‘సాయం’పై చర్చకు సిద్ధమా!
ABN , Publish Date - Oct 10 , 2024 | 03:30 AM
వరద బాధితులను ఆదుకోవడానికి వచ్చిన విరాళాలు, బాధితులకు అందించిన సాయంలో అవినీతి జరిగిందం టూ మాజీ సీఎం జగన్, వైసీపీ చేస్తున్న ఆరోపణల ను మంత్రులు ఖండించారు.
జగన్‌కు మంత్రుల సవాల్
విరాళాలు, వరద సాయంపై వైసీపీవి అసత్య ప్రచారాలని వెల్లడి
అమరావతి, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): వరద బాధితులను ఆదుకోవడానికి వచ్చిన విరాళాలు, బాధితులకు అందించిన సాయంలో అవినీతి జరిగిందం టూ మాజీ సీఎం జగన్, వైసీపీ చేస్తున్న ఆరోపణల ను మంత్రులు ఖండించారు. ఈ మొత్తం వ్యవహారం పై చర్చకు జగన్ సిద్ధమా? అని సవాల్ విసిరారు. బుధవారం సచివాలయంలో మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, పి. నారాయణ మాట్లాడారు. అబద్ధపు పునాదులపై పుట్టిన వైసీపీ, ఆ పార్టీ నేత జగన్ కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ మీడియాను అడ్డుపెట్టుకొని, కోట్లు కొట్టేశారని నోటికి వచ్చినట్లు రాశారంటూ విమర్శించారు.
నీ కోటి సాయం ఏమైంది జగన్?: అనగాని
‘చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నష్టపరిహారం అందించాం. సుమారు రూ.602 కోట్లను పరిహారంగా చెల్లించాల్సి ఉందని అంచనా వేశాం. దానిలో రూ.601 కోట్లు దాదాపు 4.06 లక్షల మంది బాధితులకు చెల్లించాం. మిగిలిన సొమ్మును కూడా ఆధార్ సీడింగ్ తదుపరి తక్షణమే చెల్లిస్తాం. గత ప్రభుత్వం వరద సాయంగా రూ.3-4 వేలు ఇస్తే దానిని రూ.25 వేలకు పెంచి ఇచ్చాం. వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు దాతలు ముందుకొచ్చి దాదాపు రూ.400 కోట్లు విరాళంగా ఇచ్చారంటే అది చంద్రబాబుపై ప్రజలకు ఉన్న నమ్మకం. అందులో ఇప్పటికే దాదాపు రూ.252 కోట్లు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఖాతాలో జమయ్యాయి. ఈ విషయంలో జగన్ దుష్ప్రచారం చేస్తున్నారు. తప్పుడు కథనాలు తమ పత్రికకలో ప్రచురిస్తున్నారు. వరద బాధితులకు ఎంత ఖర్చుపెట్టామో తెలుసుకోవాలంటే సమాచార హక్కుచట్టం కింద దరఖాస్తు చేసుకోవాలి. జగన్ ఇస్తానన్న రూ.కోటి సా యం ఏమైంది?’ అని మంత్రి సత్యప్రసాద్ అన్నారు.
నీకు వాస్తవాలేం తెలుస్తాయ్?: నారాయణ
‘తప్పుడు ప్రచారం చేసే, జగన్ 11 సీట్లకు పరిమి తం అయ్యారు. ఇలానే చేస్తే రాబోయే రోజుల్లో ఒక్కసీటు కూడా రాదు. జగన్‌కు చివరకు సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా సున్నా మిగులుతుం ది. సీఎం చంద్రబాబు క్షేత్ర స్థాయిలో ఉండి ప్రజల కష్టాలు చూశారు. జగన్ ఇలా వచ్చి... అలా వెళ్లిపోయారు. ఒకసారి వచ్చి వెళ్లిన జగన్‌కు ఈ వాస్తవాలు ఎలా తెలుస్తాయి? సీఎం చంద్రబాబు స్వయంగా నీళ్లలో తిరిగారు’ అని మంత్రి నారాయణ అన్నారు.
చర్చకు సిద్ధమా: అనిత
‘వరద సాయంపై చర్చించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. వైసీపీ నుంచి చర్చకు ఎవరైనా వస్తారా? వైసీపీకి ఫేక్ రాతలు, ప్రచారాలే పునాది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రోజుల వ్యవధిలోనే బాధితులకు పరిహారం అందించాం. చంద్రబాబుకు మంచిపేరు రావడాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నా రు. అందుకే అసత్య ప్రచారాల కు దిగారు. వరదలు వచ్చినప్పుడు సీఎంగా ఉన్న జగన్ హెలీకాప్టర్‌లో వెళ్తే.. చంద్రబాబు జేసీబీల్లో వెళ్లారు. నీట మునిగిన ప్రతి ఇంటినీ కడిగించారు. 11 సీట్లు వచ్చే సరికి జగన్‌కు చిప్ పోయినట్టుం ది’ అని మంత్రి అనిత అన్నారు.