Share News

Vijayawada Floods: వీడిన ముంపు.. తొలగిన ముప్పు

ABN , Publish Date - Sep 05 , 2024 | 04:23 AM

వరద తగ్గుముఖం పడుతోంది. చుట్టుముట్టిన ముంపు వీడుతోంది. అదే సమయంలో... సహాయ ప్రక్రియ ఊపందుకుంది. ‘పారిశుధ్య’ దళం కదిలింది.

Vijayawada Floods: వీడిన ముంపు.. తొలగిన ముప్పు

  • బాధితులను ఆదుకోవడంపై దృష్టి..

  • బ్యాంకర్లు, బీమా ప్రతినిధులతో సీఎం భేటీ

  • వరద నుంచి తేరుకుంటున్న బెజవాడ

  • ఊపందుకుంటున్న సహాయ చర్యలు

  • వరద తగ్గిన చోట విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ

  • సుమారు పది వేల మందితో పారిశుధ్య దళం

  • ఇళ్లు, వీధుల్లో బురద మేటపై ‘ఫైరింజన్‌’

  • ఇతర జిల్లాల నుంచి నీటి ట్యాంకులు

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనంతో యంత్రాంగంలో చురుకు

  • సహాయం పంపిణీలో పెరిగిన సమన్వయం

  • బుడమేరు వరదలో 60 వేల ఇళ్లు పూర్తిగా మునక

  • ప్రతి ఇంటికీ కనీసం రూ.లక్ష దాకా నష్టం

  • వ్యాపార, వాణిజ్య సంస్థలకు భారీ దెబ్బ

వరద తగ్గుముఖం పడుతోంది. చుట్టుముట్టిన ముంపు వీడుతోంది. అదే సమయంలో... సహాయ ప్రక్రియ ఊపందుకుంది. ‘పారిశుధ్య’ దళం కదిలింది. మొత్తంగా చూస్తే... బుడమేరు వరదకు వణికిన విజయవాడ నగరం క్రమంగా తేరుకుంటోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను బుధవారం ‘ఆంధ్రజ్యోతి’ కళ్లకు కట్టినట్లు వివరించడంతో యంత్రాంగంలో చురుకు కనిపించింది. మరోవైపు... బుడమేరుకు పడిన మూడు గండ్లను పూడ్చే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. బుడమేరుకు మళ్లీ వరద వస్తోందనే వదంతులను నమ్మవద్దని జిల్లా యంత్రాంగం ప్రజలకు సూచించింది. ఇక... రెండు రోజుల కిందట విశ్వరూపం ప్రదర్శించిన కృష్ణమ్మ క్రమంగా శాంతిస్తోంది.

విజయవాడ, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): బుడమేరు వరద ముంపు మెల్లగా తొలగిపోతోంది. విజయవాడ నగరం కోలుకుంటోంది. బుడమేరు ముంచెత్తడంతో 5 నుంచి 8 అడుగుల వరద నీటిలో మునిగిన అజిత్‌ సింగ్‌నగర్‌, పాయకాపురం తదితర ప్రాంతాల్లో దాదాపు 80 శాతం ముంపు నుంచి బయటపడ్డాయి. వరద నీరు తగ్గిన ప్రాంతాల్లో అధికారులు ఎక్కడికక్కడ విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. యుద్ధ ప్రాతిపదికన పారిశుధ్య పనులు చేస్తున్నారు. విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 3454 మంది కార్మికులతోపాటు 450 మంది ప్రజారోగ్య సిబ్బందిని ఈ పనులకు వినియోగిస్తున్నారు. వీరితోపాటు ఇతర మున్సిపాలిటీల నుంచి వచ్చిన 5889 మంది కార్మికులను రంగంలోకి దించారు. కాగా, ఇళ్లలో బురద మేట వేయడంతో దాన్ని శుభ్రం చేసుకునేందుకు తీవ్ర ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన అధికారులు ఏకంగా ఫైర్‌ ఇంజన్లను రంగంలోకి దించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 48 ఫైర్‌ ఇంజన్లను తెప్పించారు.వాటిద్వారా వీధుల్లో,ఇళ్లలోకి చేరిన బురద, మురుగు కొట్టేస్తున్నారు.


