‘ఫ్యాన్’ పార్టీలో ఉక్కపోత!
ABN , Publish Date - Jan 07 , 2024 | 04:25 AM
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఫ్యాన్ పార్టీలో ‘ఉక్కపోత’ తీవ్రమవుతోంది. వికెట్లు టపటపా పడుతున్నాయి. పార్టీలో ఎవరు ఉంటారో, ఎవరు పోతారో తెలియని విచిత్ర పరిస్థితి.
వలసలతో వైసీపీ విలవిల
రాష్ట్రమంతా అసమ్మతి సెగలు
డైలీ సీరియల్‌లా ‘వీడ్కోలు’
తాజాగా అంబటి ‘అవుట్’
ఇదేబాటలో నలుగురు ఎంపీలు!
సవాల్‌గా ఎంపీ సీట్ల ఎంపిక
మరోవైపు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
సమ్మెలతో సర్కారు ఉక్కిరిబిక్కిరి
డీలా పడుతున్న పార్టీ కేడర్
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఫ్యాన్ పార్టీలో ‘ఉక్కపోత’ తీవ్రమవుతోంది. వికెట్లు టపటపా పడుతున్నాయి. పార్టీలో ఎవరు ఉంటారో, ఎవరు పోతారో తెలియని విచిత్ర పరిస్థితి. పార్టీ వీడే కార్యక్రమం డైలీ సీరియల్‌లా కొనసాగుతోంది. ‘పార్టీ నుంచి ఈ రోజు ఎవరు వెళ్లిపోతారు’ అని రోజూ వైసీపీ నేతలు, కార్యకర్తలు భయపడే పరిస్థితి వచ్చింది. ఇన్‌చార్జ్‌ల బదిలీలు, సీట్ల వ్యవహారం వైసీపీలో గందరగోళంగా మారింది. పార్టీ పెద్దలు తీసుకుంటున్న నిర్ణయాలు ‘రివర్స్’ కొడుతున్నాయి. వీరవిధేయులుగా ఉన్నవారే తాడేపల్లి ప్యాలెస్ గేటు ముందు దండం పెట్టి పార్టీని వీడుతున్నారు. శాపనార్థాలు పెట్టి మరీ పోతున్నారు. పవన్ కల్యాణ్‌ను తిట్టించడం వల్ల కలిగిన నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు ఏరి కోరి తెచ్చుకున్న మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ‘టి-20 మ్యాచ్’ అంత సమయం కూడా పార్టీలో ఇమడలేపోయారు. వైసీపీలో చేరి పది రోజులు కూడా తిరక్కుండానే గుడ్ బై చెప్పారు. నమ్మినబంటు లాంటి కోటంరెడ్డి, ఇంట్లో మనిషిలా ఉండే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి, వీరవిధేయుడు కాపు రామచంద్రారెడ్డి.. ఇలా ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. దగ్గరి బంధువైన బాలినేని సైతం ఊగిసలాటలో ఉన్నారు. ‘ఇప్పటివరకూ ఎన్నికల్లో ఫ్యాన్ తిరగడం కష్టమనుకున్నాం. తాజా పరిణామాలు చూస్తుంటే భోగి మంటల్లోపలే ఫ్యాన్ బూడిదయ్యేలా ఉంది’.. అని అధికార పార్టీ నేతలు, శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జగన్.. తన అహంకార వైఖరి వల్ల పార్టీ సర్వనాశనం అయ్యేలా ఉందని అంటున్నారు.
క్రిస్‌మ్‌సతో మొదలై సంక్రాంతితో ముగింపు!
తనను ప్రశ్నించేవారే లేడని నాలుగున్నరేళ్లుగా నియంతలా వ్యవహరించిన జగన్‌కు క్రిస్‌మస్ సందర్భంగా ఇడుపులపాయలో సొంత నియోజకవర్గం కార్యకర్తల నుంచే సెగ మొదలైంది. రోజురోజుకూ రాష్ట్రమంతటా సెగ లు విస్తరిస్తున్నాయి. ఈపరిస్థితి చూస్తుంటే ఎ న్నికలకు ముందే సంక్రాంతి బోగి మంటల్లోనే ఫ్యాన్ రెక్కలు కాలడం ఖాయమని సొంత పార్టీ వారే చెబుతున్నారు. ఎన్నికల నాటికి ఏ మీ ఉండబోదని, ముందే ఓటమి ఖరారు అవుతుందని వైసీపీ బాధిత నేతలు అంటున్నారు.
