Share News

అటకెక్కిన ‘ఫిష్‌ ఆంధ్ర’

ABN , Publish Date - Aug 25 , 2024 | 05:31 AM

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడానికే ‘ఫిష్‌ ఆంధ్ర’ అంటూ డప్పు కొట్టిన వైసీపీ ప్రభుత్వం..

అటకెక్కిన ‘ఫిష్‌ ఆంధ్ర’

లబ్ధిదారులకు భారమైన ఫ్రాంచైజీ, బ్రాండింగ్‌

వినియోగదారుల నుంచి కరువైన ఆదరణ

లక్షల్లో నష్టపోయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువత

అమరావతి, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడానికే ‘ఫిష్‌ ఆంధ్ర’ అంటూ డప్పు కొట్టిన వైసీపీ ప్రభుత్వం... ఆచరణలో భారీ అవినీతికి తెరతీసింది. వైసీపీ పార్టీ రంగులతో, ప్రచార ఆర్భాటంతో ఆరంభమైన 2,300 యూనిట్లలో చాలా వరకూ మూతపడ్డాయి. లబ్ధిదారులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు రూ.లక్షల్లో నష్టపోయారు. టీడీపీ ప్రభుత్వం దీనిపై దృష్టిపెడితే అవినీతి చేపలు దొరికే అవకాశం ఉంది. లబ్ధిదారులకు నగదు రాయితీ ఇచ్చి, నిర్దేశిత ప్రమాణాలతో రిటైల్‌ ఔట్‌లెట్లు ఏర్పాటు చేసుకోవాలని చెప్పాల్సిన మత్స్య శాఖ... ఫ్రాంచైజీ రుసు ము చెల్లించాలని, పరికరాలను తాము చెప్పిన సంస్థ నుంచే తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడే అవినీతి, అవకతవకలకు ఆస్కారం ఏర్పడింది. ‘ఫిష్‌ ఆంరఽధ’ కాస్తా... ‘స్కామ్‌ ఆంరఽధ’గా మారింది. వస్తుసామాగ్రిని తమకు అనుకూలమైన సంస్థల నుంచి కొనుగోలు చేయించి, నిధుల గోల్‌మాల్‌కు తెరదీశారు. బ్యాంకు రుణం, కేంద్రం, లబ్ధిదారుని వాటా నిధులతో వస్తు సామాగ్రి కొనుగోలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన తనవంతు వాటాను విడుదల చేయలేదు. లైవ్‌ ఫిష్‌ టబ్‌, బల్లలు, చేపలు శుద్ధి చేసే పనిముట్లు, శీతలీకరణకు రిఫ్రిజిరేటర్‌, ఐస్‌ తయారీ యంత్రం తదితర వస్తువులు... నాణ్యత ఏ మాత్రం లేనివాటిని ఎక్కువ ధరకు కొనుగోలు చేయించారు. లోగుట్టుగా అవినీతికి పాల్పడిన వైసీపీ నేతలు, అధికారులు... ప్రచారాన్ని మాత్రం ఊదరకొట్టారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 20,000 మందికి ఉపాధి లభించిందని వైసీపీ ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. ఫ్రాంచైజీ పేరుతో ఆరంభంలో రూ.80 వేలు వసూలు చేసిన మత్స్య శాఖ... ఫిష్‌ ఆంధ్ర బ్రాండింగ్‌ కోసం ప్రతి నెలా రూ.7,000 చెల్లించాలన్న నిబంధన పెట్టింది. ప్రారంభించిన కొద్ది నెలలకే కొనుగోలు చేసిన వస్తు సామాగ్రిలో చాలా వరకూ మూలకు చేరింది. నిర్వహణ భారమయింది. లైవ్‌ ఫిష్‌ వ్యాపారానికి ఆదరణ లభించలేదు. దీంతో ఫిష్‌ ఆంధ్ర అటకెక్కింది. మళ్లీ 20 వేల మంది రోడ్డుపైకి వచ్చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ఈ పథకం తీరుతెన్నులపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తే అనేక అవకతవకలు బయటపడతాయి.

Updated Date - Aug 25 , 2024 | 05:32 AM