‘పెద్ద వాగు’ను ముంచేశారు
ABN , Publish Date - Jul 20 , 2024 | 03:54 AM
పెద్ద వాగుకు పడిన గండి ఎవరి పాపం? అధికారులు కొన్ని విషయాల్లో తడబడిన కారణంగానే ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం అతలాకుతలం కావాల్సి వచ్చిందా? గోదావరి బోర్డు చేసిన సూచనలను గత సీఎం జగన్ పట్టించుకోకపోవడమే ఈ ఆపదను తెచ్చిపెట్టిందా?
గోదావరి బోర్డు మాటా వినని నాటి సర్కారు
నిర్వహణను పూర్తిగా గాలికొదిలేసిన వైనం
దానివల్లే వేలేరుపాడును ముంచిన వరద
ఏలూరు, జూలై 19 (ఆంధ్రజ్యోతి) : పెద్ద వాగుకు పడిన గండి ఎవరి పాపం? అధికారులు కొన్ని విషయాల్లో తడబడిన కారణంగానే ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం అతలాకుతలం కావాల్సి వచ్చిందా? గోదావరి బోర్డు చేసిన సూచనలను గత సీఎం జగన్ పట్టించుకోకపోవడమే ఈ ఆపదను తెచ్చిపెట్టిందా? ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయి రోడ్డు మార్గం విధ్యంసమై ముసలి, ముతక, పసిపిల్లల సైతం ప్రాణాలు కాపాడుకోవడానికి గుట్టలెక్కి చిమ్మ చీకటిలోనే బిక్కుబిక్కుమంటూ గడపాల్సి రావడానికి ముందుచూపు లేని జగన్ విధ్వంసకర పాలనే కారణమా?ఈ ప్రశ్నలకు వరద బాధిత వేలేరుపాడు మండలవాసుల్లో ఎవరిని అడిగినా అవుననే సమాధానం ఇస్తున్నారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడిపల్లి వద్ద పెద్ద వాగు ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు భద్రతా నిర్వహణను గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగానే పెద్దవాగు ప్రాజెక్టుకు గండిపడి, 15 గ్రామాల్లో విధ్వంసం సృష్టించింది. ప్రజలకు గూడు లేకుండా చేసింది. వందల ఇళ్లు దెబ్బతిన్నాయి.
గాలికొదిలేసిన జగన్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లనుంచి గోదావరిబోర్డు పరిధిలోకి వచ్చిన ఉమ్మడి ప్రాజెక్టుల్లో పెద్దవాగు ప్రాజెక్టు ఒకటి. 1980లో నిర్మించిన దీని నిల్వ సామర్థ్యం 0.5 టీఎంసీలు. సాగు విస్తీర్ణం 16 వేల ఎకరాలు. ఏపీకి 13,640 ఎకరాలు, తెలంగాణకు 2,360 ఎకరాలకు సాగు నీరందిస్తోంది. ఇందులో వేలేరుపాడుకు కుడి కాలువ 2.37 కిలోమీటర్లు, కుక్కునూరుకు ఎడమ కాలువ 2.37 కిలోమీటర్లు. గోదావరి బోర్డు ప్రాజెక్టు నిర్వహణ, భద్రతకుగానూ అయ్యే వ్యయంలో 15ః85 కోటా పద్ధతిలో ముందుకు సాగాలని ఇరురాష్ట్రాలకు సూచించింది. జగన్ సీఎంగా ఉండగా నిధులు కేటాయిస్తే కనీసం క్రస్ట్ గేట్లైనా పక్కాగా మెయింటినెన్స్‌లో ఉండేవి. గురువారం నాటికి ప్రాజెక్టు మూడు గేట్లలో ఒక గేటు మొరాయుంచడం.. కొద్దిసేపటి తరువాత ప్రాజెక్టు కట్టకు గండి పడడం జరిగి, విధ్వంసానికి దారితీసింది. ఫలితంగా గ్రామాలన్నీ బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. కోయ మాధవరం, అల్లూరినగరం మధ్య గురువారం కారు వాగులో కొట్టుకుపోయింది. ఈ క్రమంలో ప్రవాహ ఉధృతిని నియంత్రించేందుకు పెద్ద వాగు క్రస్ట్ గేట్లను కొంత సేపు మూసి ఉంచే ప్రయత్నం చేశారు. ఆ తరువాత కొంత సేపటికి తిరిగి గేట్లను పైకెత్తే క్రమంలో మూడోగేటు మొరాయించిందని,ప్రాజెక్టు గండికి ప్రధాన కారణమిదేనని అంటున్నారు. దీనికితోడు ఎగువ ప్రాంతాల నుంచి 25వేల క్యూసెక్కులకుపైగా వరదనీరు అత్యధికంగా వచ్చిపడడం మరో కారణంగా భావిస్తున్నారు.
ఇది రెండోసారి..
పెద్దవాగు ప్రాజెక్టుకు గండిపడడం ఇది రెండోసారి. దాదాపు 35 ఏళ్ల క్రితం 1989లో మొదటిసారి గండి పడింది. అప్పట్లో ప్రాజెక్టుకు దిగువనే ఉన్న వేలేరుపాడు మండలం కమ్మరిగూడెం గ్రామం సైతం వరద తాకిడికి కొట్టుకుపోయింది. అప్పట్లో దీనిప్రభావం ఈ గ్రామంతోపాటు అల్లూరినగర్ వరకు ఉంది. ఈసారి వరదలకు కూడా ఈ గ్రామమే పూర్తిగా దెబ్బతింది.