దగా పడ్డ మిర్చి రైతు
ABN , Publish Date - Dec 13 , 2024 | 11:55 PM
ఈ రైతు పేరు గోపాల్. కర్నూలు మండలం రేమట గ్రామం.
మార్కెట్ యార్డులో ముంచేస్తున్న వ్యాపారులు
40 మందికి లైసెన్సులు.. 10 మందే కొనుగోళ్లు
భారీ మొత్తంలో జీరో వ్యాపారం
ప్రకృతి వైపరీత్యాలకు మించిన నష్టం
దారి తప్పిన అధికారుల నిఘా
4 నుంచి 6 శాతం కమిషన ముక్కు పిండి వసూలు
తక్కువ తూకం చూపి స్వాహా చేస్తున్న వైనం
కార్యాలయాల్లో వ్యాపారులతో పిచ్చాపాటికే అధికారులు పరిమితం
ఈ రైతు పేరు గోపాల్. కర్నూలు మండలం రేమట గ్రామం. ఈ రైతు బుధవారం కర్నూలు మార్కెట్ యార్డుకు 6 బస్తాల ఎండుమిర్చిని అమ్మకానికి తీసుకువచ్చాడు. తూకాలు వేసే సమయంలో అధికారులు పత్తా లేకుండా పోయారనీ, తూకం కూడా తక్కువ చూపి కొంత మిర్చిని కొట్టేశారనీ, కమిషన 4 నుంచి 6 శాతం వ్యాపారి డిమాండ్ చేశారనీ గోపాల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇది ఈ రైతు అనుభవమే కాదు. ఎండుమిర్చిని అమ్మకానికి తెచ్చిన ఉమ్మడి జిల్లా రైతులు, తెలంగాణ రాష్ట్రంలోని అలంపూరు తదితర ప్రాంతాల రైతులు కూడా దగా పడుతున్నారు. గుంటూరు మిర్చి యార్డు తర్వాత కర్నూలు మిర్చి యార్డుకు వేలాది మంది రైతులు ఎండుమిర్చిని అమ్మకానికి తీసుకువస్తారు. అధికారుల నిర్లక్ష్యం వహించడం, వ్యాపారులతో కుమ్మక్కు కావడం వల్లనే తమకు గిట్టుబాటు ధర అందడం లేదని, ఇష్టారాజ్యంగా వ్యాపారులు తమను దోచేస్తున్నారనీ మిర్చి రైతులంతా ఆందోళన చెందుతున్నారు.
కర్నూలు అగ్రికల్చర్, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ సంవత్సరం ఖరీఫ్‌లో దాదాపు 50వేల ఎకరాల్లో ఎండుమిర్చిని రైతులు సాగు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మిర్చి రైతులు ప్రకృతి వైపరీత్యాలతో పాటు వ్యాపారుల దోపిడీకి గురవుతున్నారు. వరుసగా కురుస్తున్న వర్షాలు, తుఫాన కారణంగా మిర్చి రైతులకు భారీ నష్టం జరిగి దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. పరిస్థితులు అనుకూలించి వుంటే ఎకరాకు పది క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉంది. అయితే.. నల్లి, తామర తదితర తెగుళల వల్ల, కీటకాల వల్ల మిర్చి పంటకు భారీగా నష్టం జరిగింది. ఎకరాకు కేవలం 3 నుంచి 4 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే అందింది. కనీసం చేతికందిన కాస్తో.. కూస్తో దిగుబడినైనా గిట్టుబాటు ధరకు అమ్ముకుందామనే ఆశతో రైతులు గుంటూరు మార్కెట్ యార్డుకు వెళ్లకుండా రవాణా ఖర్చులు కలిసి వస్తాయనే ఆశతో కర్నూలు మిర్చి యార్డుకు అమ్మకానికి తెస్తున్నారు. అయితే.. వ్యాపారులు వారిని దగా చేస్తున్నారు. వారితో చేతులు కలుపుతున్న అధికారుల కారణంగా రైతులు నిండా మునిగిపోతున్నారు. ఒక ఎకరా మిర్చి సాగుకు దాదాపు రూ.1లక్ష పైగానే ఖర్చు పెడుతున్నామనీ, అయితే.. యార్డులో భారీగా నష్టాలపాలవుతున్నట్లు రైతులు తెలిపారు. ప్రకృతి విపత్తు కంటే యార్డులోనే ఎక్కువ నష్టపోతున్నామని అంటున్నారు.
