ఆర్‌యూ ఖజానా ఖాళీ..!
ABN , Publish Date - Dec 08 , 2024 | 11:31 PM
ద్రావిడ వర్సిటీ పరిస్థితే రాయలసీమ యూనివర్సిటీకి రానుందా.. విద్యార్థుల ఫీజుల నుంచి జీతాలు చెల్లించడంతో ఖజానా ఖాళీ కానుందా.. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే చెప్పాలి.
విద్యార్థుల ఫీజుల నుంచే జీతాలు
ఏటా రూ.10 కోట్లు చెల్లిస్తున్న ఆర్‌యూ
భారంగా మారిన 296 మంది ఉద్యోగులు వేతనాలు
కర్నూలు అర్బన, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): ద్రావిడ వర్సిటీ పరిస్థితే రాయలసీమ యూనివర్సిటీకి రానుందా.. విద్యార్థుల ఫీజుల నుంచి జీతాలు చెల్లించడంతో ఖజానా ఖాళీ కానుందా.. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే చెప్పాలి. పొరుగు సేవల కింద అడ్డగోలుగా ఉద్యోగాలు ఇచ్చిన ద్రావిడ వర్సిటీ వారి జీతాల చెల్లింపునకు విద్యార్థుల ఫీజులను వాడుకోవడంతో ఖజానా ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాయలసీమ యూనివర్సిటీలోనూ ఇదే పరిస్థితి నెలకొందని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థులు చెల్లించిన ఫీజుల నుంచి ఏటా రూ.10 కోట్ల దాకా ఉద్యోగులకు జీతాలు చెల్లించడమే ఇందుకు కారణం. రాష్ట్రంలో 12బీ గుర్తింపు ఉన్న వర్సిటీలో రాయలసీమ యూనివర్సిటీ ఒక్కటి. ఇందులో ఏడుగురు అధ్యాపకులు మాత్రమే సీఎఫ్‌ఎంఎస్ నుంచి జీతాలు తీసుకుంటున్నారు. మరో 24 మంది నాన టీచింగ్ రెగ్యులర్ ఉద్యోగులకు ప్రభుత్వం సీఎఫ్‌ఎంఎస్ నుంచి జీతాలు గత జూన 5 నుంచి నిలిపివేసింది. దీంతో వారికి వర్సిటీ నుంచి విద్యార్థుల ఫీజుల నుంచి జీతాలు ఇస్తున్నారు. ఇప్పుడే ఇదే యూనివర్సిటీకి పెనుభారంగా మారింది. 2017లో 102 మంది ఉద్యోగులకు టైం స్కేల్ గుర్తింపు ఇవ్వడం రూల్ ఆఫ్ రిజర్వేషనకు వ్యతిరేకమని, రద్దు చేయాలని అప్పటి ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి శ్యామలరావు వర్సిటీ ఉపకులపతులను ఆదేశించినా పట్టించుకోలేదు. దీంతో వర్సిటీ ఉద్యోగులకు నెలకు రూ.80 లక్షల ప్రకారం ఏడాదికి రూ.10 కోట్ల మేర జీతాలు చెల్లించాల్సి వస్తోంది. అయితే ఈ మొత్తం విద్యార్థుల ఫీజులు, ప్రైవేట్ డిగ్రీ, బీఈడీ కళాశాలల నుంచి వచ్చే డబ్బుతో సర్దుబాటు చేస్తున్నారు. ఇలా చేయడం ఎంత వరకు సమంజసమని కొందరు ప్రొఫెసర్లు అంటున్నారు. దీంతో రాయలసీమ యూనివర్సిటీ ఖజాన ఖాళీ అయి ద్రావిడ వర్సిటీ తరహాలో అవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఫ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం- బోయ విజయకుమార్ నాయుడు, రిజిష్ట్రార్, రాయలసీమ యూనివర్సిటీ
జీతాలు విద్యార్థుల ఫీజుల నుంచి ఇస్తున్న మాట వాస్తవమే. ఆ సమస్యపైనే దృష్టి సారించాను. గతంలో జాప్యం ఎందుకు జరిగిందో నాకు తెలియదు. సీఎఫ్‌ఎంఎస్ డేటాలో ఉద్యోగులను చేర్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఉన్నత విద్యామండలికి ఫైలు సిఫారసు చేస్తున్నాం.