ఇల కైలాసానికి సీప్లేన
ABN , Publish Date - Nov 09 , 2024 | 12:05 AM
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ఉదయం సీప్లేన ద్వారా శ్రీశైలం చేరుకోనున్నారు.
- అద్భుత ఘట్టానికి వేదికగా శ్రీశైలం
- పాతాళగంగలో ట్రైల్ రన దిగ్విజయం
- నేడు డెమోను ఆవిష్కరించనున్న సీఎం చంద్రబాబు
- శ్రీశైలం-విజయవాడ క్షేత్రాల నడుమ టెంపుల్ టూరిజం
- గంటలోపే ఇంద్రకీలాద్రికి ప్రయాణం
- ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్, ఎస్పీ
- నల్లమలను జల్లెడపట్టిన ప్రత్యేక బలగాలు
మరో అద్భుత ఘట్టానికి శ్రీశైలం పాతాళ గంగ వేదిక కానుంది. టూరిజాన్ని అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సీప్లేన టూరిజానికి శ్రీకారం చుట్టనుంది. విజయవాడ ఇంద్రీకీలాద్రి, శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయాల మధ్య టెంపుల్ టూరిజం మరింత అభివృద్ధి కానుంది. అందులో భాగంగా సీప్లేన రవాణా మార్గానికి ప్రణాళిక రూపొందించింది. ఈ క్రమంలో శనివారం మొదట విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి సీ ప్లేన శ్రీశైలానికి వచ్చింది. అక్కడి జలాశయం నీటిలో సురక్షితంగా ల్యాండ్ అయింది. అనంతరం శ్రీశైలం టూరిజం బోటింగ్ జట్టీ వద్దకు నీటి విమానం చేరుకుంది. ఎస్డీఆర్‌ఎఫ్, పోలీస్, టూరిజం, ఎయిర్ ఫోర్స్ అధికారుల సమక్షంలో ట్రయల్ రన విజయవంతంగా నిర్వహించారు. శనివారం కృష్ణానది పున్నమిఘాట్‌లో విజయవాడ నుంచి శ్రీశైలం మధ్య సీ ప్లేన పరుగులు తీయనుంది. డీ హవిల్లాండ్ ఎయిర్ క్రాఫ్ట్ సంస్థ రూపొందించిన ఈ సీ ప్లేనలో 14 సీట్లు ఉంటాయి. మరో సీ ప్లేనలో 18 సీట్ల కెపాసిటీ ఉంటుంది. విజయవాడ-శ్రీశైలం మధ్య రోడ్డు మార్గంలో సుమారు 270 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సాధారణంగా రోడ్డు మార్గం ద్వారా అయితే సుమారుగా ఆరు గంటలకు పైగా సమయం పడుతుంది. అదే సీ ప్లేనలో గంటన్నర సమయంలోనే చేరుకోవచ్చు.
శ్రీశైలం, నవంబరు 8: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ఉదయం సీప్లేన ద్వారా శ్రీశైలం చేరుకోనున్నారు. విజయవాడ-శ్రీశైలం మధ్య సీప్లేన సర్వీసు డెమో కార్యక్రమాన్ని విజయవాడ పున్నమి ఘాట్ వద్ద ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా, జేసీ విష్ణు చరణ్, సీఎం కార్యక్రమాల కోఆర్డినేటర్ వెంకటేశ్వరరావు ఏర్పాట్లను పరిశీలించారు. ఇందులో భాగంగా సీప్లేన ల్యాండ్ అయ్యే ప్రదేశం, పాతాళగంగ బోటింగ్ ప్రదేశం నుంచి రోప్ వే, అక్కడి నుంచి స్వామి, అమ్మవార్ల దర్శనం ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సీఎం పర్యటనలో 523 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితోపాటు పది స్పెషల్ పార్టీ బృందాలు, నాలుగు గ్రేహౌండ్స్ బృందాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లుగా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. శ్రీశైలం పాతాళగంగ, డ్యాం పరిసర ప్రాంతాల్లో గ్రేహౌండ్స్, పది స్పెషల్ పార్టీల బలగాలతో శ్రీశైలం అడవులన్నింటిని జల్లెడ పట్టామని తెలిపారు.
ఫ సీప్లేన ట్రైల్ రన విజయవంతం
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో శుక్రవారం విజయవాడ నుంచి శ్రీశైలం సీప్లేన ట్రైల్ రనను విజయవంతంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం విజయవాడ పున్నమి ఘాట్ నుంచి సీప్లేన 10.30 గంటల సమయంలో బయలుదేరి శ్రీశైలం పాతాళగంగ వద్ద కృష్ణా నదిపై చెక్కర్లు కొట్టి 11.30-12 గంటల సమయంలో ల్యాండ్ అయింది. శ్రీశైలం చేరుకున్న సీప్లేనను కలెక్టర్ జి. రాజకుమారి ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణాతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం పర్యటించే పాతాళగంగ బోటింగ్, రోప్‌వే ఎంట్రీ పాయింట్ నుంచి రోడ్డు మార్గం, స్వామి, అమ్మవార్ల ఆలయ ప్రదేశాల ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించి పకడ్భందీ ఏర్పాట్లను చేపట్టారు.
ఫ సీఎం పర్యటన ఇలా..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘స్కై మీట్స్ సీ’ పేరుతో చేపట్టిన విజయవాడ-శ్రీశైలం సీప్లేన సర్వీసును విజయవాడ పున్నమి ఘాట్ వద్ద శనివారం ఉదయం 10:55 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. తరువాత 12 గంటలకు సీప్లేనలో బయలుదేరి 12:45 గంటలకు శ్రీశైలం పాతాళగంగ కృష్ణా నదిపై లాండింగ్ అవుతారు. అనంతరం రోప్‌వే లోవర్ స్టేషన నుంచి రోప్‌వే అప్పర్ స్టేషనకు ఒంటి గంటకు చేరుకుంటారు. అక్కడి నుంచి సీఎం కాన్వాయ్ ద్వారా రోడ్డు మార్గంలో స్వామి, అమ్మవార్ల ప్రధాన ఆలయం వద్దకు చేరుకోనున్నారు. 1:05 నుంచి 1:25 గంటల సమయంలో సీఎం స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దర్శనానంతరం తిరిగి 1:30 గంటలకు కాన్వాయ్ ద్వారా రోప్‌వే అప్పర్ స్టేషనకు చేరుకుని 2 గంటలకు మీడియాతో సమావేశం కానున్నారు. తరువాత 2:30 గంటలకు రోప్‌వే ద్వారా సీప్లేన చేరుకుని విజయవాడకు చేరుకోనున్నారు.
ఫ హాజరు కానున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు
ముఖ్యమంత్రి శ్రీశైలం పర్యటన సందర్భంగా పలువురు రాష్ట్ర ముంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే హాజరు కానున్నారు. మంత్రులు రామనారాయణ రెడ్డి, ఎనఎండీ ఫరూక్, బీసీ జనార్దన రెడ్డి, నిమ్మల రామనాయుడు, గొట్టిపాటి రవికుమార్‌లు, ఎంపీలు బైరెడ్డి శబరి, బి. నాగరాజు, ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖరరెడ్డి, జి. జయసూర్య, భూమా అఖిలప్రియ రెడ్డి, గౌరు చరితారెడ్డి, జయనాగేశ్వరరెడ్డి, బి. దస్తగిరి, పార్థసారథి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి, దేవదాయశాఖ కమిషనరు ఎస్. సత్యనారాయణలు హాజరుకానున్నారు.