టీడీపీకి ఓట్లు వేశారని.. తలలు పగలగొట్టారు
ABN , Publish Date - May 17 , 2024 | 04:12 AM
విశాఖపట్నంలో వైసీపీకి ఓట్లు వేయలేదనే కక్షతో టీడీపీ సానుభూతిపరులపై దాడి చేసి దారుణంగా తలలు పగలగొట్టారు. మహిళలని కూడా చూడకుండా రాత్రివేళ ఇంట్లోకి చొరబడి మరీ కొట్టారు. ఈ ఘటన విశాఖ నగరంలోని కంచరపాలెంలోని బర్మా క్యాంపులో బుధవారం
కర్రలు,రాడ్‌తో ఇంట్లోకి వెళ్లి హంతక దాడి
తీవ్రంగా గాయపడ్డ తల్లి, ఇద్దరు పిల్లలు
నలుగురిపై కేసు నమోదు.. ఒకరికి రిమాండ్
‘వ్యక్తిగత కక్షలు’గా చూపేందుకు పోలీసుల యత్నం
విశాఖపట్నం/కంచరపాలెం, మే 16 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో వైసీపీకి ఓట్లు వేయలేదనే కక్షతో టీడీపీ సానుభూతిపరులపై దాడి చేసి దారుణంగా తలలు పగలగొట్టారు. మహిళలని కూడా చూడకుండా రాత్రివేళ ఇంట్లోకి చొరబడి మరీ కొట్టారు. ఈ ఘటన విశాఖ నగరంలోని కంచరపాలెంలోని బర్మా క్యాంపులో బుధవారం రాత్రి జరిగింది. బాధితుల కథనం ప్రకారం...సుంకరి ఆనందరావు, భార్య ధనలక్ష్మి (44), కుమార్తె నూకరత్నం (24), కుమారుడు మణికంఠ (26)లతో కలిసి ఉంటున్నారు. వీరికి టీడీపీ హయాంలో ఇల్లు వచ్చింది. దానికి సంబంధించిన శిలాఫలకం ఇంటి ముందు ఉంది. దానిని తీసేయాలని రెండిళ్ల అవతల ఉన్న పూతి ఆశ, బత్తుల కనకరత్నం తదితరులు గొడవ పడేవారు. ఇది కాకుండా మురుగు కాలువకు సంబంధించిన గొడవ కూడా ఉంది. నెల రోజుల క్రితం కూడా గొడవ పడ్డారు. ఇటీవల ఎన్నికల సమయంలో వైసీపీ వారు డబ్బులు ఇస్తారని, ఓటు వేయాలని ఆశా, కనకరత్నం...సుంకరి కుటుంబ సభ్యులను కోరారు. తాము తెలుగుదేశానికి ఓట్లు వేస్తామని సుంకరి కుటుంబ సభ్యులు చెప్పారు. అన్నట్టే చేశారు. ఇదిలా ఉండగా బుధవారం రాత్రి ధనలక్ష్మి, ఆమె పిల్లలు ఇంటి ముందు ఉండగా, ఆశా కుటుంబానికి చెందిన లావేటి లోకేశ్ అనే యువకుడు మద్యం తాగి వచ్చి, అసభ్యకరంగా ప్రవర్తించాడు. అంతేకాకుండా వైసీపీకి ఓట్లు వేయలేదని నిందించాడు. దీంతో మాటామాటా పెరిగింది. కొట్టుకునేంత వరకు వెళ్లింది. లోకేశ్ పెద్ద కర్ర తీసుకువచ్చి ధనలక్ష్మి, నూకరత్నం, మణికంఠను తలపై గట్టిగా కొట్టి గాయపరిచాడు. ఇంతలో ఆశ...ఒక ఐరన్ రాడ్ తీసుకువచ్చి దాడి చేసింది. తలలు పగలి తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితులు 108 ద్వారా కేజీహెచ్‌కు వెళ్లి చికిత్స తీసుకున్నారు. అక్కడి అవుట్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన వివరాలతో కంచరపాలెం పోలీసులు కేసు నమోదుచేశారు.
లోకేశ్‌పై హత్యాయత్నం కేసు పెట్టి రిమాండ్‌కు పంపించారు. మరో నలుగురు పూతి ఆశ, బత్తుల కనకరత్నం, కోనేటి సాయబాబు, బాయి భూలోక్‌లపై 354, 324, 334 తదితర సెక్షన్ల కింద కేసు పెట్టారు. వారెవరినీ అరెస్టు చేయలేదు. దాడి చేసిన వారికి స్థానిక వైసీపీ నాయకుడు అండగా ఉన్నారని, ఆయనే ఈ కేసు సీరియస్ కాకుండా ఐదో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఓ ఎస్‌ఐని మేనేజ్ చేశారని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా బాధితులకు తలలు పగిలిపోయిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కంచరపాలెం డీసీపీ మేకా సత్తిబాబు, ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి గురువారం రాత్రి అత్యవసరంగా విలేకరుల సమావేశం పెట్టారు. ఇందులో రాజకీయ కక్షలు లేవని, అలా ఎవరూ ఫిర్యాదు చేయలేదని ప్రకటించారు. ఇది పూర్తిగా 100 శాతం వ్యక్తిగత కక్షలతో జరిగిన గొడవ అని వివరించారు. ఇదిలా ఉండగా బాధితురాలు ధనలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ, తాము తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశామనే కక్షతోనే దాడి చేశారని ఆరోపించారు. పాత గొడవలు ఉన్నా అవి ఈ దాడికి కారణం కాదన్నారు. ఓట్లకు డబ్బులు తీసుకోలేదని, వైసీపీకి ఓటు వేయలేదనేదే దాడికి కారణమని తెలిపారు.