Share News

రెచ్చిపోయిన వైసీపీ రౌడీ మూక

ABN , Publish Date - Apr 16 , 2024 | 02:54 AM

వారసలే రౌడీలు. పైగా అధికార పార్టీలో తిరుగుతున్నారు. రౌడీయిజానికి అధికారం తోడవ్వడంతో వారి ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. తాగడం, రోడ్డుపై వెళ్లేవారిని ఆపి తిట్టడం, కొట్టడం, వారి వద్ద ఉన్న వస్తువులు లాక్కోవడం చేస్తూ.. దారి దోపిడీ ముఠాగా తయారయ్యారు. వీరంతా కలిసి ఆదివారం రాత్రి

రెచ్చిపోయిన వైసీపీ రౌడీ మూక

కారులో వెళ్తున్న టీడీపీ నేత కుటుంబంపై దాడి

చొక్కా చింపేసి, టీడీపీ లోగో పీకేసి,

బంగారం గుంజుకుని దోపిడీ

టీడీపీ బీసీ సెల్‌ నేత, అతడి భార్య, సోదరికి గాయాలు

తాగేసి.. దారి దోపిడీలకు పాల్పడుతున్న మూక

అధికార పార్టీలో తిరుగుతూ ఎదురే లేదన్న ధీమా

ఆ ముఠాను శిక్షించాలని స్థానికుల డిమాండ్‌

గుంటూరు, ఏప్రిల్‌ 15: వారసలే రౌడీలు. పైగా అధికార పార్టీలో తిరుగుతున్నారు. రౌడీయిజానికి అధికారం తోడవ్వడంతో వారి ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. తాగడం, రోడ్డుపై వెళ్లేవారిని ఆపి తిట్టడం, కొట్టడం, వారి వద్ద ఉన్న వస్తువులు లాక్కోవడం చేస్తూ.. దారి దోపిడీ ముఠాగా తయారయ్యారు. వీరంతా కలిసి ఆదివారం రాత్రి బాగా తాగేసి.. కారులో వెళుతున్న ఓ కుటుంబం పట్ల అత్యంత కర్కశంగా వ్యవహరించారు. ఈ ఘటనలో మాజీ సైనిక ఉద్యోగి, ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ బీసీ సెల్‌ కన్వీనర్‌ కల్వకూరి వెంకట్రావు, ఆయన భార్య శ్రీలత, ఆయన సోదరి నాగమల్లేశ్వరి గాయపడగా, అతడి తల్లి, కుమార్తె స్వల్పంగా గాయపడ్డారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని ఉప్పలపాడులో ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పెదనందిపాడు మండలం నాగులపాడు ఉపసర్పంచి, మాజీ సైనికుడు కల్వకూరి వెంకట్రావు కొంతకాలంగా బాపట్లలో ఉంటున్నారు. ఆయన ఆదివారం రాత్రి భార్య శ్రీలత, అక్క నాగమల్లేశ్వరి, కుమార్తె, తల్లితో కలిసి కారులో నాగులపాడు వెళ్తున్నారు. రాత్రి సుమారు 9.30 గంటలకు వీరు ప్రయాణిస్తున్న కారు గొట్టిపాడు దాటేసరికి మద్యం మత్తులో బైక్‌పై వస్తున్న యువకుడు రోడ్డుకు అడ్డంగా వాహనాన్ని ఆపాడు. వెంకట్రావు కారు ఆపగా.. ఆ యువకుడు నడిరోడ్డుపై బైక్‌ స్టాండ్‌ వేసి వెంకట్రావును బూతులు తిట్టడం ప్రారంభించాడు. అతడు మద్యం తాగి ఉండటంతో.. వాహనం పక్కకు తీస్తే వెళ్లిపోతానని వెంకట్రావు చెప్పారు. అయినా వినిపించుకోకుండా ‘ఈ రూట్‌లో ఎలా వెళ్తావో చూస్తా. ఉప్పలపాడు దాటి వెళ్లు.. నీ సంగతి