Share News

గుంతల రోడ్డుకు మోక్షం

ABN , Publish Date - Dec 22 , 2024 | 12:49 AM

జిల్లాలో నాలుగు నియోజకవర్గాల గుండా సాగే గుడివాడ - కంకిపాడు ప్రధాన రహదారి అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. గోతులమయంగా ఉన్న రోడ్డుకు రాష్ట్ర విపత్తుల రిలీఫ్‌ ఫండ్‌ నుంచి వచ్చిన నిధులతో మరమ్మతులు చేపట్టింది. ఇప్పటికే వెంట్రప్రగడ-నందమూరు అడ్డరోడ్డు వరకు 2.2 కిలోమీటర్‌ల మేర రహదారికి రూ.40లక్షల వ్యయంతో మరమ్మతులు పూర్తి చేసింది. రూ.5 కోట్లతో భూషణగుళ్ల రోడ్డు నుంచి వెంట్రప్రగడ వరకు మరమ్మతులకు టెండర్లు పిలిచింది. రూ.1.80 కోట్లతో నందమూరు అడ్డరోడ్డు నుంచి పునాదిపాడు వరకు మరమ్మతులకు త్వరలో టెండర్లు పిలవనుంది.

గుంతల రోడ్డుకు మోక్షం

-గుడివాడ-కంకిపాడు రహదారి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చొవర

- రూ.40లక్షలతో వెంట్రప్రగడ నుంచి నందమూరు అడ్డరోడ్డు వరకు మరమ్మతులు పూర్తి

- రూ.5 కోట్లతో భూషణగుళ్ల రోడ్డు నుంచి వెంట్రప్రగడ వరకు మరమ్మతులకు టెండర్లు

-రూ.1.80 కోట్లతో నందమూరు అడ్డరోడ్డు నుంచి పునాదిపాడు వరకు మరమ్మతులకు త్వరలో టెండర్లు

జిల్లాలో నాలుగు నియోజకవర్గాల గుండా సాగే గుడివాడ - కంకిపాడు ప్రధాన రహదారి అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. గోతులమయంగా ఉన్న రోడ్డుకు రాష్ట్ర విపత్తుల రిలీఫ్‌ ఫండ్‌ నుంచి వచ్చిన నిధులతో మరమ్మతులు చేపట్టింది. ఇప్పటికే వెంట్రప్రగడ-నందమూరు అడ్డరోడ్డు వరకు 2.2 కిలోమీటర్‌ల మేర రహదారికి రూ.40లక్షల వ్యయంతో మరమ్మతులు పూర్తి చేసింది. రూ.5 కోట్లతో భూషణగుళ్ల రోడ్డు నుంచి వెంట్రప్రగడ వరకు మరమ్మతులకు టెండర్లు పిలిచింది. రూ.1.80 కోట్లతో నందమూరు అడ్డరోడ్డు నుంచి పునాదిపాడు వరకు మరమ్మతులకు త్వరలో టెండర్లు పిలవనుంది.

ఆంధ్రజ్యోతి - గుడివాడ:

జిల్లాలోని గుడివాడ, పామర్రు, గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాల పరిధిలో సుమారు 24 కిలోమీటర్లు పొడవున గుడివాడ - కంకిపాడు ప్రధాన రహదారి విస్తరించి ఉంది. గత ఐదేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం ఈ రోడ్డుకు కనీస మరమ్మతులు కూడా చేయకపోవడంతో దారి పొడవునా భారీ గుంతలు ఏర్పడ్డాయి. నిత్యం ఏదో ఒక చోట ప్రమాదం జరుగుతూనే ఉంది. అనేక మంది ప్రాణాలు కోల్పోగా, ఎందరో అంగవైక్యలం పొంది దయనీయ స్థితిలో జీవితం గడుపుతున్నారు. ఈ రహదారిలో ప్రయాణమంటే ద్విచక్రవాహనదారులతో పాటు వివిధ వాహనాల డ్రైవర్లు బెంబేలెత్తిపోతున్నారు. ప్రయాణికులు ప్రత్యక్ష నరకమంటే ఏమిటో ఇక్కడ చూస్తున్నారు. ఇటువంటి రోడ్డు గురించి కనీసం అప్పటి ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా అసెంబ్లీలో ప్రస్తావించకపోగా, ఒక్క రూపాయి కూడా నిధులు తీసుకురాలేదు.

