Share News

AP News: కోర్టులో ఫైల్స్ దొంగతనాలు చేశాడు ఓ మంత్రి: టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి

ABN , Publish Date - Jul 26 , 2024 | 12:16 PM

టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. గత ప్రభుత్వ మంత్రులు, ఎమ్మెల్యేల భూ దందాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని అన్నారు.

AP News: కోర్టులో ఫైల్స్ దొంగతనాలు చేశాడు ఓ మంత్రి: టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి
Somireddy Chandrasekhar Reddy

అమరావతి: టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. గత ప్రభుత్వ మంత్రులు, ఎమ్మెల్యేల భూ దందాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని అన్నారు. మదనపల్లిలో ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా స్వయంగా ఫిర్యాదులు స్వీకరించారని, అక్రమాలు బయటపడతాయని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం చేశారని అన్నారు.


మదనపల్లిలో ఫైల్స్ దగ్దం ఘటనలో గత ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు తేలిందని, పెద్దారెడ్డి...పెద్దిరెడ్డి ముఠా పేదల భూములు కొట్టేశారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. సిగ్గులేకుండా జగన్ ఢిల్లీలో ధర్నా చేశారని, జగన్ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ‘‘కోర్టులో ఫైల్స్ దొంగతనాలు చేశాడు ఓ మంత్రి. ఇంకో మంత్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో పత్రాలు తగలబెట్టారు. ఫైల్స్ దగ్ధం ఘటనతో మిథున్ రెడ్డి మాకు సంబంధం లేదు అన్నారు. మరి ఎవరికి సంబంధం ఉందో చెప్పాలి’’ అని సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.


మొన్నటిదాకా తమరే అధికారంలో ఉన్నారని, బీజేపీలో చేరాలని ప్రయత్నం చేశారని, ప్రయత్నం బెడిసికొట్టిందని సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. అధికారం కోసం తప్పుడు పనుల నుంచి తప్పించుకోవడానికి వైసీపీ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని విమర్శించారు. చేసిన పాపాలకు శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు. ప్రజలు ఇటువంటి దుర్మార్గుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అసెంబ్లీ ఎగ్గొట్టేందుకు ఢిల్లీ పారిపోయారని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు.


శ్వేత పత్రాలపై మాట్లాడే దమ్ము, ధైర్యం వైసీపీ ఎమ్మెల్యేలకు లేదన్నారు. ‘11 మంది ఉంటే ఏమైంది. ఒక్కరు చాలరా నిజాయితీగా మాట్లాడడానికి’ అని సోమి రెడ్డి అన్నారు.


పుంగనూరు భూదందా రాష్ట్రంలో అక్రమాలకు అద్దం: దేవినేని ఉమామహేశ్వరరావు

పుంగనూరు భూదందా రాష్ట్రంలో అక్రమాలకు అద్దం పడుతోందని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. వైసీపీ ‘పెద్ద’ భూ బాధితులతో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం కిక్కిరిసి పోతోందని, వేల ఎకరాల భూములు కొల్లగొట్టారని ఆరోపించారు. రిటైర్డ్ పోలీస్ అధికారి భూమినీ వదల్లేదని, ప్రశ్నించిన మహిళల తాళిబొట్లు తెంచి దాడులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Jul 26 , 2024 | 12:31 PM