Share News

బిగ్‌బాస్‌ షోపై తీర్పు రిజర్వ్‌

ABN , Publish Date - Sep 12 , 2024 | 03:17 AM

యువతను పెడదారి పట్టించడంతోపాటు అశ్లీలత, హింసను ప్రోత్సహించేలా ఉన్న బిగ్‌బాస్‌ రియాలిటీ షో ప్రసారాన్ని నిలిపివేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌)పై హైకోర్టులో వాదనలు ముగిశాయి.

బిగ్‌బాస్‌ షోపై తీర్పు రిజర్వ్‌

హైకోర్టులో ముగిసిన వాదనలు

అమరావతి, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): యువతను పెడదారి పట్టించడంతోపాటు అశ్లీలత, హింసను ప్రోత్సహించేలా ఉన్న బిగ్‌బాస్‌ రియాలిటీ షో ప్రసారాన్ని నిలిపివేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌)పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. దీంతో తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ప్రకటించింది. సామాజిక కార్యకర్త, సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి ఈ పిల్‌ దాఖలు చేశారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది శివప్రసాద్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. బిగ్‌బాస్‌ షో అశ్లీలత, అసభ్యతను ప్రోత్సహించేదిలా ఉందని, సెన్సార్‌ లేకుండా షోను ప్రసారం చేస్తున్నారని తెలిపారు. నిబంధనల ప్రకారం అశ్లీలత ఉన్న కార్యక్రమాలను రాత్రి 11, ఉదయం 5 గంటల మధ్య మాత్రమే ప్రసారం చేయాలన్నారు.

అయితే, కార్యక్రమంలో అశ్లీలతను వివరించేందుకు న్యాయవాది వాడుతున్న భాషపై ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. కాగా, వ్యాజ్యంలో సినీనటుడు నాగార్జున ప్రతివాదిగా ఉన్నారని, ఆయన ఇప్పటివరకు వకాలత్‌ వేయలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది తెలిపారు. స్టార్‌ ఇండియా తరఫున సీనియర్‌ న్యాయవాది ఒ.మనోహర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ... టీవీ ప్రసారాల్లో అశ్లీలతపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యామ్నాయమార్గం ఉందన్నారు. కేబుల్‌ టీవీ నెట్‌వర్క్‌ చట్టం ప్రకారం ఫిర్యాదులను పరిశీలించేందుకు మూడు అంచెల వ్యవస్థ ఉందని తెలిపారు. చట్టనిబంధనలకు లోబడే కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నామన్నారు. అశ్లీలతపై పిటిషనర్‌ ఎలాంటి ఆధారాలనూ కోర్టు ముందు ఉంచలేదన్నారు.

Updated Date - Sep 12 , 2024 | 06:45 AM