రహదారి నిర్మాణాన్ని కుదించారు..

టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా 2018లో గుడివాడ - కంకిపాడు రహదారి విస్తరణ, అభివృద్ధి ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్‌ రోడ్‌ ఫండ్‌(సీఆర్‌ఎఫ్‌) రూ.165 కోట్ల నిధులను మంజూరు చేసింది. వెంటనే ఎన్నికలు రావడంతో పనులు ప్రారంభం కాలేదు. తొలి ప్యాకేజీగా రూ.16 కోట్లతో గుడివాడ-కంకిపాడు మధ్య నాలుగు నియోజకవర్గాల పరిధిలో 21.6 కి.మీల మేర రహదారిని పటిష్ఠపరచి ఇరువైపులా మీటరు వెడల్పు చేయాల్సి ఉంది. అప్పటి రాష్ట్ర మంత్రి కొడాలి నాని, జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ నిధులను గుడివాడ నియోజకవర్గ పరిధిలో ఐదు కిలోమీటర్ల మేర రహదారి విస్తరణ, రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ పనులకు మరల్చారు. 25 కిలో మీటర్ల రహదారి పనులను కేవలం ఐదు కిలోమీటర్లకు కుదించడం పట్ల అప్పట్లో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. కానీ రహదారి నిర్మాణం కూడా పూర్తి చేయలేకపోయారు. పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌కు రూ.4 కోట్లు బిల్లు చెల్లించకపోవడంతో భూషణగుళ్ల రోడ్డు నుంచి పెదపారుపూడి వరకు రహదారి నిర్మాణం ఆగిపోయింది. ఎన్నికల ముందు కొంత హడావుడి చేసి సన్నని చిప్స్‌ తోలి నిర్మాణం చేస్తున్నట్లు షో చేశారు.

మూడేళ్లలో 35 ప్రమాదాలు.. 15 మంది మృతి

గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలయ్యాయి. గుడివాడ నుంచి పునాదిపాడు వరకు పెదపారుపూడి, ఉయ్యూరు పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో గత మూడేళ్లలో 35 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వాటిలో సుమారు 15 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఇంటి పెద్దను కోల్పోయి అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. 50 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరు అంగవైక్యలం పొందారు. కొందరు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు.

కూటమి ప్రభుత్వంలో కోట్లాది రూపాయలతో పనులు

రాష్ట్ర విపత్తుల రిలీఫ్‌ ఫండ్‌తో గుడివాడ-కంకిపాడు రహదారి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది. భూషణగుళ్ల రోడ్డు నుంచి వెంట్రప్రగడ వరకు 7.8 కిలోమీటర్ల మేర మరమ్మతులకు రూ.5కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచారు. పనులు చేపట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తొలుత వెంట్రప్రగడ-నందమూరు అడ్డరోడ్డు వరకు 2.2 కిలోమీటర్ల మేర రహదారికి రూ.40 లక్షల వ్యయంతో మరమ్మతులు పూర్తి చేశారు. నందమూరు అడ్డరోడ్డు నుంచి పునాదిపాడు వరకు రూ.1.80 కోట్ల వ్యయంతో టెండర్లు పిలవగా, కాంట్రాక్టర్‌ పనులు చేపట్టడంలో జాప్యం చేయడంతో టెండరును రద్దు చేశారు. త్వరలోనే మళ్లీ టెండర్లు పిలిచి పనులు చేపట్టేలా ఆర్‌ అండ్‌ బీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - Dec 22 , 2024 | 12:49 AM