Share News

Sharmila : మళ్లీ జగన్‌ వస్తే.. మీ భూములు కబ్జానే’

ABN , Publish Date - Feb 09 , 2024 | 03:03 AM

జగన్‌కు మళ్లీ ఓటేసి గెలిపిస్తే ప్రజల పొలాలు, స్థలాలన్నీ సర్కారు గుప్పిట్లోకి వెళ్లిపోతాయని పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల అన్నారు.

Sharmila : మళ్లీ జగన్‌ వస్తే.. మీ భూములు కబ్జానే’

పొలాలు, స్థలాలన్నీ సర్కారు గుప్పిట్లోనే

ప్రజల ఆస్తుల తాకట్టుకూ వెనుకాడరు

కట్టుబట్టలు కూడా దోచేస్తారు.. జాగ్రత్త

ఓటు అనే ఆయుధంతో తరిమికొట్టండి

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తప్పారు

మట్టి చెంబిచ్చి.. వెండిచెంబు స్వాహా

పులి, సింహం అంటూ స్వీయ ప్రచారం

బీజేపీ ముందు తొడ కొట్టండి చూద్దాం

గుంటూరు, ఏలూరు సభల్లో షర్మిల ఫైర్‌

తెనాలి/ఏలూరు, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): జగన్‌కు మళ్లీ ఓటేసి గెలిపిస్తే ప్రజల పొలాలు, స్థలాలన్నీ సర్కారు గుప్పిట్లోకి వెళ్లిపోతాయని పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల అన్నారు. భూములను కబ్జా చేస్తారని, ప్రజల చేతుల్లో సెంటు భూమి కూడా ఉండదని, కట్టుబట్టలు కూడా మిగలకుండా దోచేస్తారని హెచ్చరించారు. ఒకసారి చేసిన పొరపాటును ఈసారైనా సరిచేసుకోవాలని, ఓటు అనే ఆయుధంతో తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. వైఎస్‌ బిడ్డగా చెబుతున్నానని, ప్రజలు ఈ ఒక్కసారి తన మాట వినాలని కోరారు. గురువారం గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరులో రచ్చబండ కార్యక్రమంలో, ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పోతునూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె పాల్గొన్నారు. కొలకలూరు సభలో ప్రభుత్వం వల్ల నష్టపోయిన బాధితులు, అర్హతున్నా పఽథకాలు అందనివారు, నష్టపోయిన రైతులు, ఇతర బాధితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అండగా ఉంటానంటూ వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘‘మళ్లీ జగన్‌ అధికారంలోకి వస్తే మీ సెంటు భూమి కూడా మీ చేతుల్లో ఉండదు. ప్రాణం మీదకొచ్చి ఆసుపత్రి ఖర్చుల కోసం మీ స్థలం తాకట్టు పెట్టుకుని డబ్బు తెచ్చుకోవాలన్నా ఇకపై సర్కారు అనుమతి కావాల్సిందే. మీ నేలపై సర్వహక్కులూ సర్కారుకేనట. ఒక్కసారి గెలిపించినందుకు లిక్కర్‌ మాఫియా దగ్గర నుంచి మట్టి, ఇసుక మాఫియా, చివరకు గనులు, ప్రభుత్వ భూములన్నీ కొల్లగొట్టేశారు. మద్యం ఏ బ్రాండ్‌ అమ్మాలనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఎంతకు అమ్మాలో కూడా సర్కారే నిర్ణయిస్తుంది. ఇదంతా మీరు రోజూ చూస్తున్నదే. ఇక మిగిలింది మీ నేలే. ఇంకా 30 ఏళ్లు తానే అధికారంలో ఉంటానన్న ధీమాతో మీ భూములను దోచుకునేందుకు ఇప్పుడే ఓ చీకటి జీవో తీసుకొచ్చేశాడు. ఆ జీవోలో ఉన్న వాస్తవాలు తెలిస్తే మీకు నిద్ర కూడా పట్టదు. ఇకపై మీ భూమిని అమ్మాలంటే ప్రభుత్వం అనుమతించాలి. బ్యాంకుల్లో తనఖా పెట్టాలన్నా ప్రభుత్వ ఇష్టమే. కష్టపడి పైసా పైసా కూడబెట్టి కొన్న ఇళ్ల స్థలం, పొలంపై హక్కు మాదే.. వారిష్టమేంటని మీరు అనుకోవచ్చు. కానీ మీ పొలాలు, స్థలాలు రేపటి రోజున మీవి కావు. మళ్లీ జగన్‌ గెలిస్తే వాటన్నిటిపై అధికారం జగనన్నదే. మీ ఆస్తులను కూడా తాకట్టు పెట్టడానికి వెనుకాడరు. మీరు ముందు చూపుతో జాగ్రత్త పడకపోతే చివరకు కట్టుబట్టలు కూడా మిగలవు. చీకటి జీవో అమలయితే ఏమీ మిగలదు’’ అని షర్మిల హెచ్చరించారు.

