Share News

రేపటికల్లా తుఫాన్‌!

ABN , Publish Date - Oct 15 , 2024 | 04:16 AM

ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి మంగళవారానికి దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించి తీవ్ర అల్పపీడనంగా బలపడనుంది.

రేపటికల్లా తుఫాన్‌!

బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు మరింత బలోపేతం

దక్షిణ కోస్తా, సీమకు భారీ వర్ష సూచన.. నెల్లూరు, తిరుపతి,

చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌

17న చెన్నై సమీపంలో తీరం దాటుతుందని అంచనా

విశాఖపట్నం, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి మంగళవారానికి దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించి తీవ్ర అల్పపీడనంగా బలపడనుంది. ఆ తర్వాత రెండ్రోజుల్లో తమిళనాడు, దక్షిణ కోస్తా దిశగా వస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే ఈ అల్పపీడనం బుధవారానికి తుఫాన్‌గా మారుతుందని... 17వ తేదీకల్లా మరింత బలపడి చెన్నైకు దక్షిణం వైపున తీరం దాటుతుందని, అనంతరం వాయుగుండంగా బలహీనపడి అరేబియా సముద్రంలో ప్రవేశిస్తుందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. అరేబియా సముద్రంలో ప్రవేశించాక బలపడి తీవ్ర తుఫాన్‌గా మారే క్రమంలో ఈనెల 23న ఒమన్‌లో తీరం దాటుతుందని విశ్లేషించారు. మరో మోడల్‌ ప్రకారం... అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారుతుంది. నంతరం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడి 17న దక్షిణ కోస్తాలో తీరం దాటుతుంది. కాగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయవ్యంగా పయనించి ఈనెల 16కల్లా వాయుగుండంగా బలపడుతుందని ఇస్రో వాతావరణ నిపుణుడు తెలిపారు. తర్వాత తీవ్ర వాయుగుండంగా బలపడి 17 దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు మధ్య తీరం దాటుతుందని, ఆ సమయంలో గాలులు గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో వీస్తాయని పేర్కొన్నారు. దీనికితోడు దక్షిణ కోస్తాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో బంగాళాఖాతం నుంచి భారీగా తేమగాలులు రావడంతో ఆదివారం రాత్రి నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల, కోస్తాలో మిగిలినచోట్ల వర్షాలు కురిశాయి. సోమవారం సాయంత్రం వరకు కొడవలూరులో 110.25, ఇసకపల్లిలో 108.0, కావలిలో 104.25, బుచ్చిరెడ్డిపాలెంలో 97.25, దగదర్తిలో 92.75 మి.మీ. వర్షపాతం నమోదైంది.


సీమ, దక్షిణ కోస్తాలో అతిభారీ వర్షాలు

అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడ్రోజుల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవొచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మంగళవారం పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ కూర్మనాథ్‌ తెలిపారు. ‘తీరం వెంబడి గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. 17 వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదు’ అని సూచించారు. నెల్లూరు జిల్లాలో సముద్రంలో వేటకు వెళ్లిన 161 బోట్లను వెనక్కు రప్పించారు. నెల్లూరు జిల్లా కావలి, కొడవలూరులోని కొన్ని ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షాలకు దక్షిణ కోస్తా, సీమల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతాయని, రోడ్లు, కమ్యూనికేషన్స్‌ వ్యవస్థకు అంతరాయం కలుగుతుందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. కాగా.. అరేబియా సముద్రంలో తీవ్ర అల్పపీడనం బలపడి సోమవారం వాయుగుండంగా మారింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి మంగళవారానికి బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

గంటసేపు ఆగిన వందేభారత్‌

భారీ వర్షాలతో బాపట్ల జిల్లా పొన్నూరు సమీపంలో రైల్వే ట్రాక్‌ ధ్వంసమైంది. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి బయలుదేరిన వందేభారత్‌ రైలు మాచవరం స్టేషన్‌లో గంటసేపు నిలిచిపోయింది. అనంతరం మూడో రైల్వే ట్రాక్‌ మీదుగా బాపట్ల స్టేషన్‌కు వెళ్లింది. పొన్నూరు సమీపంలో రైల్వే ట్రాక్‌ ధ్వంసం కావటంతో విజయవాడ-బాపట్ల మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.

నెల్లూరు జిల్లాలో భారీ వర్షం

నెల్లూరు హరనాథపురం (ఆంధ్రజ్యోతి), అక్టోబరు 14 : నెల్లూరు జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది. సగటు వర్షపాతం 95.4 మి.మీగా నమోదైంది. నెల్లూరు నగరంలో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Updated Date - Oct 15 , 2024 | 04:17 AM