40 మందికి గానూ పది మంది మాత్రమే కొనుగోళ్లు
కర్నూలు మార్కెట్ యార్డులో మిర్చి కొనుగోళ్లు జరపడానికి 40 మంది లైసెన్సులు తీసుకున్నారు. అయితే.. అందరూ కొనుగోళ్ల కోసం పోటీ పడితే.. రైతులకు ధర ఎక్కువగా చెల్లించాల్సి వస్తుందనే ఉద్దేశంతో వ్యాపారులు కూడగట్టుకుని కేవలం పది మంది మాత్రమే మిర్చిని కొనుగోలు చేస్తున్నారు. ఆ పది మంది కొనుగోలు చేసిన మిర్చినే టెండరులో పాల్గొనని వ్యాపారులు కూడా సిండికేట్ అయ్యి వివిధ ప్రాంతాలకు ఎగుమతులు చేస్తున్నట్లు సమాచారం. లైసెన్సులు తీసుకున్న 40 మంది చేత టెండరు వేసేందుకు అధికారులు ఏ మాత్రం శ్రద్ధ తీసుకోకపోవడం దారుణంమని పలువురు అంటున్నారు. ఈ వ్యవహారంపై ఎన్నోసార్లు మార్కెట్ కమిటీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం లేవని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా లైసెన్సు తీసుకున్న వ్యాపారుల అందరి చేత కొనుగోళ్లు చేయించాలని, లేకపోతే తాము నష్టపోక తప్పదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెద్ద ఎత్తున జీరో వ్యాపారం:
కర్నూలు మార్కెట్ యార్డులో ఎండుమిర్చి వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతుంది. గుంటూరు తర్వాత ఎండుమిర్చి అమ్మకాలు కర్నూలులోనే జరుగుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక్క కర్నూలు మార్కెట్ కమిటీ యార్డులోనే మిర్చి కొనుగోలు జరుగుతుండటంపై తమకు గిట్టుబాటు ధర అందుతుందని రైతులు ఆశించారు. అయితే.. వ్యాపారులు అధికారుల నిర్లక్ష్యాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని గ్రామాలకే వెళ్లి పెద్ద ఎత్తున రైతులతో కొనుగోలు చేసి హైదరాబాద్, మద్రాసు, బళ్లారి తదితర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. దీంతో జీరో వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతోంది. మార్టెకింగ్ శాఖకు సెస్సు రూపంలో రావాల్సిన దాదాపు రూ.కోటి ఆదాయానికి గండిపడుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖరీఫ్, రబీ సీజనలలో ఏటా 60వేల హెక్టార్లలో మిర్చిని సాగు చేస్తున్నారు. గత సంవత్సరం ఇదే సమయానికి క్వింటం ఎండు మిర్చికి దాదాపు రూ.20 నుంచి రూ.30 వేల దాకా రైతుకు ఆదాయం లభించింది. దీని వల్ల మార్కెటింగ్ శాఖకు పెద్ద ఎత్తున సెస్సు రూపంలో ఆదాయం వచ్చింది. దీని వల్ల పెద్ద ఎత్తున జీరో వ్యాపారం జరుగుతుండటంతో సెస్సు వసూళ్లకు గండి పడే అవకాశం కనిపిస్తోంది.
