Share News

సజ్జన్‌ బచ్‌గయా

ABN , Publish Date - Aug 28 , 2024 | 03:50 AM

సజ్జన్‌ జిందాల్‌! జేఎ్‌సడబ్ల్యూ స్టీల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌! దేశంలోనే అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తల్లో ఒకరు!

సజ్జన్‌ బచ్‌గయా

‘మిస్టరీ లవ్‌స్టోరీ‘లో కీలక మలుపు!

ముంబైలో సజ్జన్‌ జిందాల్‌పై నటి రేప్‌ కేసు

రాజీకి ససేమిరా అనడంతో ఇరకాటం

జగన్‌ను ఆశ్రయించిన పారిశ్రామికవేత్త

ఆమెను దారికి తెచ్చేందుకు ఇక్కడ కేసు

‘కౌంటర్‌ కేసు’ వ్యూహంలో సజ్జల పాత్ర!?

ఇబ్రహీంపట్నంలో ఆమెపై కేసు పెట్టిన వైసీపీ నేత

రంగంలోకి ఐపీఎ్‌సలు కాంతిరాణా, విశాల్‌ గున్నీ

ఆగమేఘాల మీద ముంబై వెళ్లి నటి అరెస్టు

తల్లిదండ్రులనూ అరెస్టు చేసి చిత్ర హింసలు

జిందాల్‌పై కేసు విత్‌డ్రా చేసుకోవాలని హెచ్చరిక

రాజీకి అంగీకరించాకే ఆమె బెయిలుపై విడుదల

అక్కడ కేసు వాపస్‌.. ఇక్కడ కేసు క్లోజ్‌

ల్యాండ్‌ సెటిల్‌మెంట్లు చూసి ఉంటారు!

ఫైనాన్స్‌ సెటిల్‌మెంట్లు చూసి ఉంటారు!

ఆస్తుల సెటిల్‌మెంట్లూ చూసి ఉంటారు!

కానీ.. ఇది ‘లవ్‌’ సెటిల్‌మెంట్‌!

దేశంలోనే బడా పారిశ్రామిక వేత్త ఒకరిని కాపాడేందుకు చేసిన బెదిరింపుల సెటిల్‌మెంట్‌! అందులోనూ ఒక సీఎం ఆదేశంతో.. ప్రభుత్వ సలహాదారు రంగంలోకి దిగి.. ఇద్దరు ఐపీఎ్‌సలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరీ చేసిన సెటిల్‌మెంట్‌! మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన ‘మిస్టరీ లవ్‌ స్టోరీ’లో ఇదో భారీ మలుపు!

(విజయవాడ - ఆంధ్రజ్యోతి)

సజ్జన్‌ జిందాల్‌! జేఎ్‌సడబ్ల్యూ స్టీల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌! దేశంలోనే అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తల్లో ఒకరు! అలాంటి ప్రముఖుడిపై గత ఏడాది ముంబైకి చెందిన ఒక నటి ‘రేప్‌’ కేసు పెట్టింది. అప్పట్లో ఇదో సంచలనం. అయితే... కొద్ది రోజులకే అదే నటి సజ్జన్‌ జిందాల్‌పై కేసును వాపస్‌ తీసుకుంది! కేసు పెట్టడానికి, వాపస్‌ తీసుకోవడానికి మధ్య విజయవాడ కేంద్రంగా ఒక భారీ ‘సెటిల్‌మెంట్‌’ నడిచింది. అక్కడ ‘బాధితురాలి’గా సజ్జన్‌ జిందాల్‌పై కేసు పెట్టిన ముంబై నటిని... ఇక్క డ నిందితురాలిగా చేర్చి ఒక కేసు పెట్టారు. ఆమెను, ఆమె తల్లిదండ్రులనూ అరెస్టు చేసి నెలకుపైగా జైలులో ఉంచారు. ఇక్కడ బెయిలుపై విడుదలైన తర్వాత... అక్కడ సజ్జన్‌ జిందాల్‌పై పెట్టిన రేప్‌ కేసును ఆమె ఉపసంహరించుకున్నారు. వెరసి... జిందాల్‌ను రక్షించేందుకు అప్పటి ప్రభుత్వ పెద్దలే రంగంలోకి దిగి, ముంబై నటిపై కేసు పెట్టి, ఆమెను అరెస్టు చేయించి, బెదిరించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రేప్‌ కేసులో ఇరుక్కుని...

ముంబై నటి 2023 డిసెంబరులో సజ్జన్‌ జిందాల్‌పై రేప్‌ కేసు పెట్టింది. ఒక పెంట్‌ హౌస్‌లో ఆయన తనపై అత్యాచారం చేసినట్లు ఆరోపించింది. సజ్జన్‌ జిందాల్‌ చిక్కుల్లో ఇరుకున్నారు. ఆమె కేసు విత్‌డ్రా చేసుకోకుంటే కోర్టు విచారణ ఎదుర్కోక తప్పదు! దీంతో... ఆమెతో రాజీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ రాజీ ఎపిసోడ్‌లో వైసీపీ నేత, 2014లో పెనమలూరు వైసీపీ అభ్యర్థి, ఓ మోస్తరు పారిశ్రామిక వేత్త అయిన కేవీఆర్‌ విద్యాసాగర్‌ కూడా ప్రవేశించారు. ఆయనకు సదరు ముంబై నటితోపాటు సజ్జన్‌ జిందాల్‌తోనూ పరిచయముంది. కేసు వాపసు తీసుకునేందుకు ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నించారు. కానీ, అందుకు ఆమె ససేమిరా అన్నా రు! ‘ఇది ఇలా తెగే వ్యవహారం కాదు! ఆమెను దారికి తెచ్చుకునేందుకు మనదైన స్టైల్‌లో ముందుకెళదాం’ అన్నట్లుగా ఈ మ్యాటర్‌ను అప్పటి సీఎం జగన్‌ ముందుకు తీసుకెళ్లారు. సజ్జన్‌ జిందాల్‌కు జగన్‌ సన్నిహితుడనే విషయం అందరికీ తెలుసు. ఇక... విద్యాసాగర్‌కూ జగన్‌తో మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలో... సజ్జన్‌ జిందాల్‌, విద్యాసాగర్‌ ఇద్దరూ కలిసి ఈ ఏడాది ఫిబ్రవరిలో జగన్‌ను కలిసినట్లు సమాచారం. ఆ తర్వాతే... ‘కౌంటర్‌’ వ్యూహం అమలులోకి వచ్చింది.


