నిర్మాణం X నిర్వాకం
ABN , Publish Date - May 05 , 2024 | 04:47 AM
కట్టాలంటే సంకల్పం కావాలి! ప్రణాళిక రూపొందించాలి! ఆచరణలోకి తేవాలి! పట్టుదలతో ముందుకు సాగాలి! అందులోనూ ఒక నగరాన్ని నిర్మించాలంటే... అనితర సాధ్యుడై ముందుకు సాగాలి
నిర్మాణ యజ్ఞాన్ని బూడిదపాలు చేసిన జగన్
అద్భుత ప్రణాళికతో ‘అమరావతి’కి రూపకల్పన.. దేశంలోనే తొలిసారి నవ నగర సృష్టికి శ్రీకారం
రాజధాని కోసం భూసమీకరణ ఓ రికార్డు.. రహదారుల నుంచి భవనాలదాకా వినూత్న ప్రణాళిక
2019 మార్చి దాకా శరవేగంగా సాగిన పనులు.. వేలకొద్దీ కార్మికులతో నిత్యం నిర్మాణ జాతర
90 శాతం వరకు పూర్తయిన కొన్ని ప్రాజెక్టులు.. కళ్లుండీ చూడలేని గుడ్డివాళ్లలా వైసీపీ నేతలు
అమరావతిపై విషం చిమ్మి, విధ్వంసం సృష్టించిన జగన్
కట్టాలంటే సంకల్పం కావాలి! ప్రణాళిక రూపొందించాలి! ఆచరణలోకి తేవాలి! పట్టుదలతో ముందుకు సాగాలి! అందులోనూ ఒక నగరాన్ని నిర్మించాలంటే... అనితర సాధ్యుడై ముందుకు సాగాలి.
కానీ... కూల్చాలంటే! ఇవేవీ అక్కర్లేదు. విధ్వంసపు ఆలోచన ఒక్కటి చాలు! అంతా నాశనమే!
ఇందులో సంకల్పం నాటి సీఎం చంద్రబాబుదైతే... విధ్వంసం 2019లో గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డిది! కేవలం చంద్రబాబుపై కసితో ‘అమరావతి’ అనే ఆంధ్రుల కలను ఛిద్రం చేసిన నాయకుడు జగన్! తాను రాష్ట్రానికో ప్యాలెస్ కట్టుకుని... అమరావతిలో ప్రజాధనంతో నిర్మించిన భవనాలను పాడుపెట్టిన విధ్వంసకుడు జగన్! జగన్ అధికారంలోకి వచ్చేదాకా... అమరావతి ఒక అద్భుతం! అది కనీవినీ ఎరుగని నిర్మాణ యజ్ఞం!
ఒక్కసారి అమరావతి వైభవాన్ని గుర్తుకు తెచ్చుకుంటే..
పైసా ఖర్చు కాకుండా ప్రణాళిక
అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు. సేకరించిన భూమిలో రైతులకు ప్లాట్లు, ప్రభుత్వ నిర్మాణాలు, రోడ్లు, పార్కులకు పోను మిగిలిన భూమి అమ్మకం ద్వారా వచ్చే సొమ్ముతోనే రాజధానిని నిర్మించే ప్రణాళిక రూపొందించారు. 8,437 ఎకరాల మిగులు భూమి ప్రస్తుతం ప్రభుత్వ స్వాధీనంలో ఉంది. ఎన్నికల ముందు ఇక్కడ మార్కెట్ విలువ గజం రూ.36 వేలకు పెరిగింది.
ఆ లెక్కన 8,437 ఎకరాల విలువ రూ.1.48 లక్షల కోట్లు. ఈ డబ్బుతోనే రాజధానిని నిర్మించవచ్చు. సైబరాబాద్ తరహాలో భూముల విలువ పెరుగుతుందని అంచనా.
మొత్తం రూ.4.26 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉంది. ఆ భూమిని దశలవారీగా అమ్ముతూ రాజధాని నిర్మాణానికి చేసిన అప్పులను వడ్డీతో సహా చెల్లించవచ్చు. మిగిలిన డబ్బును 13 ఉమ్మడి జిల్లాల అభివృద్ధికి వినియోగించుకోవచ్చు.
