రాసిస్తా రాయలసీమ!
ABN , Publish Date - Mar 26 , 2024 | 04:11 AM
సార్వత్రిక ఎన్నికలకు ముందు జగన్ సర్కారు అత్యంత రహస్యంగా భారీ భూపందేరం చేసింది. సంప్రదాయేతర ఇంధన వనరుల స్థాపన పేరిట అస్మదీయ కంపెనీలకు రాయలసీమలోనే మొత్తం 50వేల ఎకరాలు కట్టబెట్టింది.
అస్మదీయులకు జగన్ భారీ భూసంతర్పణ
మొత్తం 50 వేల ఎకరాలు ధారాదత్తం
పదులు, వందల ఎకరాలు కాదు... రాయలసీమలోనే అక్షరాల యాభై వేల ఎకరాలు కట్టబెట్టేశారు. అది కూడా... ఎన్నికల షెడ్యూలుకు రెండు నెలల ముందు నుంచే ఈ భూ సంతర్పణ మొదలైంది.
అస్మదీయ కంపెనీలు జనవరి 22వ తేదీన దరఖాస్తు చేయడం.. ఆ వెంటనే అనుమతులు ఇవ్వడం.. కేబినెట్ ఆమోదం తెలపడం.. ఫిబ్రవరి తొలివారంలో సర్కారు ఉత్తర్వులు జారీ చేయడం.. అంతా హడావుడిగా, రహస్యంగా జరిగిపోయింది.
కడప జిల్లాతో పాటు అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాలలో జగన్ సన్నిహితుల కంపెనీలకు విద్యుదుత్పత్తి సంస్థల స్థాపన పేరిట కారుచౌకగా భూములు కేటాయించారు. అంతేగాక వినియోగదారులపై భారం వేసేలా ఆ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోళ్లకు సిద్ధమయ్యారు. అంటే.. ఆ కంపెనీలకు అన్నివిధాలా లాభమన్నమాట.
ఎన్నికల ముందు హడావుడిగా నిర్ణయం
జనవరి మూడోవారంలో కంపెనీల దరఖాస్తు
ఆ వెంటనే అదే నెలలో కేబినెట్ ఆమోదం
జేఎ్‌సడబ్ల్యూకు 20,100.. ఇండోసోల్‌కు
24,750 ఎకరాలు.. ఫిబ్రవరిలో ఉత్తర్వులు
ఈ వ్యవహారమంతా అత్యంత రహస్యం
పర్యావరణ అనుమతులు లేకున్నా గ్రీన్‌సిగ్నల్
భారం పడేలా విద్యుత్ కొనుగోలుకూ ఓకే
జగన్ సర్కారు ‘భూ సంతర్పణ’ లీలలు తవ్వేకొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ కుటుంబానికి చెందిన గ్రీన్‌కో కంపెనీకి ఎకరం 5 లక్షలు చొప్పున 1,985 ఎకరాలు కేటాయిస్తూ ఎన్నికల కోడ్‌కు ఒక్కరోజు ముందు ఈ నెల 15న జీవో ఇచ్చేశారు. జగన్ సన్నిహితుడు విశ్వేశ్వరరెడ్డికి చెందిన ఇండోసోల్‌కు 17,633 ఎకరాలనూ అదేరోజు కట్టబెట్టారు. అడ్డగోలు భూదోపిడీపై ‘ఆంధ్రజ్యోతి’ మరింత లోతుగా ఆరా తీయగా ఇంకొన్ని విషయాలు బయటపడ్డాయి. జనవరిలో ‘ఇంతకు మించి’ భూ సంతర్పణ జరిగినట్లు వెల్లడైంది. వెరసి.. ఒక్క రాయలసీమలోనే 50 వేల ఎకరాలను కట్టబెట్టారు. ‘సీమ’ను అస్మదీయులకు రాసిచ్చేశారు.
