Share News

Shivraj Singh Chouhan : అన్నివిధాలా ఆదుకుంటాం

ABN , Publish Date - Sep 06 , 2024 | 04:50 AM

వరద నష్టం అంచనాలు అందగానే కేంద్ర ప్రభుత్వం తన వంతు సాయం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తెలిపారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి అవసరమైన అన్నిరకాల సహాయ సహకారాలను అందిస్తారన్నారు.

Shivraj Singh Chouhan : అన్నివిధాలా ఆదుకుంటాం

  • నష్టం అంచనాలు అందగానే సాయం.. విపత్తుతో భారీ నష్టం జరిగింది

  • పంటలు బాగా దెబ్బతిన్నాయి.. బెజవాడలో ఎన్నడూ చూడని జలప్రళయం

  • చంద్రబాబు, ఆయన బృందం 24 గంటలూ కష్టపడి పనిచేస్తున్నారు

  • మరింత వరద వచ్చినా తట్టుకొనేలా ప్రకాశం బ్యారేజీని పటిష్ఠపరుస్తాం

  • కేంద్రమంత్రి శివరాజ్‌ సింగ్‌ వెల్లడి.. వరద ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే

  • చంద్రబాబు, ఆయన బృందం 24 గంటలూ కష్టపడి పనిచేస్తున్నారు

  • కేంద్రమంత్రి శివరాజ్‌ సింగ్‌ వెల్లడి

అమరావతి, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): వరద నష్టం అంచనాలు అందగానే కేంద్ర ప్రభుత్వం తన వంతు సాయం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తెలిపారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి అవసరమైన అన్నిరకాల సహాయ సహకారాలను అందిస్తారన్నారు. వరదలతో నష్టం భారీగా జరిగిందని, పంటలు కూడా బాగా దెబ్బతిన్నాయని, రైతులు చాలా నష్టపోయారని చెప్పారు. రాష్ట్రానికి పూర్తి మద్దతును కేంద్రం అందిస్తుందని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి గురువారం రాత్రి ఆయన విజయవాడ కలెక్టరేట్‌ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. ‘నేను ఈ రోజు వరద నష్టం వాటిల్లిన ప్రాంతాలు తిరిగి చూశాను. ప్రకాశం బ్యారేజీకి వచ్చిన వరద గురించి తెలుసుకొన్నాను. మరింత వరద వచ్చినా తట్టుకొనేలా బ్యారేజీని పటిష్ఠపరుస్తాం. ఈ విషయం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా దృష్టికి తీసుకువెళ్తాం. గతంలో ఎన్నడూ లేనవిధంగా జలప్రళయాన్ని విజయవాడ చవిచూసింది. విజయవాడ నగరంలో ఎవరూ ఊహించని రీతిలో కురిసిన 400 మి.మీ. వర్షపాతం వల్ల వరద విపత్తు సంభవించింది. కృష్ణా నది, బుడమేరు రెండూ ఒకేసారి పొంగడం సమస్యలు తెచ్చింది. చంద్రబాబు, ఆయన బృందం ఇరవై నాలుగు గంటలూ కష్టపడి పనిచేస్తున్నారు. కలెక్టరేట్‌నే రాష్ట్ర సచివాలయంగా మార్చుకొని ముఖ్యమంత్రి పనిచేయడం అభినందనీయం. డ్రోన్ల ద్వారా ఆహార ప్యాకెట్లు అందించడం దేశంలోనే మొదటిసారి. ఇంతటి జలప్రళయం సంభవించినా మృతుల సంఖ్యను తగ్గించడం గొప్ప విషయం.’ అని చౌహాన్‌ వ్యాఖ్యానించారు. కలెక్టరేట్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌లో వరద దృశ్యాలను ఆయన తిలకించారు. అంతకుముందు సీఎం, ఇతర అధికారులతో సమావేశమై చర్చించారు.


  • వీలైనంత త్వరగా సాయం: కేంద్ర బృందం

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల పరిస్థితులను, నష్టాలను కేంద్ర ప్రభుత్వానికి నివేదించి తక్షణ సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర బృందం తెలిపింది. కేంద్రం హోం శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్‌కుమార్‌ జిందాల్‌ నేతృత్వంలో ప్రత్యేక బృందం గురువారం ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించింది. వరద ప్రభావిత ప్రాంతాలు, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను పరిశీలించింది. ముంపు ప్రాంతాల్లో స్వయంగా పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేసింది. నష్టంపై నివేదికను కేంద్రానికి అందించి, వీలైనంత త్వరగా రాష్ట్రానికి తక్షణ సాయం అందించేలా చర్యలు తీసుకుంటామని సంజీవ్‌కుమార్‌ జిందాల్‌ చెప్పారు. తొలుత తాడేపల్లిలోని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయంలో స్టేట్‌ ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌ను కేంద్ర బృందం పరిశీలించింది. తర్వాత రాష్ట్ర అధికారులతో సమీక్ష నిర్వహించింది.

భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సహాయక, పునరావాస చర్యల గురించి అధికారులు వివరించారు. అనంతరం ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్లను బృందం పరిశీలించింది. బ్యారేజీ వద్ద వరద నీటి ప్రవాహం, ఇతర వివరాలను రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి సాయిప్రసాద్‌, ఇంజనీర్‌ ఇన్‌-చీ్‌ఫ వెంకటేశ్వరరావు వివరించారు. ఆ తర్వాత బుడమేరుకు పడిన గండ్లను, గండ్లను పూడ్చే పనులను కేంద్రబృందం పరిశీలించింది. ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్న రెవెన్యూ, విపత్తుల శాఖ స్పెషల్‌ సీఎస్‌ సిసోడియా... కేంద్ర బృందంతో పాటు ట్రాక్టర్‌పై వెళ్లి పరిస్థితి వివరించారు.

Updated Date - Sep 06 , 2024 | 04:50 AM