Share News

కాపాడాల్సిన పోలీసులే చట్టాన్ని బ్రేక్‌ చేశారు

ABN , Publish Date - Sep 21 , 2024 | 04:32 AM

కస్టడీలో ఉన్న నిందితుడిని సంరక్షించాల్సిన బాధ్యత దర్యాప్తు అధికారిదేనని, నిందితుడికి కస్టడీలో ఏదైనా హాని జరిగితే వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఆ అధికారిపైనే ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది.

కాపాడాల్సిన పోలీసులే చట్టాన్ని బ్రేక్‌ చేశారు

రఘురామను కస్టడీలో హింసించిందెవరో తేలాలి

విజయ్‌పాల్‌ను ప్రశ్నిస్తేనే వాస్తవాలు తెలుస్తాయి

సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు

కస్టడీలోని నిందితుడి బాధ్యత దర్యాప్తు అధికారిదే

విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యలు

ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ పై ముగిసిన వాదనలు

తీర్పు రిజర్వ్‌... 24న వెల్లడిస్తామని స్పష్టీకరణ

అమరావతి, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): కస్టడీలో ఉన్న నిందితుడిని సంరక్షించాల్సిన బాధ్యత దర్యాప్తు అధికారిదేనని, నిందితుడికి కస్టడీలో ఏదైనా హాని జరిగితే వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఆ అధికారిపైనే ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. రఘురామకృష్ణంరాజు కస్టోడియల్‌ టార్చర్‌ ఘటన జరిగిన గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో పిటిషనర్‌ విజయ్‌పాల్‌ అడిషనల్‌ ఎస్పీ హోదాలో ఉన్నారని, రఘురామపై నమోదుచేసిన కేసుకు ఆయనే దర్యాప్తు అధికారి అని గుర్తు చేసింది. ఈ నేపఽథ్యంలో కస్టోడియల్‌ టార్చర్‌ ఆరోపణలపై వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉంటుందని వ్యాఖ్యానించింది. రఘురామ పెట్టిన కేసులో ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ విజయ్‌పాల్‌ వేసిన వ్యాజ్యం విచారణ సందర్భంగా జస్టిస్‌ వీఆర్‌కె కృపాసాగర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం జరిగిన విచారణలో ప్రాసిక్యూషన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ హైకోర్టులో వాదనలు వినిపించారు. ‘‘రఘురామ విషయంలో చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులే దానిని ఉల్లంఘించారు. ఆయనను కస్టోడియల్‌ టార్చర్‌కు గురిచేసినప్పుడు పోలీసు అధికారి విజయ్‌పాల్‌ కస్టడీలో ఉన్నారు. కస్టడీలో తనను పలువురు ఉన్నతాధికారులు టార్చర్‌కు గురిచేశారని రఘురామ చెబుతున్న నేపఽథ్యంలో ఎవరి పాత్ర ఏమిటో తేల్చాల్సి ఉంది. అందుకు విజయ్‌పాల్‌ను ప్రశ్నించడం (ఇంటరాగేషన్‌) అవసరం. ఆ సమయంలో విజయ్‌పాల్‌ కింద పనిచేసిన అధికారులను కూడా ప్రశ్నించాల్సి ఉంది. తప్పుడు మెడికల్‌ రిపోర్ట్‌ ఇవ్వాలని డాక్టర్‌ను ఎవరు ప్రభావితం చేశారో తేల్చాలి. రఘురామను కస్టోడియల్‌ టార్చర్‌కు గురిచేశారని ఆర్మీ ఆసుపత్రి నివేదిక ఇచ్చినప్పటికీ సంబంధిత అధికారులపై ప్రభుత్వ యంత్రాంగం ఎలాంటి చర్యలు అప్పట్లో తీసుకోలేదు. తనను చంపుతారనే భయంతో రఘురామ ఆ సమయంలో ఫిర్యాదు చేయలేదు. ప్రభుత్వం మారిన తర్వాత కేసు పెట్టారు. ఈ వ్యవహారంలో విజయ్‌పాల్‌ దర్యాప్తునకు సహకరించడం లేదు. ముందస్తు బెయిల్‌ పొందేందుకు ఆయన అనర్హుడు’’ అని తెలిపారు. పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది వీరారెడ్డి వాదనలు వినిపించారు. ‘

‘ఘటన జరిగిన మూడేళ్ల తర్వాత రఘురామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కస్టడీలో ఉండగా ఎవరు దాడి చేశారనేది రఘురామకు అవగాహన ఉంది. అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేయకుండా తనకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడిన తర్వాత కేసు పెట్టారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదులో పిటిషనర్‌పై నిర్దిష్టమైన ఆరోపణలు లేవు. కస్టోడియల్‌ టార్చర్‌ వ్యవహారంలో పిటిషనర్‌కు ఎలాంటి పాత్ర లేదు. పిటిషనర్‌కు ప్రస్తుతం 63 ఏళ్లు. అనేక ఆరోగ్యసమస్యలతో బాధపడుతున్నారు. దర్యాప్తుకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు ఎలాంటి షరతులు విధించినా అభ్యంతరం లేదు’’ అని తెలిపారు. రఘురామ తరఫు న్యాయవాది పీవీజీ ఉమే్‌షచంద్ర వాదనలు వినిపించారు. ‘‘తన కస్టడీలో ఉన్న నిందితుడిని చిత్రహింసలకు గురిచేస్తే, అందులో తన పాత్రలేదని పిటిషనర్‌ తప్పించుకోలేరు. ఓ ఎంపీ (అప్పటి)పై థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవాలి. రఘురామను చిత్రహింసలకు గురిచేయడంలో పోలీసు ఉన్నతాధికారుల పాత్ర ఉంది. ఈ ఘటనపై మేజిస్ట్రేట్‌ వద్ద ప్రైవేటు ఫిర్యాదు చేసినప్పటికీ, తిరిగి ఆ కేసును పోలీసులే విచారించాలి. ఈ నేపఽథ్యంలోనే న్యాయం కోసం ప్రభుత్వం మారిన తర్వాత రఘురామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిటిషనర్‌కు ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయి. పిటిషన్‌ను కొట్టివేయాలి’’ అని కోరారు. ఇరువైపుల వాదనలు ముగియడంతో న్యాయమూర్తి తీర్పు రిజర్వ్‌ చేశారు. ఈ నెల 24న నిర్ణయం వెల్లడిస్తామన్నారు.

Updated Date - Sep 21 , 2024 | 04:32 AM