ఆకాశాన్నంటేలా వరుసలో నిల్చున్న భారీ క్రేన్లు! అల్లంత దూరం నుంచే కాంక్రీటు పోసే ఆధునిక యంత్రాలు! విసుగూ విరామం లేకుండా నిరంతరం దుమ్ములేపుతూ మెటీరియల్‌ను చేరవేస్తున్న టిప్పర్లు! ఒకేసారి, ఒకే చోట కొన్ని వేల మంది నిర్మాణ కార్మికులు! ‘అమరావతి’లో అప్పుడు సాగింది ఒక మహా నిర్మాణ యజ్ఞం! నవ్యాంధ్రుల రాజధాని కళ్లముందు ఆవిష్కృతమవుతున్న అద్భుతం! అవి ఉత్తుత్తి డిజైన్లు కావు! గ్రాఫిక్ మాయలు కావు! కళ్లముందు పోతపోసినట్లు నిలిచి ఉన్న భారీ నిర్మాణాలు! 2019 మార్చి-ఏప్రిల్ నాటికి రాజధాని ప్రాంతంలో కనిపించిన దృశ్యాలు ఇవి!
ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏమిటంటే... ముళ్ల కంపల మధ్య అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణాలు. నాలుగున్నరేళ్లుగా నీళ్లలో నానుతున్న జీఏడీ టవర్ల పునాదులు. తుప్పు పట్టిపోతున్న ఐరన్. సగంలో వదిలేసిన పైపు లైన్లు. ధ్వంసమైన రోడ్లు!
ఒక అద్భుతానికి శ్రీకారం...
రాజధానిలేని రాష్ట్రంగా నవ్యాంధ్ర! రాష్ట్రంలో నవోత్తేజం నింపే ఒక వినూత్నమైన కార్యం చేపట్టాలి! ప్రపంచమే మనవైపు చూడాలి! కేవలం రాజధాని నగరంగా మాత్రమే కాదు... అది రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టాలి. దేవతల రాజధానిని దివి నుంచి భువికి దించాలి! ఈ ఆలోచన నుంచి పుట్టిందే ‘అమరావతి’! ఏదైనా కొత్తగా, భారీగా, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆలోచించే చంద్రబాబు నవ్యాంధ్ర తొలి సీఎంగా ‘అమరావతి’కి ప్రాణప్రతిష్ఠ చేశారు. భూసమీకరణ నుంచి నిర్మాణం వరకు... ఈ నగర ప్రణాళిక ఒక అద్భుతం!
ల్యాండ్ పూలింగ్ రికార్డు
చంద్రబాబు ప్రభుత్వం రాజధాని కోసం పైసా ఖర్చు లేకుండా 58 రోజుల్లో 33 వేల ఎకరాల భూములను రైతుల నుంచి సమీకరించి రికార్డు సృష్టించింది. 2015 జనవరి 1న భూసమీకరణ పథకానికి సీఆర్‌డీఏ రూపకల్పన చేసింది. 28,538 మంది రైతుల నుంచి 34,395.50 ఎకరాలను సమీకరించింది. అమరావతి ల్యాండ్ పూలింగ్‌ను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ కేస్ స్టడీగా తీసుకోవడం విశేషం.
ఇటుక లేకుండానే...
ఇటుక మీద ఇటుక పెట్టి, గోడలు కట్టి, స్లాబులు వేసి, క్యూరింగ్ చేసి... ఇది సంప్రదాయ పద్ధతి! కానీ నిర్మాణ రంగంలో అప్పుడప్పుడే ప్రాచుర్యంలోకి వచ్చిన ‘ప్రికాస్ట్’ టెక్నాలజీని అమరావతికి పరిచయం చేశారు.
పిల్లర్ల నుంచి స్లాబు వరకు మరోచోట సిద్ధం చేసి... వాటిని తరలించి, అతికించి భవనాన్ని సిద్ధం చేసేస్తారు! సీఆర్డీయే ప్రధాన కార్యాలయాన్ని పూర్తిగా ఈ ప్రికాస్ట్ విధానంలో చేపట్టారు.
పిల్లర్లు, మెట్లు, గోడలు, శ్లాబ్, చివరికి బాత్‌రూమ్ గోడలను కూడా ప్రికా్‌స్టలోనే అమర్చేలా డిజైన్ చేశారు.
