అక్టోబరు 4 నుంచి 12 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ABN , Publish Date - Aug 04 , 2024 | 05:25 AM
తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను అక్టోబరు 4వ తేదీ నుంచి అత్యంత వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి
ప్రత్యేక దర్శనాలు, ఆర్జితసేవలు రద్దు
టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి
తిరుమల, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను అక్టోబరు 4వ తేదీ నుంచి అత్యంత వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం సాయంత్రం ఆయన బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై తొలి సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ఇంజనీరింగ్ పనులు, వాహనాల ఫిట్నెస్, లడ్డూ బఫర్ స్టాక్, అన్నప్రసాదం, దర్శనం, వసతి, కళాబృందాల కార్యక్రమాలు, ఉద్యానవన శాఖ, ట్రాన్స్‌పోర్టు, కల్యాణకట్ట, గోశాల, శ్రీవారిసేవకులు, విజిలెన్స్ ఏర్పాట్లపై సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఆసౌర్యం లేకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. బ్రహ్మోత్సవాలకు అక్టోబరు 4న ధ్వజారోహణం జరుగుతుందన్నారు. 8న గరుడసేవ, 9న స్వర్ణరథం, 11న రథోత్సవం, 12న చక్రస్నానం నిర్వహిస్తారు. వాహన సేవలు రోజూ ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు ప్రారంభిస్తామని తెలిపారు. బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో వయోవృద్ధులు, దివ్యాంగులు, ఎన్‌ఆర్‌ఐలు, చిన్నపిల్లల తల్లిదండ్రులతో సహా అన్ని ప్రత్యేక దర్శనాలు, ఆర్జితసేవలను రద్దు చేశామన్నారు.