సీట్ల ఎంపికలో గజిబిజి
మంత్రి గుమ్మనూరు జయరాంను కర్నూలు లోక్‌సభ స్థానానికి పంపుతామని పార్టీ పెద్దలు చెప్పారు. కానీ ఇప్పుడు దాటవేత ధోరణిని ప్రదర్శిస్తున్నారు. ఇంతకాలం జగన్ చెప్పిందే వేదంగా నమ్ముతూ వచ్చిన జయరాం.. ఇప్పుడు తనకు సీటు దక్కకపోతే వైసీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన సన్నిహితుల్లో ప్రచారం సాగుతోంది. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి మరోసారి పోటీకి వెనుకంజ వేస్తున్నారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. శ్రీకాకుళం లోక్‌సభ సీటు ఎవరికి దక్కుతుందో తెలియని పరిస్థితి. విజయనగరం లోక్‌సభ సభ్యుడు బెల్లాన చంద్రశేఖర్‌ను మార్చాలనుకుంటున్నా సరైన అభ్యర్థి దొరకడంలేదు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ విశాఖ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ నుంచి వైవీ సుబ్బారెడ్డిని బరిలోకి దింపాలన్న యోచనలో జగన్ ఉన్నా.. ఆయన ఒంగోలు కోరుకుంటున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అనకాపల్లి ఎంపీ సత్యవతి స్థానంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ పేరు పరిశీలనలో ఉన్నా అధిష్ఠానం పునరాలోచనలో పడిందని అంటున్నారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌ను రాజమండ్రి సిటీ అసెంబ్లీ స్థానానికి పంపడంతో అక్కడ కొత్తఅభ్యర్థి కోసం వెతుకులాట ప్రారంభమైంది. కాకినాడ ఎంపీ వంగాగీతను పిఠాపురం అసెంబ్లీ ఇన్‌చార్జిగా నియమించడంతో ఇక్కడా అదే పరిస్థితి. అమలాపురం ఎంపీ చింతా అనూరాధపై వ్యతిరేకత ఉండటంతో మారుస్తారని తెలుస్తోంది. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీఽధర్ పోటీకి ఉత్సాహం చూపడం లేదు. చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, తిరుపతి ఎంపీ గురుమూర్తి, కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డిని మార్చే అవకాశముంది.
సర్కారుపై ప్రజాగ్రహం
అభ్యర్థుల బదిలీలు, సీట్ల వ్యవహారంలో నాయకులను తాడేపల్లి ప్యాలె్‌సకు పిలిపించి అవమానిస్తున్న తీరు పార్టీకి భారీ నష్టం కలిగిస్తోంది. ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. తెలంగాణలో కేసీఆర్ ఓటమితో జగన్ వ్యవహారశైలిని పోలుస్తున్నారు. తెలంగాణలో అభివృద్ధి పనులు చేసినా అహంకారం వల్లే ఓడారని అంటున్నారు. ఇక్కడ అభివృద్ధి లేకపోగా నియంతృత్వం, అణచివేతలు, అవినీతి విచ్చలవిడిగా ఉందంటున్నారు. అక్కడ ఫామ్ హౌస్‌లో సీఎం... ఇక్కడ ప్యాలె్‌సలో ముఖ్యమంత్రి... అక్కడ నలుగురు కుటుంబ సభ్యులు.. ఇక్కడ నలుగురు రెడ్లు... ఇలా పోలికలు తెస్తున్నారు. జగన్ సర్కారుపై అన్ని వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. సమ్మెలతో రాష్ట్రం అట్టుడికిపోతోంది. ప్రజలపై భారీగా పన్నులు, చార్జీల భారం మోపారు. రాష్ట్రంలో అభివృద్ధి జాడ లేదు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉండటం, టీడీపీ-జనసేన బంధం బలోపేతం కావడం, మరోవైపు ‘జగనన్న బాణం’ ఆయనపైనే గురిపెట్టడంతో వైసీపీ సర్కారు ఉక్కిరిబిక్కిరవుతోంది.