Share News

YSRCP: మరో జగన్‌ దెబ్బ

ABN , Publish Date - Nov 05 , 2024 | 05:08 AM

జగన్‌ను ఎన్నికల్లో ప్రజలు వదిలించుకున్నారు. కానీ, ఐదేళ్ల పాలనా పాపాల బాదుడును మాత్రం ఇప్పటికీ వదిలించుకోలేకపోతున్నారు.

YSRCP: మరో జగన్‌ దెబ్బ

  • రూ.11,826 కోట్లు ప్రతిపాదించిన డిస్కమ్‌లు

  • ఇది ఎన్నికల నోటిఫికేషన్‌ ముందటి పిటిషన్‌

  • 2023-24కు గాను వైసీపీ సర్కారులో సమర్పణ

  • నాడు పరిష్కరించని ఈఆర్‌సీ.. 90 రోజుల రూల్‌కూ బ్రేక్‌

  • దీంతో కూటమి సర్కారుకు శాపంగా జగన్‌ పాపం

  • ఆ పిటిషన్‌ను తాజాగా తెరపైకి తెచ్చిన డిస్కమ్‌లు

  • 19 లోపు అభ్యంతరాలు తెలపాలంటూ ప్రకటన

  • ఆ వెంటనే ప్రజాభిప్రాయ సేకరణకు ఈఆర్‌సీ సిద్ధం!

  • వారంక్రితమే జనంపై 6,072 కోట్ల ట్రూఅప్‌ భారం

(అమరావతి - ఆంధ్రజ్యోతి): జగన్‌ను ఎన్నికల్లో ప్రజలు వదిలించుకున్నారు. కానీ, ఐదేళ్ల పాలనా పాపాల బాదుడును మాత్రం ఇప్పటికీ వదిలించుకోలేకపోతున్నారు. గత ప్రభుత్వ శాపాలు ఇంకా విద్యుత్తు చార్జీల రూపంలో ప్రజలను పట్టి పీడిస్తూనే ఉన్నాయి. 2022-23 ఇంధన సర్దుబాటు భారం రూ.8,114 కోట్లకుగాను రూ.6,072 కోట్లకు రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి ఆమోదించింది. ఈ భారం ఈ నెల నుంచే ట్రూఅప్‌ కింద జనం భరించడం మొదలైంది. ఇది చాలదన్నట్టు.. వైసీపీ పాలన నాటి మరో పీడ కత్తిలా వేలాడుతోంది. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే, 2023-24 సంవత్సరానికిగాను డిస్కమ్‌లు రూ.11,826.47 కోట్ల ఇంధన సర్దుబాటు ప్రతిపాదనలు చేశాయి. వీటిపై శుక్రవారం ఈఆర్‌సీ స్పందించింది. ఈ ప్రతిపాదనలపై ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల 19 లోగా లిఖిత పూర్వకంగాను, మెయిల్‌ ద్వారాను స్పందించాలని ఈఆర్‌సీతో పాటు డిస్కమ్‌లు కోరాయి. అయితే, ఈఆర్‌సీ తీరుపై వినియోగదారుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే దాదాపు రూ.6,072 కోట్లు,రూ.11,826.47 కోట్లు..మొత్తం రూ.17898.47 కోట్ల ట్రూఅప్‌ భారంపై నిర్ణయాన్ని తీసుకునేందుకు ఈఆర్‌సీ సిద్ధం కావడంపై ప్రజా సంఘాలు నిరసనలకు సిద్ధమవుతున్నాయి.

కేంద్ర నిబంధనలకు విరుద్ధంగా...

