Share News

రాఘవరాయడికి స్వర్ణ కవచ సమర్పణ సేవ

ABN , Publish Date - Nov 24 , 2024 | 12:08 AM

రాఘవ్రేంద స్వామి మూల బృందావనానికి బంగారు కవచం సమర్పణ సేవ వేద పండితుల మంత్రోచ్ఛరణాలు, మంగళవాయిద్యాల మధ్య రమణీయంగా సాగింది.

రాఘవరాయడికి స్వర్ణ కవచ సమర్పణ సేవ
రజిత గజవాహనం పై ఊరేగుతున్న ప్రహ్లాదరాయలు

మంత్రాలయం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాఘవ్రేంద స్వామి మూల బృందావనానికి బంగారు కవచం సమర్పణ సేవ వేద పండితుల మంత్రోచ్ఛరణాలు, మంగళవాయిద్యాల మధ్య రమణీయంగా సాగింది. శనివారం అష్టమి శుభదినాన్ని పురస్కరించుకొని మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల ఆశీస్సులతో మఠం పండితులు, అర్చకులు బృందావనానికి ప్రత్యేక పూజలు, విశేష పంచామృతాభిషేకం నిర్వహించారు. బంగారు, వెండి, పట్టు వస్ర్తాలు, బెంగుళూరు నుంచి తెచ్చిన ప్రత్యేక పుష్పాలు, బంగారు కవచంతో చూడముచ్చటగా బృందావనాన్ని అలంకరించారు. మహామంగళహారతులు ఇచ్చారు.

రజిత గజవాహనంపై ప్రహ్లాదరాయల ఊరేగింపు

రాఘవేంద్ర స్వామి మఠంలో వెండి గజవాహనంపై ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు భక్తులకు దర్శనం ఇచ్చారు. శనివారం మఠం పండితులు రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి, మంచాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణాలు, మంగళవాయిద్యాల మధ్య వెండి గజవాహనంపై స్వర్ణ అంబారిలో వజ్రాలు పొదిగిన ప్రహ్లాదరాయలను అధిష్టించి పీఠాధిపతి మహామంగళహారతితో ఊరేగింపు సాగింది.

ఫ రాఘవేంద్రస్వామి మఠానికి హైదరాబాదుకు చెందిన రాఘవేంద్ర చిలకలడోణ అనేభక్తుడు రూ.1.22లక్షలు సంపూర్ణ సేవకు విరాళంగా ఇచ్చినట్లు మఠం ఏఏఓ మాధవశెట్టి, మేనేజరు వెంకటేష్‌ జోషి తెలిపారు. శనివారం కుటుంబ సమేతంగా ఆయన రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. దాత కుటుంబానికి శ్రీమఠం పండితులు రాఘవేంద్ర స్వామి మెమెంటో, శేషవస్త్రం ఇచ్చి ఆశీర్వదించారు. కార్యక్రమంలో శ్రీపతి ఆచార్‌, నరసింహ దేశాయ్‌, శ్రీపాద ఆచార్‌లు పాల్గొన్నారు.

ఫ మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం పూర్వ పీఠాధిపతి కర్ణాటకలోని హంపిలో వెలిసిన రఘునందన తీర్థుల ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. శనివారం మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు తన శిష్య బృందంతో కలిసి వెళ్లి రఘునంధనతీర్థుల బృందావనానికి ప్రత్యేక పూజలు, హారతులు ఇచ్చారు.

Updated Date - Nov 24 , 2024 | 12:08 AM