మీ వాళ్లనే వదల్లేదు.. ఇక మమ్మల్ని వదిలేస్తారా?
ABN , Publish Date - Jan 26 , 2024 | 03:19 AM
‘మీ వాళ్లనే విడిచిపెట్టనప్పుడు.. మమ్మల్ని వదిలేస్తారని మాకు నమ్మకం లేదు. నా భర్తకు బెయిల్ వచ్చినా పులివెందులకు రాలేని దుస్థితి నెలకొంది’
చంపుతారేమో.. చంపండి!
అధికార బలంతో అందరినీ
మాపైకి ఉసిగొల్పుతున్నారు
బెయిలొచ్చినా దస్తగిరి ఇంటికి రాలేని స్థితి
మీ రాక్షసత్వాన్ని మీ వాళ్లపై చూపండి
మాపై వద్దు: దస్తగిరి భార్య షబానా
పులివెందుల, జనవరి 25: ‘మీ వాళ్లనే విడిచిపెట్టనప్పుడు.. మమ్మల్ని వదిలేస్తారని మాకు నమ్మకం లేదు. నా భర్తకు బెయిల్ వచ్చినా పులివెందులకు రాలేని దుస్థితి నెలకొంది’ అంటూ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి భార్య షబానా ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మీడియాకు ఒక వీడియో సందేశాన్ని ఆమె విడుదల చేశారు. ‘ఐదు కోట్లు ఆశచూపి నా భర్తను నాశనం చేశారు. వైసీపీకి చెందిన ప్రతి ఒక్కరు దస్తగిరికి శత్రువులై కూర్చున్నారు. ఈ రాక్షస పాలన నుంచి నా భర్తను కాపాడండి. దిక్కులేని పరిస్థితిలో మేమున్నాం. ఎర్రగుంట్ల కేసులో నా శక్తికి మించి పోరాడి నా భర్తకు బెయిల్ తెచ్చుకున్నా. కానీ, నా భర్త ఇంటికి రాలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే మళ్లీ పీటీ వారెంట్లు వేస్తారు. మళ్లీ దాని మీద ఫైట్ చేసి బెయిల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీ తమ్ముడు తప్పు చేయనంత వరకు మీరు మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు. మాతో మీకెందుకండీ యుద్ధం. మీ సంతోషాల కోసం మా ఆయనను ఎందుకు బలిపశువును చేస్తున్నారు. మీ మీద తప్పుడు ఆరోపణలు వస్తున్నాయని మీరు బాధపడ్డప్పుడు.. తప్పును తప్పు అని మీరు ఒప్పుకోనప్పుడు.. మరి మా ఆయన ఎక్కడ కిడ్నాప్ చేశాడు? ఎక్కడ దొంగతనం చేశాడు? ఎవరిని కొట్టాడు? ఏ తప్పూ చేయకుంటే ఎంపీ అవినాశ్‌రెడ్డి కోర్టుకు ఎందుకు వెళ్తున్నాడు. మీకున్నట్లే భార్యభర్తల బంధం ఉంది. దయచేసి మీ రాక్షసతత్వాన్ని మీ వాళ్లమీద చూపండి మా మీద చూపకండి సార్’’ అంటూ షబానా ఆవేదన వ్యక్తం చేశారు.