విద్యుత్తు పంపిణీ సంస్థలకు విద్యుత్తు ఉత్పత్తి వ్యయాలు .. కొనుగోలు చార్జీలు భారంగా మారకూడదని .. ట్రూఅప్‌, ట్రూడౌన్‌ చార్జీల విధానాన్ని కేంద్ర విద్యుత్తు నియంత్రణ మండలి (సీఈఆర్‌సీ) తీసుకువచ్చింది. డిస్కమ్‌లు ప్రతిపాదించే ట్రూఅప్‌ లేదా ట్రూడౌన్‌ చార్జీల ప్రతిపాదనలను పెండింగ్‌లో పెట్టొద్దని రాష్ట్రాల విద్యుత్తు నియంత్రణ మండలి (ఎస్‌ఈఆర్‌సీ)లకు స్పష్టంగానే పేర్కొంది. దానివల్ల వినియోగదారులపై మోయలేని భారం పడుతుందని హెచ్చరించింది. ఇలాం టి ప్రతిపాదనలపై 90 రోజుల్లోగా ఆదేశాలివ్వాలని మార్దదర్శకాలను విడుదల చేసింది. అయితే.. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వం .. విద్యుత్‌ రంగాన్ని దెబ్బతీసే నిర్ణయాలెన్నో తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలోని విద్యుత్తు కొనుగోళ్లపైనా సమీక్షించింది. 2014-15లోనూ .. 2015-16లోనూ విద్యుత్తు కొనుగోలు భారం పెద్దగా లేకపోవడంతో .. ట్రూఅప్‌ ప్రతిపాదనలను ఏపీఈఆర్‌సీకి డిస్కమ్‌లు పంపలేదు. 2016-17లో రూ.3,058 కోట్లకు ఇంధన సర్దుబాటు ప్రతిపాదనలు పంపితే ఈఆర్‌సీ కేవలం రూ225 కోట్లకు ఆమోదించింది. 2017-18కు రూ434 కోట్లకు ప్రతిపాదనలు పంపితే, రూ.599 కోట్లకు ఈఆర్‌సీ ఆమోదించింది. 2018-19కి రూ.1,538 కోట్లకు ట్రూఅప్‌ ప్రతిపాదనలు పంపితే.. రూ.9,40 కోట్లకు ఈఆర్‌సీ ఆమోదించింది. 2019-20లో రూ.461.92 కోట్లకు ప్రతిపాదనలు పంపితే ..204.82 కోట్లకు ఈఆర్‌సీ ఆమోదించింది. 2019 మే నెలలో జగన్‌ నేతృత్వంలో వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చింది. అప్పటికి గడచిన ఐదేళ్లలో చేపట్టిన విద్యుత్‌ సంస్కరణ ప్రభావం కారణంగా .. ట్రూఅప్‌ భారం అంతంత మాత్రంగానే ఉంది. జగన్‌ వచ్చిన తొలి ఏడాదిలో 2020-21కుగాను రూ.1,685 కోట్ల ట్రూడౌన్‌ను డిస్కమ్‌లు ప్రతిపాదించాయి.


అప్పటినుంచి వరుసగా 2021-22లో రూ.980 కోట్లు, 2022-23లో 8,114 కోట్లు, 2023-24లో 11,826 కోట్లు ప్రతిపాదించాయి. జగన్‌ అధికారంలోకి వచ్చాక విచ్చలవిడితనం పెరిగిపోయిందనేందుకు ఇదే నిదర్శనమని విద్యుత్తురంగ నిపుణులు చెబుతున్నారు. 2021-22 దాకా డిస్కమ్‌లు చేసిన ప్రతిపాదనలపై సకాలంలో నిర్ఱయాలను తీసుకున్న రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి...2022-23 నుంచి ఇంధన సర్దుబాటు చార్జీల పేరిట విధించే ట్రూఅ్‌పలపై నిర్ణయం తీసుకోకుండా పక్కన పడేసింది. 2022-23 ఇంధన సర్దుబాటు ప్రతిపాదనలను సీఎంగా జగన్‌ ఆదేశాల మేరకు 2022 సెప్టెంబరులోనే డిస్కమ్‌లు సమర్పించినా .. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యేంతవరకూ నిర్ణయం తీసుకోలేదు. అదేవిధంగా 2023-24 సంవత్సరానికి రూ.11,826.42 కోట్లకు సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు ముందే ఈఆర్‌సీకి డిస్కమ్‌లు సర్దుబాటు ప్రతిపాదనలను సమర్పించాయి. 2022-23 ఇంధన సర్దుబాటు ప్రతిపాదనలపై నిర్ణయాన్ని ప్రకటించకుండానే .. విద్యుత్తు టారి్‌ఫను ఈఆర్‌సీ జారీ చేసింది.


గత నెల 29వ తేదీన ఈఆర్‌సీ చైర్మన్‌గా పదవీ విరమణ చేసే ముందురోజున .. అంటే .. అక్టోబరు 28వ తేదీన ఈఆర్‌సీ 2022-23 సర్దుబాటు ప్రతిపాదనలు రూ.8,114 కోట్లకు గాను రూ.6,072 కోట్లకు ఆమోదిస్తూ ఆదేశాలు ఇచ్చింది. 2023-24కు ప్రతిపాదించిన రూ.11,826.42 కోట్లకు మాత్రం నిర్ణయం తీసుకోలేదు. ఈఆర్‌సీ ఇన్‌చార్జి చైర్మన్‌ బాధ్యతలను సభ్యుడు ఠాకూర్‌ రామ్‌సింగ్‌ చేపట్టారు. ఈ నేపథ్యంలో శుక్రవారం 2023-24 ఇంధన సర్దుబాటు చార్జీలపై నిర్ణయాన్ని తీసుకునేందుకు సిద్ధమయ్యారు.

కొసమెరుపు: రాష్ట్ర ప్రజలపై ఈ నెల నుంచి రూ.6,200 కోట్ల భారాన్ని 15 నెలల పాటు వసూలు చేస్తారు. అందువల్ల 2023-24 సర్దుబాటు భారాన్ని ..15 నెలల తర్వాత నుంచి వసూలు చేస్తామని డిస్కమ్‌లు చెబుతున్నాయి. అంటే.. చార్జీల మోతను తట్టుకునేందుకు ఇప్పటినుంచి మానసికంగా సిద్ధపడాలని డిస్కమ్‌లు చెబుతున్నాయి.

Updated Date - Nov 05 , 2024 | 08:27 AM