Share News

TCS : టీసీఎస్‌ వచ్చేస్తోంది

ABN , Publish Date - Dec 01 , 2024 | 02:38 AM

దిగ్గజ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) విశాఖపట్నంలో కార్యకలాపాల ప్రారంభానికి మార్గం సుగమమైంది. రుషికొండ ఐటీ పార్కు హిల్‌-2పై నాన్‌ సెజ్‌

TCS  : టీసీఎస్‌ వచ్చేస్తోంది

విశాఖలో దిగ్గజ ఐటీ కంపెనీకి లైన్‌క్లియర్‌.. లీజుకు ‘డల్లాస్‌ టెక్నాలజీస్‌’ బిల్డింగ్‌

రుషికొండ ఐటీ పార్కు హిల్‌-2పై కార్యాలయం

లీజు ఒప్పందానికి ప్రభుత్వం పచ్చజెండా

మరింత అదనపు స్థలం కేటాయింపునకూ ఓకే

అన్ని శాఖలూ సహకరించాలని ఆదేశం

తొలి దశలో 2 వేల మందికి ఉద్యోగాలు

విశాఖపట్నం, అమరావతి, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): దిగ్గజ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) విశాఖపట్నంలో కార్యకలాపాల ప్రారంభానికి మార్గం సుగమమైంది. రుషికొండ ఐటీ పార్కు హిల్‌-2పై నాన్‌ సెజ్‌ ఏరియాలోని ‘డల్లాస్‌ టెక్నాలజీస్‌’ భవనాన్ని లీజుకు తీసుకొని అందులో కార్యాలయం నడపడానికి టీసీఎస్‌ ముందుకువచ్చింది. లీజు ఒప్పందానికి ఆమోదం తెలుపుతూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో టీసీఎస్‌ తొలి దశలో రెండు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. ఆ తరువాత మరింత విస్తరిస్తుంది. విశాఖపట్నం ఐటీ కేంద్రంగా అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ యాంకర్‌(పెద్ద) కంపెనీలు లేకపోవడం లోటుగా ఉండేది. దీనిపై ప్రత్యేకంగా దృష్టిసారించి, టాప్‌ -10 కంపెనీలు వచ్చేలా చేస్తామని ఐటీ మంత్రి నారా లోకేశ్‌ గతంలో ప్రకటించారు. ఆ మేరకు టీసీఎస్‌ ప్రతినిధులను విశాఖకు ఆహ్వానించారు. నగరంలోని ఐటీ పార్కుల్లో భవనాలు, భూములు చూసుకోవాలని, ఏమి కావాలంటే అవి సమకూరుస్తామని హామీ ఇచ్చారు. అయితే తమకు తొలుత భవనమే కావాలని, అది కూడా సెజ్‌ పరిధిలో ఉండకూడదని టీసీఎస్‌ ప్రతినిధులు స్పష్టంచేశారు. రుషికొండలో హిల్‌-2పై డీనోటిఫై చేసిన ప్రాంతంలోని డల్లాస్‌ టెక్నాలజీ ఎల్‌ఎల్‌పీ నూతనంగా నిర్మించిన భవనాన్ని ఎంపిక చేసుకున్నారు. ఇది ఇన్ఫోసిస్‌ పక్కనే ఉండడం గమనార్హం.

టీసీఎ్‌సను ఆకర్షించిన ‘డల్లాస్‌’

డల్లాస్‌ టెక్నాలజీస్‌ కంపెనీకి ఏపీఐఐసీ 2016లో హిల్‌-2పై 7,774.90 చ.మీ. భూమిని కేటాయించింది. అందులో రెండేళ్ల క్రితం ఆ కంపెనీ భవన నిర్మాణం ప్రారంభించింది. గ్రౌండ్‌+3 అంతస్థుల భవనం నిర్మించింది. త్వరలో కార్యకలాపాలు ప్రారంభించాలని యోచిస్తోంది. అందులో 1,400 మంది వరకు పనిచేసుకోవచ్చు. ఈ నెల మొదటి వారంలో విశాఖకు వచ్చిన టీసీఎస్‌ బృందాన్ని ‘డల్లాస్‌’ భవనం ఆకర్షించింది. వారితో చర్చలు జరిపారు. లీజుకు ఇవ్వాలని అడిగారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే లీజుకు ఇవ్వడానికి డల్లాస్‌ యాజమాన్యం అంగీకరించింది. అయితే డల్లాస్‌ భవనంలో సీటింగ్‌ సామర్థ్యం రెండు వేల మందికి సరిపడా విస్తరించాలని టీసీఎస్‌ కోరింది. పక్కనే ఖాళీగా ఉన్న భూమిని ప్రభుత్వం కేటాయిస్తే అక్కడ కూడా నిర్మాణం చేపట్టి పూర్తిస్థాయిలో ఇస్తామని డల్లాస్‌ తెలిపింది. ఇదే విషయాన్ని డల్లాస్‌ ప్రతినిధులు ప్రభుత్వానికి కూడా తెలియజేశారు. పక్కనే 1,909 చ.మీ. స్థలం ఉందని, అందులో 1,600 చ.మీ. కావాలని, గతంలో చ.మీ. రూ.6,720 చొప్పున కేటాయించారని, అదే ధరకు ఇవ్వాలని కోరారు. భవనం వెనుక సెట్‌బ్యాక్స్‌ విషయంలో కొంత మినహాయింపు ఇవ్వాలని అభ్యర్థించారు.

ఎస్‌ఐపీబీలో కీలక నిర్ణయం

డల్లాస్‌ ప్రతిపాదనలపై ఈనెల 19న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా టీసీఎ్‌సకు భవనాన్ని లీజుకు ఇవ్వడానికి డల్లా్‌సకు అనుమతి మంజూరుచేశారు. నిబంధనల ప్రకారం ఉపాధి కల్పించాలని, పదేళ్లపాటు అది కొనసాగాలని టీసీఎ్‌సకు స్పష్టంచేశారు. సెట్‌ బ్యాక్స్‌ ప్రయోజనాల కోసం కోరిన స్థలాన్ని మంజూరు చేయాలని దానికి చ.మీ.కు రూ.10 వేలు చొప్పున వసూలు చేయాలని ఏపీఐఐసీకి సూచించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ తక్షణమే భవనాన్ని పరిశీలించి, నిబంధనల ప్రకారం కార్యకలాపాలు ప్రారంభించుకోవడానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ జారీచేయాలని ఆదేశించారు. విశాఖపట్నానికి వస్తున్న తొలి మెగా ఐటీ కంపెనీ కాబట్టి, అది త్వరగా ప్రారంభం కావడానికి అవసరమైన అన్నిరకాల పనులు పూర్తిచేసుకోవడానికి ప్రభుత్వ శాఖలన్నీ సహకరించాలని పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్‌ ఆయా శాఖలకు ఉత్తర్వులు జారీచేశారు. సింగిల్‌ డెస్క్‌ పోర్టల్‌ 2.0 ద్వారా అనుమతులు ఇవ్వాలని సూచించారు.

Updated Date - Dec 01 , 2024 | 02:38 AM