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
సార్వత్రిక ఎన్నికలకు ముందు జగన్ సర్కారు అత్యంత రహస్యంగా భారీ భూపందేరం చేసింది. సంప్రదాయేతర ఇంధన వనరుల స్థాపన పేరిట అస్మదీయ కంపెనీలకు రాయలసీమలోనే మొత్తం 50వేల ఎకరాలు కట్టబెట్టింది. భూములు కేటాయించాలంటూ ఈ ఏడాది జనవరి 22న ఆయా కంపెనీలు దరఖాస్తు చేయగా... ఆ వెంటనే ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి పారిశ్రామిక అభివృద్ధి, ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆమోదం తెలిపారు. ఆ తర్వాత జనవరి చివరిలోనే మంత్రి మండలి కూడా ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి మొదటి వారంలో ఉత్తర్వులు జారీ చేశారు. ఎకరం 5 లక్షల చొప్పున ఆయా కంపెనీలకు భూములు అమ్మాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రభు త్వం నిర్ణయం మేరకు భూములు సేకరించాలని పరిశ్రమల శాఖను ఇంధన శాఖ కోరింది. ఇలా భూసంతర్పణలు గ్రీన్ చానల్‌లో జరిగిపోవడంపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. జగన్ సొంత జిల్లాకు చెందిన షిర్డిసాయి, ఇండోసోల్‌తో పాటు ఇతర సంస్థలకు చేకూర్చిన ప్రయోజనాలను బయటకు పొక్కకుండా రహస్యంగా దాచిపెట్టారు. గత నెల తొలివారంలో జారీ చేసిన ఉత్తర్వులను కూడా ఇంధన శాఖ అత్యంత రహస్యంగా ఉంచింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఉత్తర్వులను రహస్యంగా ఉంచడం మంచిదికాదన్న ఉద్దేశంతో ఇంధన శాఖ ఈ నెల 21న ఈ-గెజిట్‌లో బహిర్గతం చేసింది. సర్కారు తీసుకున్న నిర్ణయాలను రహస్యంగా ఉంచడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
విద్యుత్ కొనుగోలుకూ సిద్ధం
విద్యుదుత్పత్తి కంపెనీలకు ప్రోత్సాహకాల పేరిట భారీగా భూసంతర్పణ చేయడమే కాకుండా, రాష్ట్ర ప్రజలపై విద్యుత్ చార్జీల భారం పడేలా.. ఆయా సంస్థలు ఉత్పత్తి చేసే విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకూ ప్రభుత్వం సిద్ధపడిపోయింది. ప్రైవేటు కంపెనీలు ఉత్పత్తి చేసే విద్యుత్ ఉత్పత్తిని గ్రిడ్‌కు అనుసంధానించాలంటే ప్రత్యేక చార్జీలు చెల్లించాలి. కానీ ఇక్కడ అలాంటివేమీ లేవు. ప్రైవేటు విద్యుదుత్పత్తి సంస్థలకు నేరుగా ట్రాన్స్‌కో గ్రిడ్ అనుసంధానం అవుతుంది. వాటి ద్వారా రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (డిస్కమ్)లు కరెంటును కొనుగోలు చేస్తాయి.
‘మెసెర్స్’కు 500 ఎకరాలు
జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హైదరాబాద్‌కు చెందిన మెసెర్స్ ఎకోరెన్ ఎనర్జీ సంస్థకు ప్రయోజనాలు కల్పిస్తూనే ఉన్నారు. ఈ సంస్థ కర్నూలు జిల్లా ఆస్పరిలో అదనంగా 200 మెగావాట్ల పవన విద్యుదుత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇదివరకే ఈ సంస్థకు 800 మెగావాట్ల పవన విద్యుదుత్పత్తి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మెగావాట్‌కు రెండున్నర ఎకరాల చొప్పున ఈ సంస్థకు ఆస్పరి మండలంలో 2000 ఎకరాలను కేటాయించిన సర్కారు.. అదనంగా మరో 500 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించింది. ఈ కంపెనీ ఉత్పత్తి చేసే విద్యుత్‌ను ఏపీట్రాన్స్‌కో గ్రిడ్ ద్వారా రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ డిస్కమ్)లకు సరఫరా చేయనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. గత నెల 2న ఈ ఉత్తర్వును జారీ చేసిన ఇంధన శాఖ తాజాగా ఈ నెల 21న గెజిట్‌లో పెట్టింది.
