Share News

హైరిస్క్‌ జోన్‌లో తెలుగు రాష్ట్రాలు

ABN , Publish Date - Sep 21 , 2024 | 04:25 AM

‘వాతావరణంలో మార్పుల ప్రభావం వల్లనే రెండు తెలుగు రాష్ట్రాలు వరదలు, కరువు వంటి విపత్తులు ఎదుర్కొంటున్నాయి.

హైరిస్క్‌ జోన్‌లో తెలుగు రాష్ట్రాలు

అసోం తర్వాతి స్థానంలో ఏపీ, తెలంగాణ

ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి, కృష్ణా,

గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలపై ఎక్కువ ప్రభావం

వాతావరణంలో మార్పులతోనే వరదలు, కరువు వంటి విపత్తులు

జిల్లాలవారీగా విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు అవసరం

భారత వాతావరణ శాఖ విశ్రాంత డీజీ కేజే రమేష్‌

విశాఖపట్నం, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): ‘వాతావరణంలో మార్పుల ప్రభావం వల్లనే రెండు తెలుగు రాష్ట్రాలు వరదలు, కరువు వంటి విపత్తులు ఎదుర్కొంటున్నాయి. అసాధారణ వాతావరణ పరిస్థితులతో దేశంలో అనేక రాష్ట్రాలు ఇదే తరహా ప్రమాదంలో ఉన్నాయి’ అని భారత వాతావరణ శాఖ విశ్రాంత డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ కేజే రమేష్‌ పేర్కొన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వాతావరణ, సముద్ర అధ్యయన విభాగం 75వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మూడో రోజు శుక్రవారం ఆయన దేశంలో వాతావరణ పరిస్థితులపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ‘విపత్తుల విలయాలకు సంబంధించి హై రిస్క్‌ జోన్‌లో ఉన్న రాష్ట్రాల్లో అసోం మొదటి స్థానంలో ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలు రెండో స్థానంలో ఉన్నాయి. మూడో స్థానంలో మహారాష్ట్ర, నాలుగో స్థానంలో కర్ణాటక, ఐదో స్థానంలో బిహార్‌ ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలను పరిశీలిస్తే... భారీ వర్షాలు కురిసే రోజుల సంఖ్య ఏపీలో ఉమ్మడి అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పెరుగుతుంది. ఉమ్మడి విశాఖపట్నం, కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాల్లో తగ్గుతుంది. వరదలు/కరువు/తుఫాన్లతో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు,

ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలు ఎక్కువ ప్రభావితమవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాల కురిసే రోజుల సంఖ్య 38 నుంచి 43 వరకు ఉండగా... రాయలసీమలో 21నుంచి 25 రోజులు వరకు నమోదవుతోంది. వాతావరణ మార్పులతో 2000 నుంచి ఈ విపత్తుల తీవ్రత పెరుగుతూ వస్తోంది. తెలంగాణలో ఉత్తర, తూర్పు ప్రాంతంలో వర్షపాతం పెరుగుతుంది. తూర్పు తెలంగాణలోని వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో వర్షపాతం పెరగడంతో దిగువన ఉన్న విజయవాడ, కృష్ణా, ఏలూరు ప్రాంతాలకు వరద పోటు ప్రమాదం ఉంది. భవిష్యత్తులో విపత్తుల తీవ్రత మరింత ఎక్కువ అవుతుంది. ఏపీలో 1,900, తెలంగాణలో 950 రెయిన్‌గేజ్‌ స్టేషన్లు ఉన్నాయి. 2016నుంచి వర్షపాతం వివరాలు ప్రభుత్వం, వాతావరణ శాఖ వద్ద ఉన్నాయి. ఆ సమాచారాన్ని విశ్లేషించుకుని రెండు తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమై విపత్తులు ఎదుర్కొనేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలి. విపత్తుల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. వాతావరణశాఖ, ఏయూ వాతావరణ విభాగం ప్రతినిధులు జిల్లాల వారీగా పర్యటించి అధికారులతో సమావేశమై విపత్తులను ఎదుర్కొనేందుకు సన్నద్ధం చేయాలి. ప్రజలకు సమాచారం అందేలా ప్రచారం చేయాలి. నగరాలు, పట్టణాల్లో విపత్తుల సన్నద్ధతకు ప్రణాళికలు అమలు చేయాలి’ అని రమేష్‌ వివరించారు.

Updated Date - Sep 21 , 2024 | 04:25 AM