ఏడంతస్తుల ఈ భవంతిలో సీఆర్డీయేతోపాటు అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ), ఏపీరెరా తదితర కార్యాలయాలు కొలువుతీరేలా చేపట్టారు.
60 శాతానికిపైగా పూర్తయిన ఈ నిర్మాణం జగన్ కారణంగా ఆగిపోయింది.
ఇదీ పరిపాలనా నగరి..
ఒక కిలోమీటరు వెడల్పు... 6.6 కిలోమీటర్ల పొడవు! ఇది అమరావతిలోని పాలనా నగరి భౌగోళిక విస్తీర్ణం! ఒకవైపు కృష్ణా నదిని ఆనుకుని ముఖ్యమంత్రి నివాసం, రాజ్‌భవన్‌తో ఈ ‘నగరం’ మొదలవుతుంది.
ఆ తర్వాత వరుసగా... మంత్రులు, ఎమ్మెల్యేలు, న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు, అధికారులు, సిబ్బంది గృహ సముదాయాలు, జడ్జీల బంగళాలు... హైకోర్టు, జ్యుడీషియల్ కాంప్లెక్స్, సచివాలయ టవర్లు నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు.
మొత్తం అమరావతికి ‘పరిపాలనా నగరి’ హృదయంలాంటిది. ఇది కేవలం పరిపాలనా, అధికారుల నివాస ప్రాంతంగా మాత్రమే కాకుండా... ప్రజలు, సందర్శకులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచేలా డిజైన్ చేశారు. పరిపాలనా నగరిలో ఎక్కడా గజిబిజితనం కనిపించదు.
వీధి దీపాల స్తంభాలు మినహా తీగలు కూడా బయటికి కనిపించవు. ఈ ప్రాంతంలో ఉన్న హైటెన్షన్ టవర్లను మరో చోటికి (రీలొకేట్) తరలించారు. 6.6 కిలోమీటర్ల పొడవునా కొత్త లైన్‌వేసి ఎల్‌ఈడీ విద్యుత్ దీపాలను అమర్చారు.
గృహ శోభ...
నగరం అంటేనే ట్రాఫిక్ జంఝాటం! ఉరుకులు, పరుగుల జీవితం! కానీ... అమరావతి పరిధిలోని ఉద్యోగులకు ఇలాంటి కష్టాలేవీ లేకుండా ప్రణాళిక రూపొందించారు. ప్రభుత్వ పాలనా నగరి పరిధిలోనే గెజిటెడ్ అధికారులకు, ఎన్జీవోలకు, నాలుగో తరగతి ఉద్యోగులకు క్వార్టర్స్ నిర్మాణం మొదలుపెట్టారు.
ఇంటి నుంచి కార్యాలయానికి పది నిమిషాల్లోపు చేరుకునేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఉద్యోగులతోపాటు అఖిల భారత సర్వీసు అధికారులు, వివిధ స్థాయి ఉద్యోగులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల కోసం 61 టవర్లలో ఏకంగా 3840 ఫ్లాట్ల నిర్మాణం చేపట్టారు.
అన్నిచోట్లా షియర్ వాల్ టెక్నాలజీని వినియోగించారు. 2019 జనవరి నాటికే 1200కు పైగా ఫ్లాట్ల నిర్మాణం పూర్తయింది. ఇవి కాకుండా... కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శుల కోసం 186 బంగ్లాల నిర్మాణం చేపట్టారు. ఈ మొత్తం వైభవాన్ని జగన్ ధ్వంసం చేశారు.
పేదలకూ చక్కటి గూడు
అమరావతి ప్రజా రాజధాని! ఇక్కడ అన్ని వర్గాల వారికీ చోటు కల్పించారు. రాజధాని పరిధిలో భూమిలేని పేదల కోసం ప్రత్యేకంగా పీఎంఏవై-ఎన్టీఆర్ గృహ సముదాయాలను నిర్మించారు.
చక్కటి ప్లానింగ్, ప్రమాణాలతో ‘ఎంత బాగున్నాయో’ అనిపించేలా... పది గ్రామాల్లో ఐదు వేల గృహాల నిర్మాణం దాదాపుగా పూర్తయింది. చాలాచోట్ల ఇక లబ్ధిదారులకు వాటిని కేటాయించడమే మిగిలింది. వీటన్నింటినీ జగన్ పాడుపెట్టారు. పేదలపైనా పగబట్టారు.
