రహదారి భద్రత, ఆడిట్‌పై మరిన్ని చర్యలు తీసుకోండి
ABN , Publish Date - Mar 16 , 2024 | 02:13 AM
రహదారి భద్రతపై మరిన్ని పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రహదారి భద్రత ఆడిట్‌పై సుప్రీంకోర్టు నియమించిన రహదారి భద్రత కమిటీ చైర్మన్ జస్టిస్ అభయ్ మనోహర్ సాప్రే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.
రాష్ట్రానికి రహదారి భద్రత కమిటీ చైర్మన్ ఆదేశం
అమరావతి, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): రహదారి భద్రతపై మరిన్ని పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రహదారి భద్రత ఆడిట్‌పై సుప్రీంకోర్టు నియమించిన రహదారి భద్రత కమిటీ చైర్మన్ జస్టిస్ అభయ్ మనోహర్ సాప్రే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. శుక్రవారం ఆయన ఢిల్లీ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి సహా సంబంధిత శాఖల అధికారులతో రహదారి భద్రత ఆడిట్ అంశాలపై వీడియో సమావేశం నిర్వహించారు. జస్టిస్ మనోహర్ సాప్రే మాట్లాడుతూ.. రాష్ట్ర, జిల్లా స్థాయిలో రహదారి భద్రతకు సంబంధించిన కమిటీ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు. ముఖ్యంగా జాతీయ, రాష్ట్ర ఇతర ప్రధాన రహదారులపై బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని జస్టిస్ ఎఎం సాప్రే రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఆదేశించారు. అదే విధంగా రోడ్డు ప్రమాదాల నివారణ, రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించే చర్యలు తీసుకోవాలని సూచించారు. రహదారి భద్రతకు సంబంధించిన పాలసీని జారీచేసి పటిష్టంగా అమలు చేయాలని స్పష్టంచేశారు. రాష్ట్రంలో రహదారి భధ్రతకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల రహదారి భద్రత కమిటీ చైర్మన్ జస్టిస్ అభయ్ మనోహర్ సాప్రే సంతృప్తి వ్యక్తంచేశారు. ఎన్నికల అనంతరం రహదారి భద్రతా చర్యల పరిశీలనకు ఏపీలో స్వయంగా పర్యటించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రహదారి భద్రతపై ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని వివరించారు. రాష్ట్రంలో నాన్‌లేప్సబుల్ విధానంలో రూ.50 కోట్లతో రహదారి భద్రతా నిధిని ఏర్పాటు చేస్తూ శుక్రవారం జీవో ఇచ్చామన్నారు.