Share News

MLA Palla Srinivasa Rao : టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా?

ABN , Publish Date - Jun 15 , 2024 | 06:43 AM

టీడీపీ రాష్ట్ర అధ్యక్ష మరోసారి ఉత్తరాంధ్ర బీసీ నేతకు దక్కే అవకాశం ఉందని టీడీపీలో ప్రచారం జరుగుతోంది. విశాఖ జిల్లా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్‌ వైపు ఆ పార్టీ అధిష్ఠానం మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. రాష్ట్ర విభజన అనంతరం ఈ పదవి

MLA Palla Srinivasa Rao : టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా?

మరోసారి ఉత్తరాంధ్ర బీసీలకు అవకాశం!

గాజువాక నుంచి 95 వేల ఓట్ల భారీ

మెజారిటీతో శ్రీనివాసరావు గెలుపు

ఇతర సమీకరణలతో మంత్రి పదవి

ఇవ్వలేకపోయిన చంద్రబాబు

పార్టీ పగ్గాలు కట్టబెడతారని తాజా ప్రచారం

అమరావతి, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): టీడీపీ రాష్ట్ర అధ్యక్ష మరోసారి ఉత్తరాంధ్ర బీసీ నేతకు దక్కే అవకాశం ఉందని టీడీపీలో ప్రచారం జరుగుతోంది. విశాఖ జిల్లా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్‌ వైపు ఆ పార్టీ అధిష్ఠానం మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. రాష్ట్ర విభజన అనంతరం ఈ పదవి మూడు దఫాలు ఈ ప్రాంత నేతలనే వరించింది. టీడీపీ జాతీయ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత చంద్రబాబు జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం.. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవులు సీనియర్‌ నేతలకు ఇవ్వడం రివాజుగా ఉంది. విభజన అనంతరం 2015 సెప్టెంబరులో ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడిగా సీనియర్‌ నేత కిమిడి కళావెంకట్రావును నియమించారు. తర్వాత ఆయన మంత్రివర్గంలో చేరినా దరిదాపుగా ఐదేళ్లపాటు ఆ పదవిలో కొనసాగారు. 2020 అక్టోబరులో అచ్చెన్నాయుడు రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఇప్పుడాయన చంద్రబాబు మంత్రివర్గంలో చేరారు. దీంతో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తారని పార్టీలో ప్రచారం సాగుతోంది. ఇటీవలి ఎన్నికల్లో గాజువాక టీడీపీ అభ్యర్థిగా ఆయన రాష్ట్రంలోనే అత్యధికంగా 95 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మంత్రివర్గంలో ఆయనకు చోటు ఖాయమని అందరూ భావించినా.. కొన్ని సమీకరణల కారణంగా చంద్రబాబు ఇవ్వలేకపోయారు. దీంతో ఆయనకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలు మెండుగా ఉన్నాయని టీడీపీ నేతలు పలువురు పేర్కొంటున్నారు.

Updated Date - Jun 15 , 2024 | 06:43 AM