తవ్వకాల తంటా ఉండదు
విద్యుత్తు, నీరు, వంటగ్యాస్, సమాచార వ్యవస్థ ఇలా అన్ని అవసరాలకోసం ప్రత్యేకంగా భూగర్భంలోనే ‘డక్ట్’ల నిర్మాణం చేశారు. దీనివల్ల... మళ్లీ మళ్లీ రోడ్లు తవ్వాల్సిన అవసరమే ఉండదు. సీడ్ యాక్సెస్ రోడ్ పొడవునా ఏకంగా ఆరు అడుగుల వెడల్పు, ఆరు అడుగుల ఎత్తుతో డక్ట్‌ల నిర్మాణం చేపట్టారు.
అమరావతిలోని అన్ని రహదారుల వెంటా ఇలాంటి డక్ట్‌లు ఉంటాయి. వర్షపునీటి ప్రవాహానికీ ముందుగానే కాలువలు తవ్వేలా ప్రణాళిక రూపొందించారు.
ఇక... మొత్తం రాజధాని తాగునీటి అవసరాలకోసం భూగర్భంలో భారీ పైప్‌లైన్ల నిర్మాణాన్ని చేపట్టారు. జగన్ వచ్చేశాక ఈ డక్ట్‌లన్నీ గోతులుగా మారాయి. పైపులను దొంగలు ఎత్తుకెళుతున్నా దిక్కులేదు.
‘స్పీడ్’ యాక్సెస్...
రాజధానిలో రవాణాకు అతి కీలకమైనది, ప్రత్యేకమైనది స్పీడ్ యాక్సెస్ రోడ్! విజయవాడ-గుంటూరు దారిలో కనకదుర్గ వారధి నుంచి దొండపాడు వరకు... 21.2 కిలోమీటర్ల దారి 2019 జనవరి నాటికే పూర్తయింది. జగన్ పార్టీ కుయుక్తులు, కుట్రల కారణంగా... భూసమీకరణ సమస్య ఏర్పడి 3 కిలోమీటర్ల దారి మాత్రం పూర్తి కాలేదు.
ఈ రోడ్డు వెడల్పు 200 అడుగులు! అలాగే... రాజధాని నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సులువుగా, వేగంగా చేరుకునేలా మొత్తం 320 కి.మీ. ప్రాధాన్య రహదారుల నిర్మాణం చేపట్టారు.
సమున్నతంగా సచివాలయ టవర్స్..
మొత్తం రాజధాని పరిధిలో సమున్నతంగా నిలిచే భవనాలు... సచివాలయ టవర్లు! మొత్తం ఐదు ఆకాశ హర్మ్యాల పనులను రూ.3,500 కోట్ల వ్యయంతో చేపట్టారు. 2019 జనవరి నాటికే వీటన్నింటి ర్యాఫ్ట్ ఫౌండేషన్ దాదాపు ముగిసింది.
దేశంలోనే మొదటిసారిగా... సచివాలయంతోపాటు ఆయా శాఖల ప్రధాన కార్యాలయాలు కూడా ఒకేచోట కొలువుతీరేలా వీటిని రూపొందించారు. ముఖ్యమంత్రి, సీఎస్ ఉండే జీఏడీ టవర్‌ను 50 అంతస్థులతో... ఇతర టవర్లను 40 అంతస్థులతో ప్లాన్ చేశారు. జగన్ విధ్వంస ఆలోచన కారణంగా... ఈ ర్యాఫ్ ఫౌండేషన్లు నీళ్లలో నానుతున్నాయి.
కొలువు దీరిన కార్మిక శక్తి...
అమరావతి నిర్మాణంలో 20కిపైగా కాంట్రాక్టు సంస్థలు ఏకకాలంలో భాగస్వాములయ్యాయి. అప్పట్లో.. నిత్యం 15 వేల నుంచి 20 వేల మంది కార్మికులు పనిచేసేవారు. వీరందరి కోసం నిర్మాణ స్థలాల్లోనే నివాసాలు ఏర్పాటు చేశారు. అక్కడంతా ఒక జాతరలా ఉండేది. జగన్ రాగానే ఇదంతా ఒక్కసారిగా మాయమైపోయింది.