ఐటీ ఉద్యోగులకు ‘సూపర్ ఇన్సెంటివ్’
ABN , Publish Date - Dec 19 , 2024 | 05:06 AM
దేశంలో ఇంతవరకూ ఏ రాష్ట్రం కూడా ఐటీ రంగంలో ఉద్యోగులకు రాయితీలు ఇవ్వలేదని, కేవలం యాజమాన్యాలకే ఇస్తున్నారని ఐటీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(ఐటాప్) పూర్వ అధ్యక్షుడు,
దేశంలో ఒక్క ఏపీ ప్రభుత్వమే ప్రకటించింది
సీనియర్ ఉద్యోగులకు ఏడాదికి లక్ష ప్రోత్సాహకం
వరుసగా మూడేళ్ల పాటు ఉద్యోగి ఖాతాలో జమ
2030 నాటికి లక్ష కోట్ల ఐటీ ఎగుమతులు లక్ష్యం
టాప్-5 ఐటీ సిటీల్లో విశాఖను నిలబెడతాం
ప్రభుత్వానిది ఐటీ అనుకూల విధానం
ఏపీ డీటీఐఎల్‌ఎఫ్ కన్వీనర్ శ్రీధర్ కొసరాజు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
దేశంలో ఇంతవరకూ ఏ రాష్ట్రం కూడా ఐటీ రంగంలో ఉద్యోగులకు రాయితీలు ఇవ్వలేదని, కేవలం యాజమాన్యాలకే ఇస్తున్నారని ఐటీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(ఐటాప్) పూర్వ అధ్యక్షుడు, ఏపీ డిజిటల్ టెక్నాలజీ ఇండస్ట్రీ లీడర్‌షిప్ ఫోరం (ఏపీ డీటీఐఎల్‌ఎఫ్) కన్వీనర్ శ్రీధర్ కొసరాజు చెప్పారు. తొలిసారిగా ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు కూడా ‘సూపర్ ఇన్సెంటివ్’ ప్రకటించడం గర్వకారణమని అన్నారు. బుధవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. రాష్ట్రంలో ఐటీ, ఐటీఈఎ్‌సతో పాటు డిజిటల్ సాంకేతికతలను అన్ని రంగాల్లోకి తీసుకువెళ్లడానికి ఫోరం తరఫున ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
సూపర్ ఇన్సెంటివ్ అంటే...?
ఇంతవరకూ ఐటీ యాజమాన్యాలకు తక్కువ ధరకు భూములు, అద్దె రాయితీ, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే సంఖ్యను బట్టి ఇన్సెంటివ్‌లు ఇచ్చారు. ఉద్యోగులకు ఎవరూ ఇన్సెంటివ్‌లు ఇవ్వలేదు. ఒకటీ అరా ఇతర ప్రాంతాల్లో ఉన్నా అవి రూ.వేలల్లోనే ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన ఐటీ పాలసీలో ఎవరైనా సీనియర్ ఉద్యోగి (కనీసం పదేళ్ల సర్వీసు) ద్వితీయ శ్రేణి నగరాల్లో పనిచేయడానికి ముందుకొస్తే వారికి ఏడాదికి రూ.లక్ష ఇంటి అద్దె అలవెన్స్ లేదా వారి పిల్లల చదువుకు ఏటా రూ.లక్ష ఇన్సెంటివ్ ప్రకటించింది. ఇలా వరుసగా మూడేళ్లు నేరుగా ఉద్యోగి ఖాతాకే జమ చేస్తారు. దీనివల్ల విశాఖ, తిరుపతి వంటి ప్రాంతాల్లో పనిచేయడానికి చాలామంది ముందుకొస్తారు. విశాఖలో 150 వరకు ఐటీ కంపెనీలు ఉన్నాయి. వాటిలో సగటు వార్షిక జీతం రూ.2.5లక్షల నుంచి రూ.3లక్షలే. కానీ నెలకు రూ.2లక్షల జీతం ఇచ్చే కంపెనీలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ‘పెన్నాట్’ అనే సంస్థ రూ.5 లక్షలు ఇస్తోంది. ఎలక్ర్టికల్, ఎలక్ర్టానిక్స్‌లో ఇంజనీరింగ్ చేసినవారికి సెమీ కండక్టర్స్ కంపెనీలు నెలకు రూ.2 లక్షల జీతం ఇస్తున్నాయి. ఉద్యోగార్థుల్లో నైపుణ్యాలు కూడా ఉండాలి.
