AP Election 2024: ఆ 48 గంటలు కీలకం అప్రమత్తంగా ఉండండి
ABN , Publish Date - May 09 , 2024 | 03:41 AM
నాలుగో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరిగే ఈ నెల 13వ తేదీకి ముందు 48 గంటలు అత్యంత కీలకమైనవని,
హింసకు, నగదు పంపిణీకి అవకాశం లేకుండా చూడండి
సీఈసీ రాజీవ్ కుమార్ దిశానిర్దేశం
అమరావతి, మే 8(ఆంధ్రజ్యోతి): నాలుగో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరిగే ఈ నెల 13వ తేదీకి ముందు 48 గంటలు అత్యంత కీలకమైనవని, మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్(ఈసీ) రాజీవ్ కుమార్ ఆయా రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులకు దిశానిర్దేశం చేశారు. నాలుగో దశలో 14 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఈ దశలోనే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం నియమించిన కేంద్ర పరిశీలకులు, ప్రత్యేక పరిశీలకులు, ప్రధాన ఎన్నికల అధికారులతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు చేస్తున్న ఏర్పాట్లను రాజీవ్‌కుమార్ సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను ఎంతో సునిశితమైన రాష్ట్రాలుగా గుర్తించామన్నారు. ఈ రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణ విషయంలో యంత్రాంగం ఎంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నెల 13న పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో దీనికి ముందు 48 గంటలు ఎంతో కీలకమైనవని, రేయింబవళ్లు అప్రమత్తంగా ఉండాలని, హింసకు ఏ మాత్రం అవకాశం లేకుండా శాంతిభద్రతలను పరిరక్షించాలని ఆదేశించారు. ప్రత్యేకించి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు.
తాయిలాలపై నిఘా పెట్టాలి
ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే నగదు, ఇతర ఉచితాల పంపిణీపై గట్టి నిఘా ఉంచాలని రాజీవ్‌కుమార్ సూచించారు. ప్రత్యేకించి సాధారణ, పోలీసు, వ్యయ పరిశీలకులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చూడాలని సూచించారు. ప్రత్యేకించి ఏపీలో కొన్ని జిల్లాలు ఎంతో సునిశితమైనవిగా గుర్తించామని, ప్రత్యేక పరిశీలకులు ఆయా జిల్లాల్లో తరచుగా పర్యటించాలని ఆదేశించారు. ఎండలు, వడగాడ్పులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్రథమ చికిత్స సేవలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఓటు వేయడం సామాజిక బాధ్యత అనే విషయాన్ని ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని రాజీవ్‌కుమార్ దిశానిర్దేశం చేశారు. ఎస్‌ఎంఎ్‌సలు, సోషల్ మీడియా ద్వారా ఓటర్లను చైతన్య పరచాలన్నారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.