ఇండోసోల్‌కు 25 వేల ఎకరాలు
సీఎం జగన్ సన్నిహితుడు షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ యజమాని విశ్వేశ్వరరెడ్డికి చెందిన ఇండోసోల్ సంస్థకు భారీగా భూసంతర్పణకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనంతపురం జిల్లా తాడిపత్రి దగ్గర ఊరిచింతల.. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల, కంబాలదిన్నె, చిన్న వెంతుర్ల, బి.వెంకటాపురం, బేస్తవెర్ముల, నేలనూతల, కల్లుట్ల, డోన్, హెట్టం, హోలగుండంతో పాటు కడప జిల్లాలోనూ ప్లాంట్ల స్థాపనకు భూములు సేకరించాలని పరిశ్రమల శాఖను ఇంధన శాఖ కోరింది. విద్యుదుత్పత్తి సంస్థల స్థాపన కోసం ఈ భూములను ఏడాదికి ఎకరాకు రూ.31,000 చొప్పున లీజుకివ్వాలనే ప్రతిపాదన ఉండగా.. ఎకరా రూ.5 లక్షలు చొప్పున ఒకేసారి ఇచ్చేయాలని ఇండోసోల్ పట్టుబడుతోంది. దీనిపై ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలని ఇండోసోల్‌కు ఇంధన శాఖ సూచించింది. మొత్తం 24,750 ఎకరాలను ఇండోసోల్‌కు ధారాదత్తం చేసేందుకు జగన్ సర్కారు సిద్ధమైంది.
కేంద్రం అనుమతులు లేకున్నా...
జేఎ్‌సడబ్ల్యూ నియో ఎనర్జీ సంస్థ కర్నూలు, నంద్యాల జిల్లాలో 171.60 మెగావాట్ల పవన విద్యుత్ సంస్థను ఏర్పాటు చేసేందుకు జగన్ సర్కారు ఆమోద ముద్ర వేసింది. గత నెల ఆరో తేదీన ఈ మేరకు ఉత్తర్వు జారీ చేసిన ఇంధన శాఖ ఈ నెల 21వ తేదీన ఈ గెజిట్‌లో ఉంచింది. ఈ సంస్థ పవన విద్యుదుత్పత్తి ప్లాంట్లను కర్నూలు జిల్లా జలదుర్గం రిజర్వు ఫారెస్టు ప్రాంతంలో, నంద్యాల జిల్లా అవుకు మండలం కునుకుంట్ల రిజర్వు ఫారెస్టు ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు జగన్ సర్కారు అనుమతి ఇచ్చింది. రిజర్వు ఫారెస్టు ప్రాంతంలో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అనుమతులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది. అస్మదీయులకు ముందుగా అనుమతులిచ్చేసి, ఆ తర్వాత కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అనుమతులు తీసుకోవాలన్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర పర్యావరణ అటవీ శాఖ అనుమతులు లేకుండానే.. ఏపీ ట్రాన్స్‌కో 400/200 కేవీ ట్రాన్స్‌మిషన్ వైర్లను వేయాలంటూ ఇంధన శాఖ ఉత్తర్వులు ఇవ్వడం కూడా వివాదాస్పదమైంది.
జేఎ్‌సడబ్ల్యూకు 20 వేల ఎకరాలు
ముంబైకు చెందిన జేఎ్‌సడబ్ల్యూ సంస్థ కడప జిల్లాలో 400 మెగావాట్లు, సత్యసాయి జిల్లాలో 1050 మెగావాట్లు, అనంతపురం జిల్లాలో కనగానపల్లె , రాప్తాడులో 1050 మెగావాట్లు, డి.హీరేహల్, బొమ్మనహళ్‌లో 850 మెగావాట్లు... మొత్తంగా 3,350 మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మెగావాట్‌కు ఆరు ఎకరాల చొప్పున మొత్తం 20,100 ఎకరాల భూమిని సమీకరించి ఇవ్వాలని ఇంధన శాఖ నిర్ణయించింది. ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేందుకు స్థానిక సంస్థలు సహకరించాలని ఇంధన శాఖ సూచించింది. ఈ సంస్థకు మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా 400/220 హైలెవల్ విద్యుత్ ట్రాన్స్‌మిషన్ కరెంటు తీగలను వేయాలని ఇంధన శాఖ నిర్ణయించింది.
ఉమ్మడి అనంత, కర్నూలులో...: కర్నూలు, నంద్యాల జిల్లాలలో ఎఎం ఎనర్జీ 15 మెగావాట్ల పవన విద్యుదుత్పత్తి సంస్థను నెలకొల్పేందుకు ప్రభుత్వం ఆమోదించింది. ఈ ఏడాది జనవరిలో ఈ మేరకు ఉత్తర్వులు విడుదలయ్యాయి. న్యూఢిల్లీకి చెందిన మెసర్స్ రిన్యూ విక్రమ్‌శక్తి ప్రైవేటు లిమిటెడ్ అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో 600 మెగావాట్ల పవన్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ఇంధన శాఖ ఆమోదం తెలిపింది.