వరద బాధితులకు ఆపన్నహస్తం
ABN , Publish Date - Sep 16 , 2024 | 03:19 AM
రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకునేందుకు పెద్ద మనసుతో అనేక మంది దాతలు ముందుకొస్తున్నారు.
జీవీకే, దివీస్ సంస్థలు రూ.5 కోట్ల చొప్పున విరాళం
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లకు చెక్కుల అందజేత
అమరావతి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకునేందుకు పెద్ద మనసుతో అనేక మంది దాతలు ముందుకొస్తున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి, సీఎం సహాయ నిధికి పలువురు దాతలు విరాళాలను చెక్కుల రూపంలో అందజేశారు. విరాళాలు అందజేసిన దాతలకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. జీవీకే ఫౌండేషన్ చైర్మన్ జీవీకే రెడ్డి, జీవీ సంజయ్‌రెడ్డి రూ.5కోట్ల చెక్కు అందజేశారు. కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ చైర్మన్ అరుణ్ అలగప్ప, ఎండీ శంకర్‌సుబ్రహ్మణ్యం రూ.కోటీ 50లక్షలు, కాంటినెంటల్ కాఫీ తరఫున చల్లా శ్రీకాంత్ రూ.కోటీ 11లక్షలు, చల్లా రాజేంద్రప్రసాద్ ఫ్యామిలీ ఫౌండేషన్ తరఫున చల్లా అజిత రూ.కోటి, ట్రైజియో టెక్నాలజీస్ ప్రైవైట్ లిమిటెడ్ ఎండీ వేములపల్లి అశోక్, వేములపల్లి రోహిత్ రూ.కోటి, లారస్ ల్యాబ్స్ ఫౌండర్, సీఈవో డాక్టర్ సత్యనారాయణ చావా, నాగరాణి చావా రూ.కోటి అందించారు. అదేవిధంగా నెల్లూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గంటా రమణయ్య నాయుడు, ఆయన కుమారుడు రమేశ్, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు కుమారులు ధనుష్, కార్తీక్ సంయుక్తంగా రూ.కోటి రూపాయల విరాళాన్ని సీఎం చంద్రబాబుకు అందజేశారు. అలాగే, చలసాని చాముండేశ్వరి, శ్రీమన్ రూ.25లక్షలు, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ రూ.2లక్షలు, నరసింహారావు రూ.2లక్షలు సీఎంకు చెక్కు రూపంలో అందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు వారితో మాట్లాడుతూ ఇలాగే ప్రజాసేవలో పాల్గొంటూ ముందుకు సాగాలని అభినందించారు.
దివీస్ సంస్థ మొత్తం 9.8కోట్ల భూరి విరాళం!
దివీస్ సంస్థ సీఈవో దివి కిరణ్ ఆదివారం హైదరాబాద్‌లో మంత్రి నారా లోకేశ్‌ను కలిసి రూ.5కోట్ల చెక్కును అందజేశారు. ఈ నెల 1 నుంచి 8 వరకు వరద బాధితులకు ఆహారాన్ని అందించేందుకు ఇంతకుముందే అక్షయపాత్ర ఫౌండేషన్‌కు దివీస్ సంస్థ రూ.4.8కోట్లను అందజేసింది. మొత్తం రూ.9.8కోట్లు విరాళమిచ్చిన దివీస్‌ను లోకేశ్ అభినందించారు.