తెలుస్తా’ అని హెచ్చరించి వెళ్లిపోయాడు. దీంతో వెంకట్రావు కారులో బయలుదేరి, మిట్టపాలెం చెక్‌ పోస్ట్‌ వద్ద కానిస్టేబుల్‌ సుబ్బారావుకు జరిగిన విషయం చెప్పారు. కానిస్టేబుల్‌ తన ఫోన్‌ నంబర్‌ వెంకటరావుకు ఇచ్చి.. మళ్లీ ఎవరైనా ఇబ్బంది పెడితే ఫోన్‌ చేయమని చెప్పారు. ఆ తర్వాత వెంకట్రావు ఉప్పలపాడు చర్చికి 50 మీటర్ల దూరంలో ఉండగా.. సుమారు పది మంది యువకులు రోడ్డుపై ద్విచక్ర వాహనాలను పార్కు చేసి, వెంకట్రావు కారు కోసం ఎదురుచూస్తున్నారు. తనపై దాడి చేయడానికి వారు సిద్థంగా ఉన్నారని గ్రహించిన వెంకట్రావు.. కారును ఆపి కానిస్టేబుల్‌ సుబ్బారావుకు ఫోన్‌ చేశారు. అప్పటికే కారును గమనించిన ఆ అల్లరి మూకలు.. కారును చుట్టుముట్టి బీభత్సం సృష్టించారు. కారులో ఉన్న వెంకట్రావుపై దాడి చేశారు. దాడికి దిగిన వారంతా వైసీపీలో చురుగ్గా తిరిగేవారు కావడం.. వెంకట్రావు కారు పసుపు రంగులో ఉండటం, కారు బానెట్‌పై టీడీపీ కండువా ఉండడంతో దుండగులు మరింతగా రెచ్చిపోయారు. అతడి ఫోన్‌ మీద ఉన్న చంద్రబాబు లోగోను పీకేసి, వెంకట్రావు విచక్షణారహితంగా కొడుతుండటంతో. అడ్డుకునేందుకు వెళ్లిన అతడి భార్య, సోదరిపై దాడి చేశారు. సుమారు అర గంటకుపైగా బీభత్సం సృష్టించారు. ఈలోగా కానిస్టేబుల్‌ సుబ్బారావు ఘటనా స్థలానికి చేరుకోగా, అప్పటికే వారిలో కొందరు వెళ్లిపోగా, మిగిలినవారు కానిస్టేబుల్‌ను సైతం లెక్కచేయకుండా దాడి కొనసాగించారు. వెంకట్రావు మెడలో ఉన్న బంగారం గొలుసు, లాకెట్‌ను తెంచుకున్నారు. దీంతో కానిస్టేబుల్‌ వారిని తీవ్రంగా హెచ్చరిసూ..్త తెలిసిన వారిని పిలవడంతో వారు వెనక్కి తగ్గారు. విషయం తెలుసుకున్న పలువురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఆ యువకులు కాలనీ వదిలి పరారయ్యారు. గాయపడిన వెంకట్రావు, ఆయన భార్య శ్రీలత, అక్క నాగమల్లేశ్వరిని బాపట్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వెంకట్రావు ఫిర్యాదు మేరకు పెదనందిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసుల అదుపులో నిందితులు: దాడికి పాల్పడిన నిందితులను ఉప్పలపాడుకు చెందిన మనోజ్‌, అఖిల్‌ అలియాస్‌ నాని, రోహిత్‌, విల్సన్‌, చందు, లూదర్‌పాల్‌గా గుర్తించారు. వారందరినీ సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఆ యువకుల గురించి స్థానికులను పోలీసులు ఆరా తీయగా.. వారంతా ప్రతిరోజూ మద్యం తాగి.. బైకులపై విన్యాసాలు చేస్తూ, రౌడీయిజం చేస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు తెలిసింది.

Updated Date - Apr 16 , 2024 | 02:54 AM