సూపర్ 6 అమలు చేస్తాం
ABN , Publish Date - Oct 02 , 2024 | 04:47 AM
‘జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. పాలనంతా గాడి తప్పింది. ఖజానాలో చిల్లిగవ్వ లేదు.
ప్రతి హామీ నెరవేర్చి తీరుతాం: బాబు
ఇప్పటికే మెగా డీఎస్సీ వేశాం
డిసెంబరులో పరీక్షలు.. వెంటనే భర్తీ
పింఛను రూ.4 వేలకు పెంచాం
దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు
175 అన్నక్యాంటీన్లు పెట్టాం
పేదల జీవితాల్లో వెలుగే నా సంకల్పం
21 మంది ఎంపీలను గెలిపించారు.. వారే రాష్ట్రానికి సంజీవని: బాబు
2019లో టీడీపీని ఓడించి తప్పుచేశారు. ఇప్పుడు 93 శాతం టీడీపీ కూటమి ఎమ్మెల్యేలను గెలిపించారు. 21 మంది కూటమి ఎంపీలను కూడా గెలిపించి మంచి పని చేశారు. వారే ఈ రాష్ట్ర అభివృద్ధికి సంజీవని.
ఎన్నికల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చాం. అది సాకారం కావాలంటే పరిశ్రమలు రావాలి. రాయలసీమను గ్రీన్ హబ్‌గా అభివృద్ధి చేసి 7 లక్షల ఉద్యోగాలు ఇచ్చేలా కృషి చేస్తున్నాం.
-కర్నూలు జిల్లా పుచ్చకాయలమడ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నా
జగన్ పాలనలో విధ్వంసం
ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్ల అప్పు
దానికి వడ్డీయే లక్ష కోట్లవుతోంది
ఖజానాలో చిల్లిగవ్వ లేకుండా మొత్తం దోచుకెళ్లాడు
అందుకే ఎస్కోబార్ అంటున్నా
ఆయన హయాంలో ఉద్యోగులకు జీతాలెప్పుడు ఇస్తారో తెలిసేది కాదు
ఇప్పుడు 1వ తేదీనే ఇస్తున్నాం
గోదావరి-పెన్నా అనుసంధానంతో రాయలసీమ సస్యశ్యామలం: సీఎం
కర్నూలు, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): ‘జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. పాలనంతా గాడి తప్పింది. ఖజానాలో చిల్లిగవ్వ లేదు. రూ.10 లక్షల కోట్లు అప్పులు చేస్తే.. వడ్డీనే రూ.లక్ష కోట్లు అవుతోంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇటుక ఇటుక పేర్చి రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తున్నానని చెప్పారు. రాష్ట్రానికి పూర్వ వైభవం తెచ్చేంత వరకు ఓ సైనికుడిలా పని చేస్తానని స్పష్టం చేశారు. మంగళవారం కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పుచ్చకాయలమడలో ఆయన ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను సొమ్ము స్వయంగా అందజేశారు. కుటుంబ సభ్యులతో మమేకమై వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కష్టసుఖాల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం గ్రామంలోని కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ‘ప్రజావేదిక పేదల సేవలో’ సభలో మాట్లాడారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉండేదని, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామన్నారు. పేదల జీవితాల్లో వెలుగు చూడాలన్నదే తన సంకల్పమని చెప్పారు. ‘పెంచిన పెన్షన్‌ను ఏప్రిల్ నుంచే ఇస్తానని ఎన్నికల్లో చెప్పినట్లు ఒకేసారి రూ.7 వేలు పంపిణీ చేశాను. మన ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే రూ.12,500 కోట్లు పంపిణీ చేశాం. ఏడాదికి రూ.35 వేల కోట్లు ఖర్చవుతుంది. ఈ పథకాన్ని శాశ్వతంగా కొనసాగిస్తాం..’ అని తెలిపారు. ఇంకా ఏమన్నారంటే..
అనుసంధానంతో కరువు, వలసలు ఉండవ్..
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో మిగులు జలాలు రాయలసీమ ప్రాంతానికి వాడుకునే అవకాశం ఉంటుంది. గోదావరి, పెన్నా అనుసంధానం చేస్తే సీమ సస్యశ్యామలమై కరువు, వలసలు ఉండవు. అందుకే పోలవరాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాం. ఈ ప్రాజెక్టును పూర్తి చేసి తద్వారా మిగులు జలాలను రాయలసీమకు మళ్లించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి తీరుతాం. హైదరాబాద్ తరహాలో అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. 2019లో టీడీపీని గెలిపించి ఉంటే.. ఇప్పటికే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి. ఆ ఎన్నికల్లో ఓటర్లు తప్పు చేసి జగన్‌ను గెలిపిస్తే.. రాష్ట్రాన్ని ధ్వంసం చేయడమే కాదు.. ఖజానాలో చిల్లిగవ్వ లేకుండా మొత్తం దోచుకెళ్లాడు. అందుకే ఆయన్ను ఎస్కోబార్ అన్నాను. మొన్నటి ఎన్నికల్లో నేను, పవన్ కల్యాణ్, బీజేపీ కలిసి పోటీ చేస్తే అపూర్వమైన విజయాన్ని అందించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాలి. పరిశ్రమలు రావాలి. జగన్ ఈ రెండింటినీ నిర్వీర్యం చేశారు. ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. పరిశ్రమలు పెట్టాలనుకున్నవారు భయంతో పారిపోయారు. మళ్లీ మనం అధికారంలోకి వచ్చాక ఈ రెండు రంగాలపై దృష్టి పెట్టాం. సాంకేతికతను సద్వినియోగం చేసుకుని ఇంట్లో ఉంటూ పని చేసుకునేలా వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని అభివృద్ధి చేస్తాం.