కాటా వద్ద పత్తాలేని అధికారులు:
కర్నూలు మార్కెట్ యార్డులో మిర్చి రైతుల్ని వ్యాపారులు అధికారుల అండ చూసుకుని నిండా ముంచుతున్నారు. తూకం వేయాల్సిన సమయంలో సంబంధిత సూపర్‌వైజర్, ఇతర అధికారులు అక్కడ ఉండాల్సింది పోయి.. కార్యాలయాల్లో సేద తీర్చుకుంటున్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి రైతులు ఎన్నోసార్లు తీసుకువచ్చినా చలనం లేకపోవడం దారుణం. బుధవారం కర్నూలు మార్కెట్ యార్డులో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపించింది. తాను తెచ్చిన ఎండుమిర్చి బస్తాలను కాటా వేస్తే దాదాపు 5 నుంచి 10 శాతం మిర్చిని తూకాల్లో చూపకుండా వ్యాపారి స్వాహా చేశాడని ఓ రైతు ఆరోపించాడు. రైతులదంతా ఇదే పరిస్థితి. ఇంత తక్కువ తూకం వేయడం ఏమిటని వ్యాపారులను రైతులు నిలదీశారు. తేమ శాతం ఎక్కువగా ఉందని, తరుగు కింద ఈ మొత్తాన్ని తీసుకుంటున్నామని, ఇష్టం ఉంటే అమ్మండి.. లేకపోతే వెళ్లిపోమని వ్యాపారులు దమాయించడంతో రైతులు మిన్నకుండిపోయారు. తూకం వద్ద సూపర్‌వైజర్లు, ఆ పై అధికారులు ఉంటే ఈ పరిస్థితి తమకు ఎదురయ్యేది కాదని, ఎన్నోసార్లు సూపర్‌వైజర్, పై అధికారులకు చెప్పినా వ్యాపారులకే వారు వత్తాసు పలకడం దారుణమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఫ కార్యాలయాల్లో ముచ్చట్లకే పరిమితం:
కర్నూలు మార్కెట్ యార్డులో మిర్చి కొనుగోళ్లను సూపర్‌వైజర్లు పర్యవేక్షించడం ఆనవాయితీ. అయితే.. సంబంధిత సూపర్‌వైజర్ వారంలో కనీసం ఒక్క రోజు కూడా మిర్చి యార్డులో నిఘా పెట్టిన పాపాన పోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. తూకాల వద్ద వ్యాపారుల అక్రమాలను నిరోధించామని, ఖచ్చితంగా కాటాల వద్ద తూకాలు పూర్తయ్యే వరకు ఉండాలని సిబ్బందిని ఆదేశించామని పై అధికారులు అంటున్నారు. అయితే.. సంబంధిత సూపర్‌వైజర్ మిర్చి యార్డులో ఉండకుండా కార్యాలయంలోకి వ్యాపారులను పిలిపించుకుని ముచ్చట్లు పెడుతుండుతున్నాడని, ఇదేమి దారుణమంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తూకాలు సాధారణంగా మధ్యాహ్నం ఒంటిగంటకు నిర్వహిస్తుంటారు. ఆ సమయంలో సూపర్‌వైజర్ కనీసం పది నిమిషాలు కూడా మిర్చి యార్డులో ఉండకపోవడంపై రైతులు మండిపడుతున్నారు.
ఫ కమిషన ఎక్కువ వసూళ్లు చేస్తున్నారు - చంద్రన్న, పోలకల్, సీ. బెళగల్ మండలం:
26 మిర్చి బస్తాలను అమ్మకానికి తెచ్చాను ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా.. కేవలం 4 బస్తాలకే దిగుబడి పరిమితమైంది. రెండున్నర ఎకరాలకు 1.80 లక్షల ఖర్చు వచ్చింది. నల్లి, తామర తదితర తెగుళ్ల కీటకాల వల్ల దిగుబడి దారుణంగా పడిపోయింది. కనీసం యార్డులో గిట్టుబాటు ధర అందుతుందోనని నమ్మకం పెట్టుకున్నాను. అయితే 4 శాతం కమిషన వ్యాపారులు ముక్కు పిండి వసూలు చేశారు. తక్కువ తూకంతో భారీగా నష్టపోయాను. కాటా యంత్రం వద్ద ఏ అధికారి రాకపోవడం మరింత నష్టానికి దారి తీసింది.
ఫ ఇంత దారుణం గుంటూరు యార్డులో లేదు - మల్లికార్జున, రైతు:
మమ్మల్ని వ్యాపారులు దారుణంగా ముంచేస్తున్నారు. యార్డులో లక్షల్లో జీతభత్యాలు తీసుకుంటున్న సూపర్‌వైజర్, అధికారులు మా గోడు వినిపించుకోవడం లేదు. కార్యాలయాల్లో వారు వ్యాపారులతో మాట్లాడుకుంటూ కూచున్నారు. తక్కువ తూకాలతో నిండా మునుగుతున్నాము. కమిషన కూడా అధికంగా వసూలు చేస్తున్నారు. ఎవరికి చెప్పుకోవాలో దిక్కు తోచడం లేదు.
ఫ వ్యాపారులపై చర్యలు తీసుకుంటాం -జయలక్ష్మి, సెలక్షన గ్రేడ్ సెక్రటరీ:
మిర్చి యార్డులో మిర్చిని తూకం వేసే సమయంలో ఖచ్చితంగా సూపర్‌వైజర్లు, సెక్రటరీలు నిఘా పెట్టాల్సిందే. ఈ మేరకు వారికి ఆదేశాలు కూడా ఇచ్చాము. ఎవరైనా రైతులు ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా సంబంధిత సూపర్‌వైజర్లపై చర్యలు తీసుకుంటాము. వ్యాపారుల లైసెన్సులను సస్పెన్సన చేస్తాము.