AP Elections 2024: ‘అతి’పై తిరుగుబాటు షురూ
ABN , Publish Date - Apr 30 , 2024 | 04:16 AM
సీఎం జగన్ కోసం ట్రాఫిక్ నియంత్రణలో కొన్నేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న ‘అతి’పై తిరుగుబాటు మొదలైంది. ఇన్నాళ్లుగా ఈనరకం భరిస్తూ వచ్చిన జనం తెనాలిలో పోలీసులపై దండెత్తారు.
పొన్నూరులో సభ కోసం తెనాలిలో బారికేడ్లా?
సీఎం కోసం ట్రాఫిక్ నియంత్రణలో‘అతి’పై తొలి తిరుగుబాటు
తెనాలిలో పోలీసులపై దండెత్తిన జనం
అడ్డుపెట్టిన బారికేడ్లు తోసుకుని ముందడుగు
తెనాలి, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): సీఎం జగన్ కోసం ట్రాఫిక్ నియంత్రణలో కొన్నేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న ‘అతి’పై తిరుగుబాటు మొదలైంది. ఇన్నాళ్లుగా ఈనరకం భరిస్తూ వచ్చిన జనం తెనాలిలో పోలీసులపై దండెత్తారు. అడ్డుగా పెట్టిన బారికేడ్లు తెంపుకొని ముందడుగు వేశారు. ఆ వివరాల్లోకి వెళితే.. పొన్నూరులో సీఎం జగన్ సభ. రోడ్డు మార్గంలో కాకుండా హెలికాప్టరులోనే నేరుగా చేరుకున్నారు. పైగా తెనాలితో అసలు సంబంధమే లేని రూట్ అది. కానీ, అక్కడకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న తెనాలిలో బారికేడ్లు అడ్డంపెట్టారు! వాహనాలు కదలకుండా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో జనం ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎక్కడ సభకు ఎక్కడ హడావుడి చేస్తున్నారంటూ పోలీసులకు ఎదురుతిరిగారు. అడ్డంగా పెట్టిన బారికేడ్లను తోసుకొంటూ ముందుకు వెళ్లిపోయారు. ఈ సమయంలో పోలీసులకు, వాహనదారులకు మధ్యతీవ్రస్థాయిలో వాగ్యుద్ధం సాగింది. ఆకాశంలో పోయేవాడికోసం మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారని నిలదీశారు. ‘ఎండలు మండిపోతుంటే, ట్రాఫిక్ ఆపేదేంటి?’’ అంటూ కొందరు ఆగ్రహిస్తే, ‘‘ఏం చేస్తున్నారో మీకు తెలుస్తోందా? అసలు ఎన్నికల కోడ్ ఉన్నట్టా లేనట్టా?’’ అని మరికొందరు పోలీసులను నిలదీశారు. అంతకుముందు... తెనాలి నుంచి గుంటూరు వెళ్లే ప్రజలను వెళ్లనివ్వకుండా ఓవర్ బ్రిడ్జి దగ్గర వాహనాలను పోలీసులు ఆపేశారు. కొద్దిసేపు ద్విచక్ర వాహనాలను వదిలినా, తర్వాత వాటినీ నిలిపివేశారు. మండే ఎండలోనే జనం కొద్దిసేపు నిరీక్షించారు. ఎంతసేపటికీ ట్రాఫిక్ వదలక పోవటంతో పోలీసుల వద్ద ఆరా తీశారు. పొన్నూరులో సీఎం సభ ఉందని, అందువల్ల తెనాలి నుంచి వాహనాలను ఆపేశామని వారు చెప్పడంతో జనానికి చిర్రెత్తుకువచ్చింది. పొన్నూరుతో సంబంధంలేని మాకు ఈ అవస్థలేంటని పోలీసులతో గొడవకు దిగారు. చివరకు కొందరు యువకులు ముందుకొచ్చి బారికేడ్‌లను తోసేసిమరీ ముందుకు వెళ్లిపోయారు. అయినా పోలీసులు మధ్యమధ్యలో ఆపటం, జనం తోసేయటం కొనసాగింది.