Share News

జూలో సింహం చంపేసింది!

ABN , Publish Date - Feb 16 , 2024 | 04:04 AM

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూ పార్కులో గురువారం దారుణం చోటుచేసుకుంది. ఎన్‌క్లోజర్‌లోకి దూకిన ఓ వ్యక్తిని సింహం చంపేసింది. మృతుడు రాజస్థాన్‌ వాసి కాగా, సింహం కూడా నాలుగేళ్ల క్రితం రాజస్థాన్‌లోని ఓ జూ నుంచి తీసుకువచ్చినది కావడం యాదృచ్ఛికం!. వివరాలివీ..

జూలో సింహం చంపేసింది!

ఎన్‌క్లోజర్‌లోకి దూకిన రాజస్థాన్‌ వాసి

దాడి చేసి లాక్కెళ్లిన సింహం.. శరీరం ఛిద్రం

సందర్శకుల అరుపులతో వదిలేసినా అప్పటికే మృతి

మద్యం మత్తులోనా.. ఆత్మహత్యా?

ఎన్‌క్లోజర్‌లో దూకిన కారణాలపై అస్పష్టత

తిరుపతి, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూ పార్కులో గురువారం దారుణం చోటుచేసుకుంది. ఎన్‌క్లోజర్‌లోకి దూకిన ఓ వ్యక్తిని సింహం చంపేసింది. మృతుడు రాజస్థాన్‌ వాసి కాగా, సింహం కూడా నాలుగేళ్ల క్రితం రాజస్థాన్‌లోని ఓ జూ నుంచి తీసుకువచ్చినది కావడం యాదృచ్ఛికం!. వివరాలివీ.. రాజస్థాన్‌ రాష్ట్రం ఆల్వార్‌ జిల్లా తురానా గ్రామానికి చెందిన ప్రహ్లాద్‌ గుజ్జర్‌ (38) మధ్యా హ్నం జూపార్కును సందర్శించడానికి వచ్చాడు. పలు ప్రాంతాలను చూసిన అతడు.. సింహాల ఎన్‌క్లోజర్‌ వద్దకు వచ్చి హఠాత్తుగా గేటుపైకెక్కి లోనికి దూకేశాడు. ఏడేళ్ల వయసు కలిగిన మగ సింహం ఒక్కసారిగా దాడి చేసి అతడి గొంతును నోట కరిచి వందమీటర్ల వరకు లాక్కెళ్లింది. సమాచారమందుకున్న జూపార్కు వైద్యుడు, సిబ్బంది కర్రలు పట్టుకుని గట్టిగా అదిలించడంతో ప్రహ్లాద్‌ను విడిచిపెట్టిన సింహం బోనులోకి వెళ్లిపోయింది. వైద్యుడు, సిబ్బంది వెళ్లేసరికి అప్పటికే ప్రహ్లాద్‌ తీవ్ర గాయాలతో మృతి చెందాడు. ఒళ్లంతా రక్తపు గాయాలతో నిండాయి. పోలీసులు మృతదేహాన్ని తిరుపతి రుయాస్పత్రికి తరలించారు.

ఎన్‌క్లోజర్‌లో దూకిన కారణాలపై అస్పష్టత

ప్రహ్లాద్‌ సింహాల ఎన్‌క్లోజర్‌లో దూకడానికి కారణాలు అంతుపట్టడం లేదు. సందర్శకులు, సిబ్బంది కథనాల మేర కు.. అతడు దూరం నుంచి ఒక్కసారిగా పరుగు తీస్తూ పది అడుగుల ఎత్తున్న ఎన్‌క్లోజర్‌ తొలి గేటు ఎక్కి లోనికి దూ కాడు. అక్కడ 12 అడుగుల ఎత్తున్న రెండో గేటు కూడా ఎక్కి లోనికి దూకేశాడు. సెల్ఫీ ఫొటోలు గానీ, వీడియోలు గానీ తీసుకునే ప్రయత్నం చేయలేదు. దూకినప్పుడు అతడి వద్ద మొబైల్‌ లేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆ సమయంలో ఎన్‌క్లోజర్‌లో మరో రెండు సింహాలున్నాయి. ఎన్‌క్లోజర్‌లో మృతదేహం వద్ద గానీ, పరిసరాల్లో గానీ మొబైల్‌ ఫోన్‌ లభించలేదు. దీంతో మద్యం మత్తులో దూకి ఉండొచ్చని, లేదంటే మానసిక స్థిమితం లేక, ఆత్మహత్య చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ చర్యకు పాల్పడి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రహ్లాద్‌ గుజ్జర్‌ మృతదేహం వద్ద మంగళవారం హైదరాబాద్‌ నుంచి తిరుపతికి కొనుగోలు చేసిన రైల్వే టికెట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లభించాయి. స్వగ్రామం నుంచి రెండు నెలల కిందట బయల్దేరినట్టు బంధువుల నుంచి ప్రాథమిక సమాచారం అందినట్టు పోలీసులు చెబుతున్నారు. కాగా, ఈ ఘటన తర్వాత లోపలున్న సందర్శకులందరినీ జూ అధికారులు బయటికి పంపించేశారు. ఘటన జరిగిన తీరును తెలుసుకోవడానికి లయన్‌ ఎన్‌క్లోజర్‌ వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫుటేజీ పరిశీలనలో ఉన్నారు.

భోజన విరామ సమయంలో సిబ్బంది ఏమరుపాటు!

జూపార్కులో మధ్యాహ్నం సిబ్బంది భోజన విరామ సమయం కావడంతో కొంత ఏమరుపాటుగా ఉన్నపుడు ఈ దుర్ఘటన జరిగింది. సింహాల ఎన్‌క్లోజర్‌ వద్ద సందర్శకుల కోసం ప్రధానంగా రెండు పాయింట్లు ఉన్నాయి. ప్రధాన పాయింట్‌ వద్ద సందర్శకులు, సిబ్బంది కదలికలు ఎక్కువగా ఉంటాయి కనుక సందర్శకులు దుందుడుకు చర్యలకు యత్నించరు. రెండో పాయింట్‌ వద్ద మధ్యాహ్నం సింహాలు విశ్రాంతి తీసుకుంటూనో, నిద్రిస్తూనో ఉంటే సందర్శకులు వాటిపై రాళ్లు విసిరి లేపే ప్రయత్నం చేస్తుంటారు. దానికోసం ఎన్‌క్లోజర్‌ యానిమల్‌ కీపర్‌ రెండో పాయింట్‌లో ఉండి, సందర్శకుల కోసం సింహాలను అదిలిస్తూ ఉంటారు. గురువారం మధ్యాహ్నం కూడా కీపర్‌ భోజనం చేసి వచ్చి రెండో పాయింట్‌ వద్ద ఉండగా, మొదటి పాయింట్‌ వద్ద రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద్‌ గుజ్జర్‌ గేట్ల మీదుగా లోనికి దూకి మృత్యువాత పడ్డాడని తెలిసింది.

Updated Date - Feb 19 , 2024 | 04:08 PM