మునిగిన ఇంటికి రూ.25 వేలు!
ABN , Publish Date - Sep 18 , 2024 | 05:21 AM
కనీవినీ ఎరుగని వరదల తాకిడికి తీవ్రంగా నష్టపోయిన విజయవాడ నగర వరద బాఽధితులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ పరిహార ప్యాకేజీని ప్రకటించింది.
బెజవాడ వరద బాధితులకు భారీ ప్యాకేజీ
ఉద్యాన పంటలకు పరిహారంపై అధికారులు కొంత తగ్గించి ప్రతిపాదనలు తయారుచేశారు. ఆ మొత్తం చాలదని భావించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, విలేకరుల సమావేశంలోనే వాటిని మార్చేశారు. దెబ్బతిన్న పంటలకు ఇచ్చినట్టే ఉద్యాన పంటల సాగుకు కూడా ఎకరానికి రూ.పది వేలు ఇస్తున్నట్లు ప్రకటించారు. పంటల సాగును కౌలుదార్లు చేస్తుంటే పరిహారం వారికే ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
నేటి నుంచే పరిహారం.. ఖాతాలకు సొమ్ము
ఫస్ట్ ఫ్లోర్, ఆపై ఉన్న ఫోర్లకు రూ.10 వేలు
బైకులకు 3 వేలు.. ఆటోలకు రూ.పది వేలు
షాపులకు 50 వేల నుంచి 1.50 లక్షల వరకు
బాధితులకు బ్యాంకు నుంచి కొత్త రుణాలు
పంట నష్టానికి ఎకరానికి రూ.10-14 వేలు
అద్దెకు ఉండేవారికీ, కౌలుదార్లకే పరిహారం
గేదెలు, ఆవులు చనిపోతే రూ.50 వేలు
రాష్ట్రంలోని మిగిలిన చోట్ల వరదకు గురైన
కుటుంబానికి రూ.పది వేల పరిహారం
చరిత్రలో ఇంత భారీ పరిహారం ఇప్పుడే: సీఎం
అమరావతి, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): కనీవినీ ఎరుగని వరదల తాకిడికి తీవ్రంగా నష్టపోయిన విజయవాడ నగర వరద బాఽధితులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ పరిహార ప్యాకేజీని ప్రకటించింది. మంగళవారం రాత్రి సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్యాకేజీ వివరాలను వెల్లడించారు. బుధవారం నుంచే నష్ట పరిహారం పంపిణీ ప్రారంభమవుతుందని, వీలైనంతవరకూ రెండు మూడు రోజుల్లోనే బాధితుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని తెలిపారు. దీని ప్రకారం...వరదల్లో మునిగిన ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నవారికి ప్రతి కుటుంబానికి రూ.పాతికవేలు ఇస్తారు. ఆ పై అంతస్థుల్లో ఉన్నవారికి వారు పడిన ఇబ్బందులకు... పని పోయినందుకు పరిహారంగా ప్రతి కుటుంబానికి రూ. పది వేలు అందిస్తారు. పరిహారం ఇళ్లలో ఎవరు ఉంటే వారికే ఇస్తామని, అద్దెకు ఉండేవారు ఉంటే వారికే వ స్తుందని ముఖ్యమంత్రి విస్పష్టంగా ప్రకటించారు. విజయవాడ నగరం, దానిని ఆనుకొని ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 172 వార్డు, గ్రామ సచివాలయాల పరిధిలో ఈ ప్యాకేజీ వర్తిస్తుంది. షాపులు, ఇతర వాణిజ్య సంస్ధలకు వాటిల్లిన నష్టం ఎక్కువగా ఉండటంతో వాటికి వేరే ప్యాకేజీ ప్రకటించారు. చిన్న కిరాణా షాపులు, టీ కొట్లకు రూ.పాతిక వేలు, వ్యాపారం కింద నమోదై రూ.నలభై లక్షల లోపు టర్నోవర్ ఉన్న వాణిజ్య సంస్ధలకు రూ.ఏభై వేలు, రూ.నలభై లక్షల నుంచి రూ.కోటిన్నర వరకూ టర్నోవర్ ఉన్న షాపులకు రూ.లక్ష, అంతకు పైన టర్నోవర్ ఉన్న వాణిజ్య సంస్ధలకు రూ. లక్షన్నర పరిహారంగా ఇస్తారు. ద్విచక్ర వాహనాల రిపేర్లకు రూ. మూడు వేలు ఇస్తారు. ఆటోలకు రూ. పది వేలు ఇస్తారు. తోపుడు బళ్ళు పోయినా... దెబ్బతిన్నా ప్రభుత్వం వాటిని ఉచితంగా సమకూరుస్తుంది. చేనేత పనివారి మగ్గం పూర్తిగా పోతే రూ.పాతిక వేలు ఇస్తారు. గేదెలు, ఆవులు చనిపోతే రూ.ఏభై వేలు ఇస్తారు. ఎద్దులు చనిపోతే ఒక్కోదానికి రూ. నలభై వేలు అందిస్తారు. పశువుల కొట్టం పోతే రూ. ఏడున్నర వేలు ఇస్తారు. ఇల్లు పూర్తిగా పోతే కొత్త ఇల్లు ఇస్తారు.
పంట నష్ట పరిహారం ఇలా...
