Share News

111 స్థానాల ఫలితాలు

ABN , Publish Date - May 30 , 2024 | 02:23 AM

రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో 111 స్థానాల్లో 20 రౌండ్లలోపు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌కుమార్‌ మీనా చెప్పారు.

111 స్థానాల ఫలితాలు

జూన్‌ 4న మధ్యాహ్నం 2గంటల్లోపే

మరో 61 సీట్లకు సాయంత్రం 4లోగా ప్రకటిస్తాం.. మిగిలిన మూడు స్థానాలకూ 6 గంటల్లోపు వెల్లడి

రాత్రి 9గంటల్లోపే తుది ఫలితాలు: సీఈవో మీనా

కౌంటింగ్‌ రోజున ఎక్కడా హింస జరగకూడదు

రాష్ట్రవ్యాప్తంగా గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయండి

గుర్తింపు కార్డులు ఉన్నవారే లెక్కింపు కేంద్రాల్లోకి

కచ్చితమైన ఫలితాలు.. త్వరితగతిన ప్రకటించాలి

సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ నితీశ్‌ వ్యాస్‌

ఢిల్లీ నుంచి రాష్ట్ర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌

అమరావతి, మే 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో 111 స్థానాల్లో 20 రౌండ్లలోపు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌కుమార్‌ మీనా చెప్పారు. ఈ సీట్ల ఫలితాలను మధ్యాహ్నం 2గంటల్లోగా ప్రకటిస్తామని తెలిపారు. మరో 61 స్థానాల్లో 21- 24 రౌండ్ల వరకూ లెక్కింపు ప్రక్రియ ఉంటుందని, సాయంత్రం 4గంటల్లోపు వీటి ఫలితాలు కూడా వస్తాయన్నారు. ఇక మిగిలిన 3 సీట్లలోనూ 25 రౌండ్లకు పైబడి ఓట్ల లెక్కింపు కొనసాగుతుందని, ఇక్కడ కూడా సాయంత్రం 6గంటల్లోపు ఓట్ల లెక్కింపు పూర్తి అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు నిమిత్తం నియోజకవర్గాల వారీగా చేస్తున్న ఏర్పాట్లను సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ నితీశ్‌ వ్యాస్‌ బుధవారం ఢిల్లీలోని నిర్వచన్‌ సదన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ, ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని వచ్చేనెల 4న విజయవతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని, సత్వరమే ఫలితాల ప్రకటనకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. టేబుళ్లను పెంచి పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు ప్రక్రియను సకాలంలో కూడా పూర్తి చేస్తామని తెలిపారు. రాత్రి 8-9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటించే విధంగా ప్రణాళికా బద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు రోజు ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్ఠమైన భద్రతా ఏర్పా ట్లు చేస్తున్నామని వివరించారు. ఆయా జిల్లాల్లో 144 సెక్షన్‌ అమలుతో పాటు పర్యవేక్షణ విధుల్లో సీనియర్‌ అధికారులను నియమించామని చెప్పారు. పల్నాడు జిల్లాలో డీజీపీతో పాటు తాను స్వయంగా పర్యటించి అక్కడి పరిస్థితులను పరిశీలించానని, అధికారులతో సమీక్ష నిర్వహించి వారిని అప్రమత్తం చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తాను పర్యటిస్తూ ఓట్ల లెక్కింపునకు, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించానని తెలిపారు.

పల్నాడులో మరింత అప్రమత్తం: వ్యాస్‌

ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ నితీశ్‌ వ్యాస్‌ ఆదేశించారు. సీఈవో మీనా నేతృత్వంలో ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్ని నియోజకవర్గాల ఆర్వోలు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సీపీలకు సూచించారు. ఓట్ల లెక్కింపు రోజు ఎటువంటి జాప్యానికి అవకాశం లేకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, కచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించాలని స్పష్టం చేశారు. లెక్కింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫాం-21సీ, ఫాం-21ఈ లను అదే రోజు విమానంలో ఈసీఐకి పంపాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు సమయంలో అభ్యర్థులు, ఏజెంట్లు ఎటువంటి అవాంతరాలు కలిగించకుండా ఈ ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలపై ముందుగానే వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని నిర్దేశించారు.

ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో, స్ట్రాంగ్‌ రూంల్లో కూలీల సేవలు వినియోగించుకునే అంశంలో అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులను వినియోగించొద్దని, గుర్తింపు కార్డులు ఉన్నవారినే లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతించాలని స్పష్టం చేశారు. ఎన్నికల అనంతరం పలు హింసాత్మక ఘటనలు జరిగిన పల్నాడు జిల్లాలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర పోలీస్‌ నోడల్‌ అధికారి ఏడీజీ శంఖబ్రత బాగ్చీ మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అన్ని జిల్లాల ఎస్పీలు, సీపీలను అప్రమత్తం చేశామని వివరించారు. ఈ సమీక్షకు ఆన్ని నియోజకవర్గాల ఆర్వోలు, జిల్లా ఎన్నికల అఽధికారులు, ఎస్పీలు హాజరయ్యారు.

Updated Date - May 30 , 2024 | 02:23 AM