నేడే కౌంటింగ్
ABN , Publish Date - Jun 03 , 2024 | 11:50 PM
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తీర్పు మంగళవారం వెలువడనుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టిన.. మరికొన్ని గంటల్లోనే అభ్యర్థుల్లో విజేతలెవరన్నది స్పష్టత రానుంది. ఏ పార్టీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నదీ.. ముఖ్యమంత్రి ఎవరన్నదీ.. నేడు తేలనుంది. ఎచ్చెర్లలో శివానీ ఇంజినీరింగ్ కళాశాలలోని స్ర్టాంగ్‌రూమ్ వద్ద.. ఓట్ల లెక్కింపునకు సంబంధించి అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తిచేసింది.
- సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు
- ముందుగా పోస్టల్ బ్యాలెట్లు... తర్వాత ఈవీఎంలు..
- అంతటా మోహరించిన పోలీసు బలగాలు
- ఏజెంట్లను అప్రమత్తం చేసిన రాజకీయపార్టీలు
- మరికొన్ని గంటల్లో తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం/ కలెక్టరేట్/ గుజరాతీపేట)
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తీర్పు మంగళవారం వెలువడనుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టిన.. మరికొన్ని గంటల్లోనే అభ్యర్థుల్లో విజేతలెవరన్నది స్పష్టత రానుంది. ఏ పార్టీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నదీ.. ముఖ్యమంత్రి ఎవరన్నదీ.. నేడు తేలనుంది. ఎచ్చెర్లలో శివానీ ఇంజినీరింగ్ కళాశాలలోని స్ర్టాంగ్‌రూమ్ వద్ద.. ఓట్ల లెక్కింపునకు సంబంధించి అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తిచేసింది. ఫలితాలపై అభ్యర్థులతో పాటు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జిల్లాలో శ్రీకాకుళం పార్లమెంట్‌తో పాటు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు గత నెల 13న పోలింగ్ నిర్వహించారు. 14,17,959 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా 25,826 మంది ఓటేశారు. శ్రీకాకుళం, ఇచ్ఛాపురం, ఎచ్చెర్ల, పలాస, నరసన్నపేట, టెక్కలి, పాతపట్నం, ఆమదాలవలస అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 86 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్యనే ప్రధాన పోటీ ఉంటుంది. కూటమి పొత్తులో భాగంగా ఎచ్చెర్లలో బీజేపీ అభ్యర్థిగా టికెట్ కేటాయించారు. దీంతో ఇక్కడ బీజేపీ, వైసీపీ మధ్య పోటీ ఉంటుంది. శ్రీకాకుళం లోక్‌సభ స్థానానికి 13 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి శ్రీకాకుళం సిట్టింగ్ ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, వైసీపీ నుంచి పేరాడ తిలక్ పోటీ చేశారు. వీళ్లందరి భవిత నేడు వెల్లడికానుంది.
- ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు...
ఏ ఎన్నికలకూ లేనంతగా ఈ దఫా పోస్టల్ బ్యాలెట్ల ఓట్లకు ప్రత్యేకత సంతరించుకుంది. జిల్లాలో 25,826 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు. అధిక శాతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వైసీపీకి వ్యతిరేకంగా పోలయ్యాయని తెలుస్తోంది. ఆ ఓట్లతోపాటు.. ఆయా కుటుంబాల ఓట్లు కూడా ఎన్నికల ఫలితాలలో ప్రభావితం చేస్తాయని ప్రజలందరూ భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మంగళవారం ఉదయం 8 గంటలకు పోస్టల్‌బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అరగంటలో బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. అనంతరం 8.30 గంటల నుంచి ఈవీఎంల ద్వారా ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు చేపట్టి.. ప్రతి రౌండ్ ఫలితాలను వెల్లడిస్తారు. ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కింపు ప్రక్రియ చేపట్టేందుకు 9 మంది రిటర్నింగ్ అధికారులు, 77 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, 492 మంది కౌంటింగ్ సూపర్‌వైజర్లు, 582 మంది కౌంటింగ్ అసిస్టెంట్‌లు, 397మంది మైక్రో అబ్జర్వర్లు, 439 మంది క్లాస్-4 ఉద్యోగులు.. మొత్తం 1996 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు.
- తొలిఫలితం ఆమదాలవలసతో...
పోలింగ్ స్టేషన్ల ఆధారంగా రౌండ్లను ఏర్పాటు చేసి ఈవీఎంల ద్వారా ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడతారు. మొత్తం ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 112 ఈవీఎం టేబుళ్లు, 29 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి సంబంధించి 98 ఈవీఎం టేబుళ్లను, 29 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లను సిద్ధం చేశారు. ఆమదాలవలస నియోజకవర్గానికి సంబంధించి కేవలం 19 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయి.. తొలి ఫలితం వెల్లడి కానుంది. ముందుగా ‘ఆమదాలవలస’ విజేత ఎవరన్నదీ స్పష్టమవుతుంది. ఆ తర్వాత శ్రీకాకుళం, ఎచ్చెర్ల, పలాస, ఇచ్ఛాపురం, టెక్కలి, నరసన్నపేట నియోజకవర్గాల ఫలితాలు వెల్లడవుతాయి. చివరాఖరున పాతపట్నం నియోజకవర్గం లెక్క తేలుతుంది. ఎంపీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మాత్రం అర్థరాత్రి వరకూ కొనసాగే అవకాశం ఉంది.
