నవ్యా౦ధ్రలో నవశకం!
ABN , Publish Date - Dec 26 , 2024 | 04:19 AM
ఆంధ్రప్రదేశ్‌లోకి చమురు రంగం నుంచి భారీ పెట్టుబడులు తరలి రానున్నాయి. దాదాపు రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చేందుకు ప్రపంచ అగ్రగామి చమురు ఉత్పాదక సంస్థ ‘సౌదీ అరాంకో’ ఆసక్తితో ఉంది.
ఏపీ వైపు సౌదీ చూపు
లక్ష కోట్ల రూపాయల పెట్టుబడి
10 మిలియన్ టన్నుల సామర్థ్యం
కూటమి ప్రభుత్వం రావడంతో ఏపీ పెట్టుబడుల గమ్యస్థానంగా మారుతోంది. చమురు దిగ్గజ సంస్థ ‘సౌదీ అరాంకో’.. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. రామాయపట్నంలో బీపీసీఎల్ తలపెట్టిన గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ-పెట్రో కాంప్లెక్స్ నిర్మాణంలో ఈ సంస్థ కీలక భాగస్వామి కానుంది. ఈ ప్రాజెక్టు రూపంలో రూ.లక్ష కోట్ల మేర పెట్టుబడులు రానున్నాయి. మరోవైపు అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో మరో ఫార్మా సెజ్‌ను కేంద్రం మంజూరు చేసింది.
బీపీసీఎల్‌తో కలిసి భారీ రిఫైనరీకి రెడీ!
రామాయపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ - పెట్రో కాంప్లెక్స్
జాయింట్ వెంచర్ కింద నెలకొల్పేందుకు సుముఖత
గ్రీన్‌ఫీల్డ్ విధానాలపై ‘సౌదీ అరాంకో’ ఆసక్తి
ప్రపంచ అగ్రగామి చమురు ఉత్పాదక సంస్థ ఇది
మహారాష్ట్ర, యూపీలను కాదని ఏపీ వైపు మొగ్గు
ప్రాజెక్టు కోసం పలుదఫాలు ఢిల్లీకి బాబు
బీపీసీఎల్, కేంద్ర పెద్దలతో విస్తృత చర్చలు
ఎట్టకేలకు రాష్ట్రానికి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు
మోదీ సౌదీ పర్యటనలో ప్రస్తావించే వీలు
త్వరలో దావోస్‌లో సౌదీ బృందంతో బాబు భేటీ!
(ఆంధ్రజ్యోతి - గల్ఫ్ ప్రతినిధి)
ఆంధ్రప్రదేశ్‌లోకి చమురు రంగం నుంచి భారీ పెట్టుబడులు తరలి రానున్నాయి. దాదాపు రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చేందుకు ప్రపంచ అగ్రగామి చమురు ఉత్పాదక సంస్థ ‘సౌదీ అరాంకో’ ఆసక్తితో ఉంది. భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌తో (బీపీసీఎల్) కలిసి ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ కం పెట్రో కాంప్లెక్స్ నిర్మాణానికి మొగ్గు చూపుతోంది. నిజానికి ఈ మెగా ఆఫర్‌ను అందుకోవడానికి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ప్రయత్నించినా.. చివరకు ఏపీ దానిని దక్కించుకోవడం విశేషం. నిజానికి, ఆ రెండు రాష్ట్రాల్లో యూపీ బీజేపీ పాలిత రాష్ట్రం. అయినా.. కేంద్ర చమురు సంస్థ బీపీసీఎల్ ఏపీ వైపే మొగ్గింది. రామాయపట్నంలో 10 లేదా 12 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పాదక సామర్థ్యంతో ‘సౌదీ అరాంకో’తో జాయింట్ వెంచర్ కింద నిర్మించేందుకు సిద్ధమైంది. ‘ఇది నిజంగా అద్భుతమే’ననే వ్యాఖ్యలు పారిశ్రామిక వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. అయితే, ఈ అద్భుతాన్ని సాకారం చేయడంలో కొన్ని అంశాలు కీలకంగా పనిచేశాయని చెబుతున్నారు.
గ్రీన్‌ఫీల్డ్‌పై సౌదీ మక్కువ!
రిఫైనరీ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన నెల్లూరు జిల్లా రామాయపట్నం, శ్రీకాకుళం జిల్లా మూలపేట, కృష్ణా జిల్లా మచిలీపట్నం.. ఇలా మూడూ గ్రీన్ ఫీల్డ్ రేవు కేంద్రాలే. చంద్రబాబు స్వతహాగానే గ్రీన్‌ఫీల్డ్ విధానానికి గట్టి మద్దతుదారు. రాజధాని అమరావతి నిర్మాణం మొదలు భోగాపురం విమానాశ్రయంఏర్పాటు వరకు ఆయన ప్రభుత్వం ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. మరోవైపు.. సౌదీ అరేబియా గ్రీన్ ఫీల్డ్ విధానానికి పెద్దపీట వేస్తోంది. ‘సౌదీ అరాంకో’ ప్రతినిధులతో భారత అధికారులు జరిపిన చర్చల్లో ఈ అంశం ప్రముఖంగా పరిశీలనకు వచ్చినట్టు సమాచారం. ఇదే అంశం ఏపీకి బాగా కలిసి వచ్చిందని చెబుతున్నారు.