ఐటీ పాలసీ ఎలా ఉంది?
పాలసీ ఎలా ఉంటే బాగుంటుందో, పరిశ్రమకు ఏమేం అవసరమో అందరి అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నారు. డ్రాఫ్ట్ తయారు చేసినప్పుడు, తర్వాత వ్యక్తిగతంగానూ మాట్లాడారు. ఇది పూర్తిగా పరిశ్రమకు అనుకూల విధానం. చాలా బాగుంది.
ఐటీ రంగాన్ని అమరావతికి తరలిస్తున్నారా?
అదంతా దుష్ప్రచారం. అమరావతి రాష్ట్ర రాజధాని. అక్కడ అన్ని రంగాలకు ప్రాధాన్యం ఉండాలి. ఆ విధంగా కొంత ఐటీ కేటాయింపులు ఉంటాయి. అయితే ఐటీ డెస్టినేషన్ సెంటర్ విశాఖపట్నమే అని పాలసీలో స్పష్టంగా ప్రకటించారు. అందుకే టీసీఎస్, గూగుల్ కంపెనీలు ఇక్కడ పెడుతున్నారు.
హైదరాబాద్, బెంగళూరుతో విశాఖ పోటీ పడగలదా?
అలా పోటీ పడేలా చేయాలనేదే మా ఫోరం ప్రయత్నం. ప్రస్తుతం ఏపీ వార్షిక ఐటీ ఎగుమతుల విలువ రూ.5 వేల కోట్లు. అదే హైదరాబాద్‌లో రూ.2 లక్షల కోట్లు. 2030 నాటికి ఏపీ నుంచి రూ.లక్ష కోట్ల విలువైన ఎగుమతులు సాధించి, టాప్-5 ఐటీ నగరాల్లో ఒకటిగా విశాఖను నిలపాలనేది లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తూ అందుకు అనుగుణంగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలు పెంచాలని కోరాం. కొత్తగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు కూడా పెంచనున్నారు. గతంలో బీపీవో కంపెనీలు ప్రపంచంలో ఎక్కడో ఉండి భారత్‌లో ఖర్చు తక్కువని ఇక్కడ బ్యాక్ ఆఫీసులు నిర్వహించేవి. తరువాత ఇక్కడే సొంత కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఇప్పుడు అక్కడే కొత్త ఆలోచనలకు రూపకల్పన జరుగుతోంది. అవన్నీ ఇన్నోవేషన్ కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇవి ప్రత్యామ్నాయ హెడ్ క్వార్టర్లుగా మారుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివి 5వేల కేంద్రాలు ఉండగా వాటిలో ఒక్క భారత్‌లోనే 1,500 వరకూ ఉన్నాయి. రాష్ట్రంలోనూ వాటిని అభివృద్ధి చేయాలనేది లక్ష్యం.
5 లక్షల మందికి ఉపాధి కల్పన సాధ్యమా?
ప్రస్తుతం ఏపీలో 50వేల మంది ఐటీ ఉద్యోగులు ఉంటే 35వేల మంది ఒక్క విశాఖలోనే ఉన్నారు. ఇప్పుడు ఐటీ అర్థం మారిపోయింది. డీప్ టెక్నాలజీని అన్ని రంగాల్లో వాడుతున్నారు. రోబోటిక్స్, డ్రోన్లు వంటివన్నీ ఈ కోవలోకే వస్తాయి. ఏపీ మెడ్‌టెక్ జోన్‌లో కొత్త ఆవిష్కరణలన్నీ టెక్నాలజీ వల్లనే సాధ్యమవుతున్నాయి. కాకినాడ, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, భోగాపురం ఇలా కొత్త ప్రాంతాల్లో ఐటీని అభివృద్ధి చేస్తే ఉద్యోగ కల్పన సాధ్యమే.