జగనన్న అవసరం ఉందా?

‘‘మద్య నిషేధం పెట్టాకే ఓట్లడుగుతానని చెప్పిన జగన్‌ గెలిచాక ఆ మాట మరిచిపోయారు. చివరకు ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేసేలా మాటతప్పిన ఘనుడు. అటువంటివాడు అధికారంలోఉంటే ఏమవుతుందనేది నాకంటే మీకే ఎక్కువ అనుభవం ఉంది. ఆనాడు ఎన్నికల సమయంలో జగన్‌ తరఫున నేనే ప్రచారం చేశాను. కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అందరికీ అమ్మఒడి ఇస్తానని ఆయన మాటగా చెప్పాను. దానిని కూడా ఆయన తప్పాడు. కుటుంబంలో ఒక్కరికే ఇస్తున్నారు. అదికూడా రూ.15 వేలు కాకుండా రూ.12 వేలే. ఇచ్చిన రూ.12 వేలకు బదులు రూ.24 వేలు లాగేసుకుంటున్నారు. కుటుంబంలో చదివిన ఆ ఒక్కరు కూడా ఉపాధి లేక వలస పోతున్న పరిస్థితి ఉంది. రాష్ట్రానికి ఈయనగారు ప్రత్యేక హోదా తీసుకురాలేదు కాబట్టి పెద్ద పరిశ్రమలు కూడా రాలేదు. అవి లేకుంటే ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రభుత్వ ఉద్యోగాల విషయం అటుంచితే, కనీసం ప్రైవేటు ఉద్యోగాలు కూడా లేక యువత ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నారు. మీకు మీ పిల్లల్ని దూరం చేసే జగనన్న అవసరం ఉందో! లేదో మీరే నిర్ణయించుకోవాలి’’ అని షర్మిల అన్నారు.

అది మెగా కాదు దగా డీఎస్సీ

‘‘అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని, 25వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన జగనన్న గెలిచాక ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. మళ్లీ ఎన్నికలు వచ్చాక డీఎస్సీ ప్రకటన చేశారు. ఇది మెగా డీఎస్సీ కాదు.. కేవలం ఎన్నికల వేళ నిరుద్యోగులను మోసం చేసేందుకు తీసుకొచ్చిన దగా డీఎస్సీ. ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్‌ కేలండర్‌ విడుదల చేస్తామని చెప్పిన జగన్‌ ఈ విషయంలోనూ మాట తప్పారు. జాబ్‌ క్యాలెండర్‌ మాట దేవుడెరుగు, ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోతున్నాయి. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు 7వేల ఉద్యోగాలు భర్తీచేస్తామని చెబితే జగన్‌ హేళన చేశారు. ఆయన మాత్రం ఈ ఐదేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఎన్నికలకు ముందు డీఎస్సీ ప్రకటించారు. 6 వేల ఉద్యోగాల భర్తీకి మాత్రమే అంగీకరించడం చూస్తే ఆయనను జనం ఏం చేయాలి? ఆయన అధికారంలోకి వచ్చేనాటికే రాష్ట్రంలో 30వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీచేయలేక నూతన విద్యావిదానం పేరుతో పాఠశాలలనే మూసేసిన ఘనత ఆయనది. యువత భవిత బాగుండాలంటే మరోసారి మోసపోకూడదు. ప్రధానంగా మహిళలు అప్రమత్తం కావాలి. చెత్త ఆలోచన ఉన్న ప్రభుత్వం పోతేనే మన భవిష్యత్‌ బాగుపడుతుంది’’ అని షర్మిల అన్నారు.