పంట నష్టం కింద కొన్ని పంటలకు ఎకరానికి రూ. పది వేలు, కొన్ని వాణిజ్య పంటలకు రూ. 14 వేలు చంద్రబాబు ప్రకటించారు. ఆ వివరాలు.. దెబ్బతిన్న హెక్టారు పత్తి-రూ.25 వేలు, వేరుశెనగ-25 వేలు, వరి-25 వేలు, చెరుకు-25 వేలు, సజ్జ-15 వేలు, మినుము-15 వేలు, పెసర-15 వేలు, మొక్కజొన్న-15 వేలు, రాగి-15 వేలు, కంది-15 వేలు, నువ్వులు-15 వేలు, సోయాబీన్-15 వేలు, సన్‌ఫ్లవర్-15 వేలు, పొగాకు-15 వేలు, ఆముదం-15 వేలు, జ్యూట్-15 వేలు, కొర్ర-15 వేలు, సామ-15 వేలు. అలాగే, ఉద్యాన పంటలకు పరిహారం అందిస్తామని తెలిపారు. ఆ వివరాలు.. వరద దెబ్బకు గురైన హెక్టారు అరటి పంటకు-రూ.35 వేలు, పసుపు-35 వేలు, కూరగాయలు-25 వేలు, తమలపాకు-75 వేలు, మిర్చి-35 వేలు, బొప్పాయి-25 వేలు, టమాటా-25 వేలు, జామ-35 వేలు, పూలు-55 వేలు, ఉల్లి-25 వేలు, నిమ్మ-35 వేలు, మామిడి-35 వేలు, పుచ్చకాయ-25 వేలు, నర్సరీలు-25 వేలు, దానిమ్మ-35 వేలు, యాపిల్ బేర్-35 వేలు, సపోటా-35 వేలు, కొత్తిమేర-25 వేలు, జీడి మామిడి-35 వేలు, డ్రాగన్ ఫ్రూట్-35 వేలు, ఆయిల్‌పామ్(మొక్కకు)-రూ.1,500, కొబ్బరి(మొక్కకు)-1,500.
కొత్త రుణాలు
వరదల్లో ఇళ్లు మునిగిపోయిన గ్రౌండ్ ఫ్లోర్ బాధితులకు రూ.ఏభై వేల రుణం బ్యాంకుల నుంచి ఇప్పిస్తామని, మూడు నెలల మారిటోరియం ఉంటుందని... 36 నెలల వాయిదాల్లో దానిని తీర్చాల్సి ఉంటుందని చంద్రబాబు తెలిపారు. షాపులకు ఇప్పటికే ఉన్న రుణాలను రీ షెడ్యూల్ చేసి ఏడాది మారిటోరియంతో కొత్త రుణాలు ఇప్పిస్తామని, వ్యవసాయానికి స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు రీ షెడ్యూల్ చేసి కొత్త రుణాలు ఇప్పిస్తామని చెప్పారు. తమ వద్ద ఉన్న లెక్కల ప్రకారం విజయవాడ నగరంలో 2.72 లక్షల కుటుంబాలు వరద బారిన పడ్డాయని, ఏడు లక్షల మంది ప్రభావితం అయ్యారని తెలిపారు. విద్యార్థుల ఫీజుల చెల్లింపు ఒక నెల వాయిదా వేశామని, వరద ప్రాంతాల్లో ఆస్తి పన్ను చెల్లింపు మూడు నెలలు వాయిదా వేశామని చెప్పారు. విద్యార్థుల పుస్తకాలు, సర్టిఫికెట్లు వరదల్లో పోయి ఉంటే, తిరిగి ఇస్తామని తెలిపారు. కేంద్రంతో మాట్లాడుతున్నామని, కొంత సాయం అందుతుందని ఆశిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో నాలుగు వేల కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. బుడమేరు ఆక్రమణలను తొలగించడానికి ఆపరేషన్ బుడమేరు మొదలు పెడతామని ఆయన చెప్పారు. కాగా, వరదల తాకిడికి గురైన రాష్ట్రంలోని మిగిలిన చోట్ల కుటుంబానికి రూ.పది వేలు ఇస్తామని సీఎం వెల్లడించారు.
రూ. 300 కోట్ల మేర విరాళాలు
వరద బాధితులను ఆదుకోవాలంటూ ప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు స్పందించి దాతలు మంగళవారం వరకూ రూ. మూడు వందల కోట్ల మేర విరాళాలు అందించారని ముఖ్యమంత్రి తెలిపారు. ఇంకో వంద నుంచి రూ. నూటా ఏభై కోట్లు అందుతాయని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. ‘మా శక్తినంతా వెచ్చించి పనిచేశాం. మేం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని విశ్వసించి అనేక మంది వచ్చి విరాళాలు ఇస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే పుతుంబాక భారతి తన చేతి బంగారు గాజులు ఇచ్చారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇస్తున్నారు. అహ్మదాబాద్ వెళ్తే అక్కడ కూడా మన కృషిని మెచ్చుకొన్నారు. దేశం అంతా గుర్తించింది’ ’ అని ఆయన పేర్కొన్నారు. మీడియా సమావేశంలో మంత్రులు పొంగూరు నారాయణ, పయ్యావుల కేశవ్, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు.