Share News

ఈ-ఆఫీస్‌ అప్‌గ్రేడ్‌ నిలిపేయండి

ABN , Publish Date - May 17 , 2024 | 04:11 AM

ఈ-ఆఫీసు వెర్షన్‌ అప్‌గ్రేడ్‌ చేసేందుకు రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అనుమానాలున్నాయని, ఈ వ్యవహారాన్ని తక్షణం నిలిపేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని టీడీపీ

ఈ-ఆఫీస్‌ అప్‌గ్రేడ్‌ నిలిపేయండి

ఈ ప్రక్రియపై అనుమానాలున్నాయి

కొత్త సర్కారు ఏర్పడే వరకూ నిలువరించండి

ఫైల్స్‌, నోట్‌ ఫైల్స్‌, రికార్డులు భద్రపరచండి

హెచ్‌ఓడీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి

గవర్నర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

అమరావతి, మే 16(ఆంధ్రజ్యోతి): ఈ-ఆఫీసు వెర్షన్‌ అప్‌గ్రేడ్‌ చేసేందుకు రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అనుమానాలున్నాయని, ఈ వ్యవహారాన్ని తక్షణం నిలిపేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర గవర్నర్‌ను కోరారు. ఈ మేరకు గురువారం ఆయన గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు లేఖ రాశారు. ప్రభుత్వం షెడ్యూల్‌ చేసిన ఈ-ఆఫీస్‌ వెర్షన్‌ అప్‌గ్రేడ్‌ వల్ల సీఎంవో, చీఫ్‌ సెక్రటరీ, ప్రభుత్వ విభాగాలకు సంబంధించి ఈ-ఆఫీసు ఈ నెల 17 నుంచి 25 వరకు అందుబాటులో ఉండదని ప్రకటించారని ఆ లేఖలో వివరించారు. అత్యవసరంగా ఇప్పుడు చేపట్టిన ఈ అప్‌గ్రేడ్‌పై అధికారులు, రాజకీయ పార్టీల్లో అనుమానాలున్నాయని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న ఈ సమయంలో ఈ-ఆఫీస్‌ వెర్షన్‌ మార్పు నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. ఈ-ఆఫీస్‌ మూసివేత, అప్‌గ్రేడ్‌ ప్రక్రియను కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టేదాకా నిలిపివేసేలా సీఎ్‌సను ఆదేశించాలని గవర్నర్‌ను కోరారు. అన్నీ ఫైల్స్‌, నోట్‌ఫైల్స్‌, రికార్డ్‌లు మాయం కాకుండా భద్రపరచాలన్నారు. అన్నీ హెచ్‌ఓడీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఇప్పటికే సీసీ కెమెరాలు ఉన్నచోట పరిశీలన జరపాలని కోరారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఉన్న ఫిజికల్‌ డాక్యుమెంట్లు, డిజిటల్‌ డాక్యుమెంట్లు, భద్రపరిచేలా సీఎస్‌కు ఆదేశాలివ్వాలని చంద్రబాబు ఆ లేఖలో కోరారు.

అధికార మార్పిడి తథ్యం: వర్ల రామయ్య

అమరావతి, మే 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అధికార మార్పిడి తథ్యమని, జగన్‌ గద్దె దిగడం ఖాయమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తేల్చి చెప్పారు. గురువారం టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో అధికార మార్పిడి జరుగుతున్నప్పుడు ముఖ్యమైన పత్రాలను ఆటోల్లో తరలించి దహనం చేశారని, ఇలాంటి నేపథ్యంలో ఏపీలో ఏ ఒక్క ఫైల్‌ను దహనం చేయకుండా గవర్నర్‌ చర్యలు తీసుకోవాలన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే జగన్‌ లొసుగులు బయటకు వస్తాయని, అధికారుల తప్పులు బయటపడతాయని కొంతమంది అధికారులు బయపడుతున్నారని తెలిపారు. పోలీసుస్టేషన్లలో ఎఫ్‌ఐఆర్‌లు తగలబెడుతున్నారని, కేస్‌ ఫైల్స్‌ను నాశనం చేస్తున్నారని... ఏ ఫైల్‌ కూడా నాశనం చేయకుండా డీజీపీ అన్నీ స్టేషన్లకు ఆదేశాలివ్వాలన్నారు.

జబ్బలు చరుచుకుంటున్నారు: దేవినేని ఉమ

వైసీపీ నేతలతో మాట్లాడే ధైర్యం లేక ఐప్యాక్‌ దొంగల ముఠాతో గెలుస్తామంటూ జగన్‌ జబ్బలు చరుచుకుంటున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. తొత్తులుగా ఉన్న అధికారులతో చేసిన తప్పులను తుడిచేసి దోచుకున్న రూ.లక్షల కోట్లతో విదేశాలకు పారిపోవడానికి జగన్‌ సిద్ధమయ్యారని ఉమ ఆరోపించారు. జూన్‌ 4న వచ్చే ఫలితాలను చూసి జగన్‌, వైసీపీ గ్యాంగ్‌ షాక్‌ అవబోతున్నారన్నారు. జగన్‌ ఘోర పరాజయాన్ని చూసి దేశం ఆశ్చర్యపోతుందని, రాష్ట్ర ప్రజలు సంతోషపడబోతున్నారని జోస్యంచెప్పారు. కూటమిని గెలిపించాలని ఓటర్లు పెద్దఎత్తున 82 శాతం ఓట్లు వేశారన్నారు. జగన్‌ లండన్‌ ప్యాకప్‌ అవుతున్నారని, ఇప్పటి వరకు వైసీపీ కోసం పనిచేసిన ఉద్యోగులను సజ్జల భార్గవ్‌ తరిమికొట్టాడని తెలిపారు. సజ్జల, జగన్‌ మాటలు విని అరాచకాలకు పాల్పడిన అధికారులను కాపాడటం ఎవరికీ సాధ్యం కాదని ఉమ తేల్చి చెప్పారు.

Updated Date - May 17 , 2024 | 04:11 AM