ఇబ్రహీంపట్నంలో కేసు

జగన్‌తో సజ్జన్‌ జిందాల్‌ భేటీ అనంతరం... ఈ వ్యవహారాన్ని నేరుగా డీల్‌ చేసేందుకు సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి రంగంలోకి దిగినట్లు సమాచారం. తమ వ్యూహంలో భాగంగా కేవీఆర్‌ విద్యాసాగర్‌ అదే ముంబై నటిపై విజయవాడ కమిషనరేట్‌ పరిధిలోని ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టారు. ఆమె తనను బ్లాక్‌ మెయిల్‌ చేసిందనీ, కొన్ని సంతకాలు చేయించుకుందనీ ఆరోపించారు. సలహాదారు ఆదేశాలతో అప్పటి విజయవాడ పోలీసు కమిషనర్‌ కాంతి రాణా ఆగమేఘాల మీద స్పందించారు. అప్పటి డీసీపీ విశాల్‌ గున్నీ నేతృత్వంలో ప్రత్యేక బృందం ముంబైకి వెళ్లింది. దర్యాప్తు అధికారి సత్యనారాయణతోపాటు ఏసీపీలు రమణమూర్తి, హనుమంతరావు ముంబైకి వెళ్లారు. అక్కడ... ముంబై నటిని, ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేశారు. తొలుత అక్కడి కోర్టులో హాజరుపరచి ట్రాన్సిట్‌ వారెంట్‌పై ఇక్కడికి తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత నటి కుటుంబ సభ్యులను దారుణంగా వేధించినట్టు తెలుస్తోంది. నాడు కమిషనరేట్‌లో ఉంటూ చక్రం తిప్పి, ఇప్పుడు వీఆర్‌లో ఉన్న ఒక ఎస్‌ఐ నటి పట్ల దారుణంగా ప్రవర్తించినట్టు తెలిసింది. ఆ నటితోపాటు ఆమె కుటుంబ సభ్యులను చిత్రహింసలు పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత పోలీసులు అసలు విషయం చెప్పారు. ముంబైలో సజ్జన్‌ జిందాల్‌పై పెట్టిన కేసును వాపసు తీసుకుంటేనే... ఇక్కడ ఈ కేసులో ఉపశమనం ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో వారి బంధువులు వచ్చి పోలీసులతో మాట్లాడి రాజీకి అంగీకరించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన అరెస్టుకాగా... మార్చి 8వ తేదీన ఆ నటి, కుటుంబ సభ్యులు బెయిలుపై విడుదలై ముంబై వెళ్లిపోయారు. ఆపై వారం రోజులకే, అంటే మార్చి 16వ తేదీన సజ్జన్‌ జిందాల్‌పై పెట్టిన కేసును ఆమె ఉపసంహరించుకున్నారు. ఈ సందర్భంగా తమ సమయం వృథా చేస్తున్నారంటూ ఆమెపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రక్రియ పూర్తయిన కొద్దిరోజుల తర్వాత ఇబ్రహీంపట్నంలో నమోదైన కేసు విషయంలో ‘రాజీ’ కుదిరింది. కేసు విచారణ కోర్టులో ఉండడంతో లోక్‌ అదాలత్‌లో వైసీపీ నేత, నటి రాజీపడుతున్నట్టుగా కాగితాల్లో చూపించారు. రేప్‌ కేసు నుంచి సజ్జన్‌ జిందాల్‌ ఇలా బయటపడ్డారు!

నటి టార్చర్‌లో సజ్జల పాత్ర: వర్ల

అమరావతి, ఆగస్ట్‌ 27 (ఆంధ్రజ్యోతి): ముంబైకి చెందిన నటిని విజయవాడ తీసుకువచ్చి టార్చర్‌ పెట్టడంలో గత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఉందని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఆరోపించారు. బిన్‌ లాడెన్‌నో, కసబ్‌నో తీసుకువచ్చినట్లుగా ఆ నటిని విజయవాడకు తెచ్చేందుకు ఐపీఎస్‌ అధికారులు కాంతి రాణా, విశాల్‌ గున్నీ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారన్నారు. జగన్‌ హయాంలో వ్యవస్థలు ఎంత భ్రష్టు పట్టాయో చెప్పేందుకు ఈ సంఘటన ఒక ఉదాహరణ అని, దీనిపై విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఆయన చెప్పారు. ఒక ఎస్సై విచారించాల్సిన కేసులో ఐపీఎస్‌ అధికారులు పరుగులు తీయడం ఏమిటో సజ్జలకే తెలియాలని వర్ల వ్యాఖ్యానించారు.

Updated Date - Aug 28 , 2024 | 03:54 AM