Share News

దివి రైతులకు కత్తెర పోట్లు

ABN , Publish Date - Nov 16 , 2024 | 12:41 AM

వాతావరణంలో ఏర్పడుతున్న పెనుమార్పులతో సముద్రపు మట్టం ప్రమాదకర స్థాయిలో పెరుగుతుండటంతో దివి ప్రాంత రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లుగా సాగుతున్న పర్యావరణ విధ్వంసం కారణంగా సముద్ర మట్టాలు పెరుగుతున్నాయని ముఖ్యంగా సముద్రపు మొగ (సిమౌత)ల వద్ద ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుందని పర్యావరణ మంత్రిత్వ శాఖ గతేడాది జూలైలో చేసిన హెచ్చరికలు ఇప్పటి పరిస్థితికి అద్దం పడుతున్నాయి.

దివి రైతులకు కత్తెర పోట్లు

- అడుగున్నరపైకి పెరిగిన పోటు మట్టాలు

- ఉప్పునీటిలో వందలాది ఎకరాల పంట పొలాలు

- దిక్కుతోచని స్థితిలో రైతన్నలు

అవనిగడ్డ/కోడూరు, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి):

వాతావరణంలో ఏర్పడుతున్న పెనుమార్పులతో సముద్రపు మట్టం ప్రమాదకర స్థాయిలో పెరుగుతుండటంతో దివి ప్రాంత రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లుగా సాగుతున్న పర్యావరణ విధ్వంసం కారణంగా సముద్ర మట్టాలు పెరుగుతున్నాయని ముఖ్యంగా సముద్రపు మొగ (సిమౌత)ల వద్ద ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుందని పర్యావరణ మంత్రిత్వ శాఖ గతేడాది జూలైలో చేసిన హెచ్చరికలు ఇప్పటి పరిస్థితికి అద్దం పడుతున్నాయి. నాగాయలంక మండలం గుల్లలమోద, నాలి, సంగమేశ్వరం, సొర్లగొంది ప్రాంతాలు, కోడూరు మండలంలోని తీర గ్రామాలైన రామకృష్ణాపురం, హంసలదీవి, పాలకాయితిప్ప, ఇరాలి ప్రాంతాల్లోనూ సముద్రపు పోటు మట్టం పెరగటంతో అవుట్‌ ఫాల్‌ స్లూయిస్‌ ద్వారా మురుగు కాలువల్లోకి ప్రవహిస్తున్న సముద్రపు నీరు మురుగుకాలువలను ముంచెత్తి అక్కడి నుంచి పంట పొలాల్లోకి రావటంతో రైతులు ఏమీ చేయాలో పాలుపోసి దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. గడిచిన మూడు రోజులుగా నాగాయలంక శ్రీరామపాదక్షేత్రంలో గతంలో వచ్చే అమావాస్య, పౌర్ణమి, అష్టమ నవమి కత్తెర పోట్ల కంటే దాదాపు అడుగున్నర మట్టానికిపైగా పోటు మట్టం పెరుగుతుండగా, ఇదే పరిస్థితి నియోజకవర్గంలోని కోడూరు, నాగాయలంక మండలాల్లోనూ తలెత్తి మురుగు కాలువల ద్వారా పంట పొలాల్లోకి నీరు చేరుతున్నాయి. వెంటనే ప్రభుత్వం స్పందించి సముద్రపు నీరు అవుట్‌ ఫాల్‌ స్లూయిస్‌ల ద్వారా పంట పొలాల్లోకి చేరే అవకాశం లేకుండా తక్షణమే అవుట్‌ ఫాల్‌ స్లూయిస్‌లను నిర్మించటంతోపాటు పోటు సమయాల్లో గేట్లను ప్రత్యేక పర్యవేక్షణలో మూసివేసేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

అధికారుల వైఫల్యం రైతుల పాలిట శాపం

డైనేజీ, ఇరిగేషన్‌ శాఖ అధికారుల వైఫల్యం కోడూరు మండల దిగువ ప్రాంత రైతుల పాలిట శాపంగా మారింది. కోడూరు ఈస్ట్‌ చానల్‌ 15, 16, 17, 18 నంబర్ల కాలువల కింద గతంలో కురిసిన భారీ వర్షాలకు నారుమడులు నీటమునగటంతో మరలా రెండవ సారి నారుమడులు పోసి రైతులు వ్యవసాయ పనులు కొనసాగించారు. ఇదే క్రమంలో పాలకాయితిప్ప, కోడూరు అవుట్‌ ఫాల్‌ స్లూయిస్‌ పునర్నిర్మాణం చేపట్టకపోవటంతో ఉప్పునీరు పంట పొలాల్లోకి చేరకుండా తాత్కాలిక చర్యలు చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలో అధికారులను ఆదేశించగా, అవుట్‌ ఫాల్‌ గేట్ల వద్ద ఇసుక మూటలతో ఉప్పునీరు ఎగువకు రాకుండా అవుట్‌ ఫాల్‌ స్లూయిస్‌ గే ట్ల వద్ద అడ్డుగా వేశారు. వీటిని ఆక్వా రైతులు తొలగించారు. దీంతో యధావిధిగా మరలా ఉప్పునీరు ఎగువ నుంచి భారీగా ప్రవహిస్తుంది. ఫలితంగా 18, 15వ నంబర్‌ కాలువ కింద వందలాది ఎకరాల్లో వేసిన వరి నాట్లు ఉప్పునీట మునిగాయని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై సంబంధిత ఇరిగేషన్‌ డీఈఈ పులిగడ్డ వెంకటేశ్వరరావును వివరణ కోరగా, అవుట్‌ ఫాల్‌ స్లూయిస్‌ వద్ద గతంలో వేసిన ఇసుక మూటలను రైతులు తొలగించారని, మళ్లీ ఇసుక మూటలు వేయాలని కాంట్రాక్టర్‌కు చెప్పినట్లు తెలిపారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Updated Date - Nov 16 , 2024 | 12:41 AM