Share News

‘రివర్స్‌’ రివర్సయింది!

ABN , Publish Date - Sep 16 , 2024 | 03:14 AM

జగన్‌ ప్రభుత్వం అట్టహాసంగా తీసుకొచ్చిన రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం రివర్స్‌లోకి నెట్టింది.

‘రివర్స్‌’ రివర్సయింది!

జలవనరుల శాఖలో తిరిగి 2003 నాటి టెండర్‌ విధానం

అమరావతి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): జగన్‌ ప్రభుత్వం అట్టహాసంగా తీసుకొచ్చిన రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం రివర్స్‌లోకి నెట్టింది. మళ్లీ 2003 నాటి జీవో 94ను అమల్లోకి తెచ్చింది. తక్కువ ధరకు పనులు పూర్తి చేస్తామంటూ లిఖితపూర్వకంగా వేసే బిడ్లను ఆమోదించే ప్రక్రియను తీసుకొచ్చింది. టెండర్‌లో పాల్గొన్న కాంట్రాక్టు సంస్థల్లో ఎల్‌-1గా ఉన్న సంస్థకు పనులు అప్పగించే విధానాన్ని అమలు చేస్తామంటూ గత నెలలో జరిగిన భేటీలో రాష్ట్ర కేబినెట్‌ తీర్మానాన్ని ఆమోదించిన సంగతి తెలిసిందే. పోలవరం ప్రాజెక్టులో రివర్స్‌ టెండర్‌ విధానంతో ఏకంగా రూ.860 కోట్లు ఆదా చేశామంటూ జగన్‌ ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. కానీ వాస్తవాన్ని పరిశీలిస్తే ఈ రివర్స్‌ టెండర్‌లో పనులు పొందిన కాంట్రాక్టు సంస్థకు తెరవెనుక కట్టబెట్టిందే ఎక్కువని తేలింది. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు వీటిన్నిటినీ పరిశీలించి.. రివర్స్‌ టెండర్‌ విధానాన్ని సమీక్షించింది. ఇదే సమయంలో రాష్ట్ర చీఫ్‌ ఇంజనీర్ల బోర్డు కూడా రివర్స్‌ టెండర్‌ విధానం రద్దుకు సిఫారసు చేస్తూ గత నెల 8న ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో గత నెలలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో రివర్స్‌ టెండర్‌ విధానాన్ని రద్దు చేయాలన్న జల వనరుల శాఖ ప్రతిపాదనను ఆమోదించారు. దీంతో.. 2003 జూలై ఒకటో తేదీన జారీ చేసిన జీవో 94 మేరకు టెండర్‌ విధానాన్ని అమల్లోకి తెస్తూ జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ ఆదివారం ఉత్తర్వు జారీ చేశారు.

Updated Date - Sep 16 , 2024 | 03:14 AM