ్లు ఇచ్చి పోర్టులోకి రేషన్‌ బియ్యాన్ని తరలించేస్తోంది.

Updated Date - Nov 30 , 2024 | 03:58 AM