ఆరోగ్యశ్రీలో వైసీపీ ఉద్యోగుల సిండికేట్
ABN , Publish Date - Nov 21 , 2024 | 03:56 AM
గతంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌లో వైసీపీ నేతల అండతో నియమితులైన కొందరు ఉద్యోగులు సిండికేట్‌గా ఏర్పడి, ఆసుపత్రుల్లో లాబీయింగ్ చేసి, పెద్ద మొత్తంలో డబ్బులు దండుకుంటున్నారని టీడీపీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు వచ్చింది.
ఆస్పత్రుల నుంచి డబ్బులు దండుకుంటున్నారు
కరోనా బిల్లులు ఇవ్వలేదు: టీడీపీ గ్రీవెన్స్‌లో బాధితులు
అమరావతి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): గతంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌లో వైసీపీ నేతల అండతో నియమితులైన కొందరు ఉద్యోగులు సిండికేట్‌గా ఏర్పడి, ఆసుపత్రుల్లో లాబీయింగ్ చేసి, పెద్ద మొత్తంలో డబ్బులు దండుకుంటున్నారని టీడీపీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు వచ్చింది. ప్రస్తుత ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద కొనసాగుతున్న ఆ ఉద్యోగులు కూటమి ప్రభుత్వ మద్దతుదారులను అవమానిస్తూ, వేధింపులకు గురిచేస్తున్నారని కట్టెపోగు వెంకయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్య నారాయణ, లిడ్‌క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఉద్యోగులపై విచారణ జరిపి, చర్యలు తీసుకుంటామని టీడీపీ నేతలు చెప్పారు. కాగా తన భూమిని ఏసీబీ డీఎస్పీ మహబూబ్ బాషా ఆక్రమించుకోవడంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా చర్య తీసుకోలేదని, న్యాయం చేయాలని కర్నూలు జిల్లా కాల్వ గ్రామానికి చెందిన కె.శ్రీనివాసులు కోరారు. కరోనా సమయంలో క్వారంటైన్ సెంటర్లలోని పేషంట్లకు సరఫరా చేసిన వస్తువులకు బిల్లులు ఇవ్వకుండా నాలుగేళ్లుగా తిప్పుతున్నారని భీమవరానికి చెందిన ఆచంట భగవన్నారాయణ ఫిర్యాదు చేశారు. సూక్ష్మసేద్య పరికరాల రాయితీని పునరుద్ధరించాలని అనంతపురం జిల్లా కల్యాణదుర్గానికి చెందిన శివశంకర్ కోరారు.