హామీలు ఒక్కటొక్కటిగా అమలు..
ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తాం. కూటమి అధికారం చేపట్టగానే 16,300 ఉద్యోగాలతో మెగా డీఎస్సీ ఇచ్చాం. డిసెంబరులో పరీక్షలు పూర్తి చేసి ఉద్యోగాలు ఇస్తాం. పింఛన్లు రూ.4 వేలకు పెంచాం. దీపావళి నుంచి ఏటా ఇంటికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తాం. అన్న క్యాంటీన్లు 175 పెట్టాం. సూపర్ సిక్స్ హామీలు ఒక్కొక్కటిగా అమలు చేసి పేదలను లక్షాధికారులను చేయాలనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. డిసెంబరులో స్కిల్ సెన్సస్ పూర్తి చేస్తాం. గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్టు తెచ్చి రైతుల భూములతో ఆడుకుంటే మన ప్రభుత్వం రాగానే ఆ యాక్టును రద్దు చేశాం. రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు అందజేస్తాం. నాణ్యమైన మద్యం క్వార్టర్ సీసా రూ.99కే అందజేస్తాం. అదే క్రమంలో మద్యం అలవాటు మార్చేసేందుకు రూ.100 కోట్లతో ఓ పథకాన్ని తీసుకొస్తున్నాం. ప్రతి ఇంటికీ 200 యూనిట్లకు సూర్యఘర్ పథకం కింద సోలార్ పవర్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తాం. వరద బాధితులకు ప్రజలు అండగా నిలిచారు. ప్రభుత్వం రూ.650 కోట్లు ఖర్చు చేస్తే ప్రజలే రూ.436 కోట్లు అందించి ఆదుకున్నారు.
బాధితులకు అండగా చంద్రన్న
అడిగిన వెంటనే ఆటో, ఇల్లు మంజూరు
పత్తికొండ మండలం పుచ్చకాయలమడలో వితంతు మహిళ తలారి గంగమ్మకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు డిగ్రీ పూర్తి చేస్తే.. చిన్న కుమారుడు ఆటో నడుపుతున్నాడు. తనకు ఇల్లు, కొడుకు ఉపాధి కోసం ఆటో ఇవ్వాలని ఆమె కోరగా.. అక్కడే మంజూరు చేస్తూ ఎలక్ర్టిక్ ఆటో అందజేయాలని కలెక్టర్ రంజిత్ బాషాను సీఎం ఆదేశించారు. వృద్ధుడు చింతకాయల వెంకటేశ్ ఇంటికి వెళ్లగా.. తమకు ఉండడానికి ఇల్లు లేదని, ఓ ఇల్లు మంజూరు చేయాలని కోరగా.. చంద్రబాబు స్పందించి ఇంటిని మంజూరు చేశారు. అలాగే పొలంలో బోరుబావి తవ్విస్తానని చెప్పగా.. బోరు తవ్వితే ఉప్పునీళ్లు పడతాయని.. తమకు అది వద్దని ఆ రైతు చెప్పడంతో చలించిపోయిన ముఖ్యమంత్రి.. గ్రామానికి సమీపంలో ప్రవహిస్తున్న హంద్రీ-నీవా కాలువ ద్వారా ఊరంతా సాగునీరు అందిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. పుచ్చకాయలమడను మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు.
పల్లె ప్రగతికి పెద్దపీట
గ్రామ సీమల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. రాష్ట్రంలో ఒకేరోజు 11,320 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టాలని మిత్రుడు పవన్ కల్యాణ్ ఆలోచించారు. ఇది మంచి ఆలోచన అని చెప్పి ముందుకెళ్లాం. దేశంలోనే ఇదో రికార్డు. పల్లె అభివృద్ధికి రూ.990 కోట్లు ఇచ్చాం. కేంద్రం ద్వారా మరో రూ.1,200 కోట్లు ఇచ్చేలా ప్లాన్ చేశాం. ఒకనాడు జనాభా తగ్గాలని నేనే చెప్పాను. ఇప్పుడు జనాభా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లలు తగ్గిపోవడంతో వృద్ధులు పెరుగుతున్నారు. కొన్ని దేశాలు ముసలిదేశాలుగా మారాయి. రాష్ట్రం ఆ పరిస్థితికి రాకుండా ఉండేందుకు జనాభా పెంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఎన్టీఆర్ వైద్యసేవ పథకాన్ని సరికొత్త విధానంగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.