- మోహరించిన పోలీసు బలగాలు..
కౌంటింగ్ నేపథ్యంలో రాజకీయపార్టీల అనుచరుల మధ్య వివాదాలు జరగకుండా.. ఎటువంటి అల్లర్లు జరగకుండా పోలీసు బలగాలు మోహరించాయి. ప్రత్యేక దళాలైన సీఎస్‌ఎఫ్, సీఆర్పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్ బలగాలు జిల్లాకు చేరుకున్నాయి. కౌంటింగ్ ప్రాంతంతోపాటు జిల్లాలో అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లోలోనూ.. ప్రధాన సెంటర్ల వద్ద పోలీసులు మోహరించారు. సివిల్ సీఐ, ఎస్‌ఐలు స్టేషన్ల వారీగా విధులు నిర్వహిస్తూ.. స్థానికంగా అసాంఘీక కార్యకలాపాలు జరగకుండా ముందస్తుగా నిఘా పెట్టారు.
- శ్రీకాకుళంలో లాడ్జిలన్నీ హౌస్‌ఫుల్...
జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న శివానీ కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపట్టనుండడంతో.. ప్రఽధాన పార్టీల అభ్యర్థులు, వారి ఏజెంట్లు సోమవారం సాయంత్రం శ్రీకాకుళం చేరుకున్నారు. అన్ని లాడ్జీల్లో మకాం వేసేశారు. వేకువజామున ఆరుగంటలకే ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాల్సి ఉంది. అప్రమత్తంగా ఉండాలని.. వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడే అవకాశముందని.. జాగ్రత్త వహించాలని ఈ సందర్భంగా టీడీపీ అభ్యర్థులు.. వారివారి ఏజెంట్లకు సూచించారు. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదుచేయాలని సూచించారు. మెజార్టీ సంస్థల ఎగ్జిట్ పోల్స్ కూటమి విజయం ఖాయమని చెప్పడంతో.. టీడీపీ-జనసేన-బీజేపీ అభ్యర్థులు జోష్‌తో ఉన్నారు. వైసీపీ అభ్యర్థుల్లో మాత్రం గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
పోస్టల్ బ్యాలెట్ పారదర్శకంగా లెక్కించాలి: కలెక్టర్ మన్‌జీర్ జిలానీ సమూన్
‘ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరించి పోస్టల్‌బ్యాలెట్ లెక్కింపును పూర్తి అవగాహనతో చేపట్టాలి. పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించాల’ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మన్‌జీర్ జిలానీ సమూన్ అధికారులను ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియపై సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. పోస్టల్‌బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియలో ఫారం-13సి, ఫారం-13ఏ, ఫారం-13బికు సంబంధించిన అంశాలను కలెక్టర్ వివరించారు. సర్వీసు ఓటర్లకు సంబంధించి బ్యాలెట్ల లెక్కింపులో జాగ్రత్త వహించాలని సూచించారు.
పటిష్ఠ భద్రత ఏర్పాటు : ఎస్పీ జీఆర్ రాధిక
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశామని ఎస్పీ జీఆర్ రాధిక తెలిపారు. సోమవారం ఎచ్చెర్లలోని శ్రీ శివానీ ఇంజినీరింగ్ కళాశాలలో పోలీసు అధికారులు, సిబ్బందితో ఆమె సమావేశమయ్యారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద, పరిసర ప్రాంతాల్లో బందోబస్తు నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో వ్యవహరిస్తూ.. సమర్థవంతంగా ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కౌంటింగ్ సెంటర్‌లోకి ప్రవేశించిన ప్రతి ఒక్కరికీ క్షుణ్ణంగా తనిఖీ చేసి, గుర్తింపు కార్డు పరిశీలించి అనుమతించాలన్నారు. ఏజెంట్లు, అభ్యర్థులను వారికి కేటాయించిన మార్గాల ద్వారా లోపలికి పంపించాలని తెలిపారు. ఫోన్లు, ఎలక్ర్టానిక్ పరికరాలను లోపలికి తీసుకెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. 144 సెక్షన్ పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు. రాజకీయ నేతల విజయోత్సవ ర్యాలీలు, సభలు, సమావేశాల నిర్వహణకు వీలు లేదన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ జి.ప్రేమ్‌కాజల్, డి.గంగాధరం, వి.ఉమా మహేశ్వరరావు, డీఎస్పీలు వై.శృతి, ఎ.త్రినాథరావు, శ్రీనివాసరావు, ఎల్.శేషాద్రి నాయుడు, రాజారావు, సీఐలు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.