Share News

భూములు కబ్జా చేశారు!

ABN , Publish Date - Oct 22 , 2024 | 03:46 AM

వైసీపీకి చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, మాజీ ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచర వర్గం తమ భూములను కబ్జా చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు.

భూములు కబ్జా చేశారు!

తోపుదుర్తి, పిన్నెల్లి, అంజాద్‌ బాషా అనుచరులపై ఫిర్యాదుల వెల్లువ

తమకు న్యాయం చేయాలని బాధితుల వేడుకోలు

టీడీపీ కేంద్ర కార్యాలయంలో వినతుల స్వీకరణ

అమరావతి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): వైసీపీకి చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, మాజీ ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచర వర్గం తమ భూములను కబ్జా చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. సోమవారం ఇక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వినతుల కార్యక్రమంలో పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధ సారధి, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, అంగన్‌వాడీ వర్కర్ల రాష్ట్ర యూనియన్‌ అధ్యక్షురాలు ఆచంట సునీత, తెలుగు మహిళ రాష్ట్ర కార్యదర్శి అన్నాబత్తుని జయలక్ష్మి వినతులు స్వీకరించారు. అంజాద్‌ బాషా, అతని తమ్ముడు అహ్మద్‌ బాషా, ఇతర అనుచరులు తమ భూములకు దొంగ పత్రాలు సృష్టించి కబ్జా చేశారని, భూమి వద్దకు వెళ్తే దౌర్జన్యం చేస్తున్నారని కడపకు చెందిన వి.శోభారాణి ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి, అతని సోదరుడు చంద్రశేఖర రెడ్డి, వారి అనుచరులు కలిసి తన భూమిని ఆక్రమించి అమ్ముకొన్నారని టీడీపీ న్యాయ విభాగం రాష్ట్ర కార్యదర్శి పి.లక్ష్మన్న పిర్యాదు చేశారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డి కలిసి తమపై తప్పుడు కేసులు పెట్టి బెదిరించి, తమ భూమిని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో వేరే వారికి రిజిస్ట్రేషన్‌ చేయించారని బాధితులు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతలు అశోక్‌, విజయ్‌కుమార్‌ తదితరులు తమ ఇంటిపై దాడి చేసి కొట్టి, ఖాళీ పత్రాలపై సంతకాలు చేయించుకోవడంతోపాటు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని అనంతపురానికి చెందిన ఎం.పద్మజ ఫిర్యాదు చేశారు.

Updated Date - Oct 22 , 2024 | 03:47 AM