ఈ ప్రభుత్వానికి సిగ్గులేదా?

‘ఐదేళ్లుగా జగనన్న సీఎంగా ఉండి ఏపీకి ఏం సాధించారు? ప్రతిపక్షంలో ఉండగా ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేశారు. ఎంపీలు అందరూ మూకుమ్మడిగా రాజీనామా చేస్తే హోదా ఎందుకు రాదో చూద్దామన్నా రే? మరి ఐదేళ్లుగా ఎందుకు చేయలేదు? సీఎం అయ్యా క ఒక్కసారైనా హోదా గురించి మాట్లాడారా? బీజేపీ విభజన హామీలన్నింటినీ నెరవేర్చేసిందని సీఎం అసెంబ్లీలో చెప్తున్నారే.. హోదా వచ్చిందా? రాజధాని వచ్చిం దా? పోలవరం పూర్తయిందా? సిగ్గులేదా ఈ ప్రభుత్వానికి అని అడుగుతున్నా. జగన్‌ ప్రతిపక్షంలో ఉండగా హోదా కోసం కేంద్రం మెడలు వంచుతానని చెప్పి, ఇప్పుడు తలలు వంచి సలాంలు కొడుతున్నారు. సీఎం అయ్యాక అదే బీజేపీకి తొత్తులుగా మారి హోదా గురిం చి మర్చిపోయారు. ఒక్కటంటే ఒక్క హామీ నెరవేర్చకపోయిన ఇటు పాలక పక్షానికి అటు బీజేపీకి సిగ్గు, శరం ఏమైనా ఉందా? అని అడుగుతున్నా. జగనన్న తనకు తాను పులినని, సింహాన్నని ప్రచారం చేసుకుంటున్నారే.. మీరు పేపర్‌కు పులా? సాక్షికి సింహమా? ఏదీ ఒక్కసారి బీజేపీ ముందుకు వెళ్లి పంజా విసరండి. ఒక్కసారి బీజేపీ ముందుకెళ్లి తొడ కొట్టండి చూద్దాం. కేవలం బెదిరింపులు, బూతులతో చేసే మీది ఒక దిక్కుమాలిన పాలన. ఏపీకి సంజీవని వంటి ప్రత్యేక హోదాను కాంగ్రెస్‌ సాధించి తీరుతుంది’’ అని షర్మిల అన్నారు.

డబ్బు తీసుకోండి.. మంచి పార్టీకే ఓటు

‘‘అమ్మా! ఇది ఎన్నికల సమయం. ఐదేళ్లకు ఒకసారి వచ్చే సమయం. ఓట్ల కోసం అందరు నాయకులూ వస్తారు. డబ్బులు ఇస్తారు. ఎవరెవరు ఎంతెంత ఇచ్చినా తీసుకోండి ఫర్లేదు. శాండ్‌ మాఫియా, లిక్కర్‌ మాఫియా నాయకులు ఏమిచ్చినా వద్దనకండి. కానీ, ఓటు మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి. మంచి పార్టీకే ఓటు వేయండి. మీకు ఎవరైతే మంచి చేశారో వాళ్లకే మద్దతివ్వండి’’ అని కోరారు.

షర్మిలకు భద్రత పెంపు

కడప (క్రైం), ఫిబ్రవరి 8: పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలకు పోలీసు భద్రతను పెంచారు. ఆమె అభ్యర్థన మేరకు వన్‌ ప్లస్‌ వన్‌ గన్‌మెన్‌ నుంచి టూ ప్లస్‌ టూకు పెంచామని కడప ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ గురువారం తెలిపారు. భద్రతా ప్రమాణాల నిబంధనల మేరకు పెంచామన్నారు. ఎవరి ప్రాణాలకైనా ముప్పు పొంచి ఉందని, వారికి గన్‌మెన్‌ కేటాయించాలని ఇంటెలిజెన్స్‌ విభాగం ఇచ్చే సిఫారసు నివేదిక మేరకు గన్‌మెన్లను కేటాయిస్తామని ఎస్పీ తెలిపారు.

Updated Date - Feb 09 , 2024 | 03:04 AM