SIT : కల్తీ నెయ్యిపై కదిలిన సిట్
ABN , Publish Date - Nov 25 , 2024 | 03:19 AM
శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎట్టకేలకు విచారణ మొదలుపెట్టింది. సిట్ కీలక సభ్యులు ఇంకా తిరుపతి చేరుకోనప్పటికీ కింది స్థాయిలో డీఎస్పీల ఆధ్వర్యంలో విచారణ ప్రారంభమైంది.
డీఎస్పీల స్థాయిలో విచారణ ప్రారంభం
శ్రీవారి లడ్డూ ప్రసాదాలకు నెయ్యి సరఫరా చేసిన
వైష్ణవి, ఏఆర్ డెయిరీ, చెన్నై ల్యాబ్‌కు బృందాలు
అన్ని కోణాల్లో వివరాలు సేకరించిన అధికారులు
రెండు డెయిరీల నుంచీ కీలక పత్రాలు స్వాధీనం
ఏఆర్ డెయిరీలో 13 గంటల పాటు సోదాలు
తిరుపతి/చెన్నై, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎట్టకేలకు విచారణ మొదలుపెట్టింది. సిట్ కీలక సభ్యులు ఇంకా తిరుపతి చేరుకోనప్పటికీ కింది స్థాయిలో డీఎస్పీల ఆధ్వర్యంలో విచారణ ప్రారంభమైంది. మొత్తం నలుగురు డీఎస్పీలుండగా వారిలో ముగ్గురి ఆధ్వర్యంలో సిబ్బంది మూడు బృందాలుగా ఏర్పడ్డారు. ఆదివారం ఒక బృందం వైష్ణవి డెయిరీకి, మరో బృందం తమిళనాడులోని దిండుగల్‌కు చెందిన ఏఆర్ డెయిరీకి, ఇంకోటి చెన్నైలోని ఎస్‌ఎంఎస్ ల్యాబ్‌కు వెళ్లాయి. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఆర్ డెయిరీ తాము పంపిన నెయ్యి నాణ్యమైనదిగా పేర్కొంటూ ఈ ల్యాబ్ జారీ చేసిన సర్టిఫికెట్‌ను సమర్పించడంతో సిట్ బృందం దానిపై దృష్టి సారించింది. ఏఆర్ డెయిరీ నెయ్యి నాణ్యతపై ఆ ల్యాబ్ ఇచ్చిన సర్టిఫికెట్ నిజమా? కాదా? దేని ఆధారంగా నెయ్యి నాణ్యతను సర్టిఫై చేశారు? ఎలా పరీక్షించారు? ఏయే పరికరాలు ఉన్నాయి? అవి ఎప్పటివి? వాటి సామర్థ్యం పరీక్షించే వారి ఉన్న అర్హతలు ఏమిటి? వారి అర్హతలు రుజువు చేసే సర్టిఫికెట్లు ఉన్నాయా? ల్యాబ్‌లో ఆహార కల్తీ నిరోధక విభాగానికి సంబంధించి నిపుణులున్నారా? ఏఆర్ డెయిరీ నెయ్యి సాంద్రత, నాణ్యతను గుర్తించిన నిపుణులు ఎవరు? ఎస్‌ఎంఎస్ ల్యాబ్ నుంచి బయట ఎక్కడికైనా నమూనాలు పంపించి టెస్టులు చేయించి రిపోర్టులు తెప్పిస్తున్నారా? తదితర ప్రశ్నావళిని రూపొందించుకుని వివరాలు సేకరించినట్టు సమాచారం. ఏఆర్ డెయిరీ నెయ్యి నాణ్యతను పరీక్షించి, సర్టిఫికెట్ జారీ చేసిన ల్యాబ్ నిపుణుల వివరాలు, చిరునామాలతో సహా సేకరించినట్టు తెలిసింది. సిట్ కీలక అధికారులు రంగప్రవేశం చేశాక దీనిపై సంబంధిత నిపుణులను లోతుగా ప్రశ్నించే అవకాశం ఉంది.
అధికారుల బృందాల్లో ఒకటి వైష్ణవి డెయిరీలో, మరొకటి దిండుగల్‌లోని ఏఆర్ డెయిరీలో తనిఖీలు చేపట్టాయి. ఈ రెండు డెయిరీల సామర్థ్యంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాయి. ఈ డెయిరీలు ఎప్పుడు ఏర్పాటయ్యాయి? ఎన్ని చిల్లింగ్ సెంటర్లు ఉన్నాయి? వాటి రోజువారీ పాల సేకరణ సామర్థ్యం ఎంత? ఆ పాలను ప్రాసెస్ చేసే సామర్థ్యం ఆ డెయిరీలకు ఉందా? ప్రాసెస్ సమయంలో ఆవు పాలు, గేదె పాలు రెండూ కలిపి వెన్న తీస్తున్నారా? పాల నుంచి ఎంత శాతం వెన్న వస్తోంది? వచ్చే వెన్నలో కిలోకు ఎంత నెయ్యి వస్తోంది? పాల నుంచి వెన్న తీసే యంత్ర పరికరాలు ఎప్పటివి? టీటీడీకి ఈ డెయిరీలే స్వయంగా నెయ్యి తయారు చేసి సరఫరా చేస్తున్నాయా లేక ఇతర డెయిరీల నుంచి సేకరించి పంపుతున్నాయా? అనే కోణాల్లో వివరాలు సేకరిస్తున్నారు. కాగా, టీటీడీకి నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం వైష్ణవి డెయిరీకి లేదని సిట్ బృందం ప్రాథమిక పరిశీలనలో వెల్లడైనట్టు తెలిసింది. రెండు డెయిరీల రికార్డులు పరిశీలించి అవసరమైన పత్రాలను విచారణ నిమిత్తం స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. కాగా, ఏఆర్ డెయిరీలో శనివారం మధ్యాహ్నం 1గంట నుంచి ఆదివారం తెల్లవారుజాము 2గంటల వరకు సుమారు 13 గంటల పాటు తనిఖీలు కొనసాగాయి. ఈ సోదాల్లో తిరుపతికి చెందిన 11 మంది అధికారులు పాల్గొన్నారు.