Share News

గిరిజనుల జీవన ప్రమాణాలు పెరగాలి

ABN , Publish Date - Oct 22 , 2024 | 03:57 AM

గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు అధికారులు, ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలని సీఎం చంద్రబాబు కోరారు.

గిరిజనుల జీవన ప్రమాణాలు పెరగాలి

పిల్లలందరూ పాఠశాలల్లో చేరేలా చర్యలు: సీఎం

అమరావతి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు అధికారులు, ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలని సీఎం చంద్రబాబు కోరారు. గిరిజనుల సంక్షేమానికి, వారి ప్రాంతాల అభివృద్ధికి అమలు చేస్తున్న పథకాల ప్రగతిపై సోమవారం ఆయన సమీక్షించారు. కేంద్ర పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని, మ్యాచింగ్‌ గ్రాంట్‌ను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం పేర్కొన్నారు. విద్య, వైద్య, ఆరోగ్యం, తాగునీటి సరఫరా, రహదారులు, కమ్యూనికేషన్‌ తదితర మౌలిక వసతుల కల్పనతో పాటు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు జీవనోపాది కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించారు. అక్షయ పాత్ర సంస్థ ద్వారా గిరిజన విద్యార్థులకు పోషకాహారం అందించే ప్రతిపాదనలకు సీఎం ఆమోదం తెలిపారు. అందుకు రూ.337 కోట్లు మంజూరు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. తల్లీ, బిడ్డల మరణాల రేటును తగ్గించే విధంగా, సికిల్‌సెల్‌ వ్యాధిని నివారించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా గిరిజన ప్రాంతాల్లో అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యాన్ని కల్పించేందుకు రూ.1200 కోట్లతో ప్రత్యేక ప్రాజెక్టును రూపొందించాలన్నారు. జనవరి కల్లా బీఎ్‌సఎన్‌ఎల్‌తో పాటు ఇతర నెట్‌వర్కులను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సోలార్‌ విద్యుత్తు వినియోగాన్ని పెంచే విధంగా ప్రధానమంత్రి సూర్యఘర్‌ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. సమావేశంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఆ శాఖ కార్యదర్శి కన్నబాబు, సీఎం కార్యదర్శి ప్రద్యుమ్న, జీసీసీ అధికారులు, ఐటీడీఏ పీఓలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2024 | 03:57 AM