మెప్పించిన బాబు హుందాతనం
బీపీసీఎల్‌తో జరిపిన పలు సంప్రదింపుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాలను సీఎం చంద్రబాబు రిఫైనరీ కోసం సూచించారు. బందరు అయితే బాగుంటుంది అని ఆయన ప్రతిపాదించారు. కానీ, అక్కడే కావాలి.. అని స్థలం విషయంలో పట్టుబట్టలేదు. వచ్చేది ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టు. అది ఏపీకి రావడమే ముఖ్యం అన్నట్టు చంద్రబాబు వ్యవహరించారు. ఆయన ప్రదర్శించిన హుందాతనం కేంద్ర మంత్రులు, ఆయా మంత్రిత్వ శాఖలను బాగా ఆకట్టుకున్నదని చెబుతున్నారు. కాగా, దావో్‌సలో త్వరలో జరిగే పెట్టుబడుల సదస్సులో చంద్రబాబు.. సౌదీ అరేబియా. ఇతర గల్ఫ్ నేతలతో ఈ దిశగా సమావేశం కానున్నారని తెలుస్తోంది.
కలిసొచ్చిన కేంద్రం సహకారం..
మహారాష్ట్రలోని రత్నగిరిని గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ ఏర్పాటుకు తొలుత పరిశీలించారు. మరాఠా నాయకుల మధ్య గొడవల కారణంగా బీపీసీఎల్ వెనక్కి తగ్గింది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ (ప్రయాగ్‌రాజ్) పేరు తెరపైకి వచ్చింది. బీజేపీ పాలిత రాష్ట్రం కావడంతో దాదాపు అక్కడే రిఫైనరీ ఏర్పాటవుతుందని అంతా భావించారు. కారణం తెలియదుగానీ, కేంద్ర ప్రభుత్వమే అక్కడ నెలకొల్పేందుకు ఇష్టపడలేదు. మరోవైపు ఈ ప్రాజెక్టు కోసం చంద్రబాబు పలు సార్లు ఢిల్లీలో పర్యటించారు. ఈ క్రమంలో రిఫైనరీ గురించి భారతీయ అధికారులు అటు ‘సౌదీ అరాంకో’తోను, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబుతోను పలుదఫాలు చర్చలు జరిపారు. మోదీ కేబినెట్‌లో కీలక మంత్రులు పీయూశ్ గోయల్, హర్దీప్ సింగ్ పూరీ, ఎస్ జైశంకర్‌లు ఏపీకి ఈ ప్రాజెక్టు ఇవ్వడానికి పూర్తి సానుకూలత వ్యక్తం చేసినట్టు సమాచారం. పీయూశ్ గోయల్ ఇప్పటికే పలుసార్లు సౌదీ అరేబియాకు వెళ్లి అధికారులతో చర్చలు జరిపారు. త్వరలో ప్రధాని నరేంద్ర మోదీ కూడ సౌదీ నాయకత్వంతో సమావేశం కానున్నారని, అందులో దీనికి సంబంధించి ఒక ప్రకటన చేస్తారని భావిస్తున్నారు.
ఇది రెండో రిఫైనరీ!
రాష్ట్రంలో తొలి రిఫైనరీ విశాఖపట్నంలో ఏర్పాటైంది. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో అమెరికాకు చెందిన సంస్థ దీనిని ఏర్పాటుచేసింది. జాతీయీకరణలో భాగంగా ఈ రిఫైనరీ హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ కార్పొరేషన్ యాజమాన్యం కిందకు వెళ్లింది. రామాయపట్నంలో ఇప్పుడు ఏర్పాటు చేసేది రెండో రిఫైనరీ అవుతుంది. బీపీసీఎల్ భారతదేశంలో ఇప్పటికే మూడు రిఫైనరీలను నిర్వహిస్తోంది. రామాయపట్నంలో తలపెట్టింది ఈ వరుసలో నాలుగోది కానుంది.
అందుకే.. ఆంధ్రా!
ఉక్రెయిన్‌తో యుద్ధం తర్వాత భారత్‌కు రష్యా చమురు ఉత్పత్తుల ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. యుద్ధం కారణంగా భరించాల్సి వస్తున్న ఆర్థిక నష్టాలనుంచి, అంతర్జాతీయంగా ఎదుర్కొంటున్న ఆంక్షల నుంచి బయటపడేందుకు భారీ రాయితీలతో మనకు చమురు ఉత్పత్తులను రష్యా ఎగుమతి చేస్తోంది. సౌదీ అరేబియాను దాటుకుని మరీ మన చమురు మార్కెట్‌లోకి రష్యా దూసుకొచ్చింది. దీంతో అనివార్యంగా భారత్‌పై సౌదీ అరేబియా ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారతదేశం గుండా ఆగ్నేయాసియా దేశాలకు చమురు సరఫరా చేయడానికి దీర్ఘకాలిక వ్యూహాలను సిద్దం చేసుకొంటోంది. ఈ క్రమంలో బంగాళాఖాత తీరంలోని ఆంధ్రా తీరం అనువైన ప్రాంతంగా కనిపించింది. అందువల్లే.. చర్చల్లో భాగంగా భారతీయ అధికారులు.. ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన తీసుకురాగా, ‘సౌదీ అరాంకో’ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.