Share News

బీచ్‌లో నిర్మాణాలా?

ABN , Publish Date - Sep 12 , 2024 | 03:42 AM

విశాఖపట్నం, భీమునిపట్నం బీచ్‌లో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె పెనకా నేహారెడ్డి చేపట్టిన నిర్మాణాలపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది.

బీచ్‌లో నిర్మాణాలా?

ఫొటోలు పరిశీలిస్తే స్పష్టంగా తెలుస్తుంది

మొత్తం ఆ నిర్మాణాల సంగతి చూడండి

సాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి

నిర్మాణాలపై హైకోర్టు విస్మయం

ప్రహరీ కూల్చివేత ఖర్చును ఆమె నుంచే

వసూలు చేయాలని జీవీఎంసీకి ఆదేశం

అమరావతి, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం, భీమునిపట్నం బీచ్‌లో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె పెనకా నేహారెడ్డి చేపట్టిన నిర్మాణాలపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఫొటోలను పరిశీలిస్తే ఆ నిర్మాణాలన్నీ బీచ్‌లోనే నిర్మించినట్లు స్పష్టంగా అర్థమవుతుందని పేర్కొంది. ప్రహరీ విషయమే కాదు ఆ నిర్మాణాల సంగతి కూడా చూడాలని జీవీఎంసీని ఆదేశించింది. ప్రహరీ కూల్చివేతకు అయిన ఖర్చును కూడా నేహారెడ్డి నుంచే వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. నిర్మాణాలు చేపట్టిన భూమి యాజమాన్య హక్కులపై ఆధారాలు చూపాలంటూ జీవీఎంసీ ఆమెను వివరణ అడిగిన నేపథ్యంలో హైకోర్టు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. భీమునిపట్నం పరిధిలో సీఆర్‌జెడ్‌ నిబంధనలను ఉల్లంఘించి సముద్రానికి అతిసమీపంలో విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి నిర్మాణాలు చేపడుతున్నారంటూ జనసేన కార్పొరేటర్‌ మూర్తియాదవ్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. పిల్‌పై విచారణ జరిపిన సీజే ధర్మాసనం సీఆర్‌జెడ్‌ నిబంధనలు ఉల్లంఘించి సముద్ర తీరంలో జరుపుతున్న నిర్మాణాలను నిలుపుదల చేయాలని, వాటి తొలగింపునకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. బుధవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది.

ధర్మాసనం ఆదేశాలను అనుసరించి బీచ్‌లో నిర్మించిన ప్రహరీని అధికారులు తొలగించారని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) ఎస్‌.ప్రణతి తెలిపారు. ఇతర నిర్మాణాల విషయంలో నేహారెడ్డి ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదన్నారు. ఈ నేపఽథ్యంలో ఆ భూమికి సంబంధించిన యాజమాన్య హక్కుపై ఆధారాలు చూపాలని అధికారులు నోటీసులు ఇచ్చారన్నారు. వివరాలు సమర్పించేందుకు మరో రెండు రోజులు సమయం ఉందన్నారు. మూర్తియాదవ్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... ప్రభుత్వం సమర్పించిన నివేదికపై రిప్లై వేసేందుకు సమయం ఇవ్వాలని కోరారు. నేహారెడ్డి తరఫు న్యాయవాది స్పందిస్తూ... తమను ప్రతివాదిగా చేర్చకుండానే ప్రజాహిత వ్యాజ్యంలో ఆదేశాలు పొందారన్నారు. కేసులో సీనియర్‌ న్యాయవాది వాదనలు వినిపిస్తారని, ఈ రోజే వకాల్తా వేశామన్నారు. వ్యాజ్యంపై గురువారం విచారణ చేపట్టాలని కోరారు. ధర్మాసనం విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.

Updated Date - Sep 12 , 2024 | 03:42 AM