గాడినపడుతున్న ఆహార పంపిణీ

వరద ప్రాంతంలో పరిస్థితులను వివరిస్తూ ‘ఆంధ్రజ్యోతి’ బుధవారం సవివరమైన కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. దీంతో... గత మూడు రోజులుగా ఆహారం, తాగునీటి పంపిణీ విషయంలో విఫలమైన యంత్రాంగం బుధవారం దిద్దుబాటు చర్యలు తీసుకుంది. ఐఏఎస్‌ అధికారి కోన శశిధర్‌ సింగ్‌నగర్‌ ఫ్లై ఓవర్‌ వద్దే ఉండి... అంతా క్రమపద్ధతిలో జరిగేలా చూశారు. ఆహారం, తాగునీటితో వచ్చిన వాహనాలను ఏయే ప్రాంతాలకు పంపాలో ప్రణాళికా బద్ధంగా నిర్ణయించి... ప్రతి వాహనం వెంట డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ బృందాన్ని పంపించారు. దీంతో చాలా వరకు బాధితులకు ఆహారం, తాగునీటి బాటిళ్లు చేరాయి.

ఎంత కష్టం... ఎంత నష్టం

విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలోని వాంబే కాలనీ, కండ్రిక, రాజీవ్‌ నగర్‌ కాలనీ, ఉడా కాలనీ, ఆంధ్రప్రభ కాలనీలలోని చివరి ప్రాంతాలు నాలుగైదు అడుగుల ముంపులో ఉన్నాయి. పశ్చిమ నియోజకవర్గంలో.. విద్యాధరపురం కబేళా సెంటర్‌, ఆర్టీసీ వర్క్‌ షాపు రోడ్డు ముంపులో ఉన్నాయి. మిగిలిన ప్రాంతాలన్నీ దాదాపు ముంపు నుంచి తేరుకున్నాయి. వరద ముంపు నుంచి బయటపడిన జనం ఇళ్లకు తాళాలు వేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. సుమారు 60 వేల ఇళ్లు పూర్తిగా వరద ముంపునకు గురయ్యాయని, రూ.600 కోట్ల నష్టం సంభవించి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇది కేవలం నివాస గృహాల్లో జరిగిన ఆస్తి నష్టం మాత్రమే. ఒక్కో కుటుంబం కనీసం రూ.లక్ష విలువైన ఆస్తిని నష్టపోయి ఉంటుందని అంచనా.

‘పద్ధతి’ పాటించాలి...: బుధవారం అటు ప్రభుత్వ యంత్రాంగం, ఇటు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భారీ సంఖ్యలో వాటర్‌ బాటిళ్లను పైపుల రోడ్డు సెంటర్‌, సింగ్‌ నగర్‌ ఫ్లైఓవర్‌ వద్దకు తీసుకెళ్లారు. కానీ... వాటిని పద్ధతిగా పంపిణీ చేసే వ్యవస్థ కనిపించలేదు. బాధితులు మంచినీళ్ల కోసం పోటెత్తారు. స్వచ్ఛంద సంస్ధల వాహనాలు రాగానే మంచినీటి ప్యాకెట్ల కోసం చుట్టుముట్టారు. పరిస్థితిని నియంత్రించలేని ఆయా సంస్థల ప్రతినిధులు పన్నెండు చొప్పున బాటిళ్లతో కలిపిన ప్యాక్‌లనే కిందికి వదిలేశారు. మళ్లీ నీళ్లు దొరుకుతాయో లేదో అన్నట్లుగా కొంతమంది భుజాలపై రెండు మూడు కేసుల వాటర్‌ బాటిళ్లను తీసుకెళ్లడం కనిపించింది. మరోవైపు... మంచినీటి బాటిళ్ల కోసం కొందరు దుకాణదారులూఎగబడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఆహారం, తాగునీరు విజయవాడ వచ్చి చేరుతోంది. అవి సక్రమంగా పంపిణీ అయ్యేలా ఒక అధికారిని నియమించాల్సిన అవసరముంది. కాగా, మూడు రోజులుగా నెలకొన్న సమన్వయ లోపంతో పెద్దస్థాయిలో ఆహారం వృథా అయ్యింది. పైపుల రోడ్డు సెంటర్‌లో ఎక్కడిపడితే అక్కడ ఆహార ప్యాకెట్లు బస్తాలు బస్తాలు పోగుపడి ఉన్నాయి. సింగ్‌ నగర్‌ నుంచి వరద ముంపు తీవ్రంగా ఉన్న దూరప్రాంతాల్లో రోడ్ల వెంట ఎక్కడపడితే అక్కడ ఆహార ప్యాకెట్లు కనిపించాయి. పారిశుధ్య సిబ్బంది వీటిని తొలగించడం మొదలుపెట్టారు.

Updated Date - Sep 05 , 2024 | 07:00 AM