Diwali 2024: ఈ దీపావళి కథే వేరు
ABN , Publish Date - Oct 31 , 2024 | 04:35 AM
బస్సెక్కి దీపావళికి ఓ టికెట్ ఇవ్వండి అని అడిగితే.. అటుగా వచ్చే కొత్తవాళ్లు ఎవరైనా ఆ బస్సులో ఉన్నారంటే కాస్త ఆశ్చర్యపోవాల్సిందే. మరి రెండు ఊళ్లు అదే పేరుతో ఉంటే.. సంబరమాశ్చర్యమే.
శ్రీకాకుళం జిల్లాలో రెండు గ్రామాలకు పండగ పేరు.. రాజు ప్రాణాలు కాపాడినందుకు ఓ ఊరికి.. ఎలుక చేసిన తుంటరి పనికి మరో ఊరికి పేర్ల మార్పు
శ్రీకాకుళం, రణస్థలం, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): బస్సెక్కి దీపావళికి ఓ టికెట్ ఇవ్వండి అని అడిగితే.. అటుగా వచ్చే కొత్తవాళ్లు ఎవరైనా ఆ బస్సులు ఉన్నారంటే కాస్త ఆశ్చర్యపోవాల్సిందే. మరి రెండు ఊళ్లు అదే పేరుతో ఉంటే.. సంబరమాశ్చర్యమే. ఎందుకంటే ఓ పండగ పేరే ఆ ఊళ్లకు పేరుగా ఉండటమే కారణం. చారిత్రక పాశస్త్యంతో పాటు ఎన్నో విశేషాలకు నెలవైన శ్రీకాకుళం జిల్లాలో దీపావళి పేరుతో రెండు ఊళ్లు ఉన్నాయి. ఈ పేర్లు ఎలా వచ్చాయనేది ఆసక్తి కలిగిస్తుంది. కొన్ని దశాబ్దాల కిందట వేర్వేరుగా జరిగిన సంఘటనలతో ఆ రెండు గ్రామాలకు దీపావళి పేరు వచ్చింది. గార మండలంలో దీపావళి, టెక్కలి మండలంలో దీపావళి పేట గ్రామాలు ఆ ప్రత్యేకతను సంతరించుకున్నాయి. అప్పట్లో సిక్కోలు రాజు ఆధీనంలో కళింగపట్నం ఓడరేవు ఉండేది. ఇప్పుడు గార మండల పరిధిలో ఉంది. అప్పట్లో సిక్కోలు రాజు ‘దీపావళి’ పండగ నాడు కళింగపట్నం వైపు గుర్రంపై బయలుదేరారు. మధ్యలో ఓ గ్రామంలో స్వల్ప అస్వస్థత గురై ఆయన స్పృహ తప్పి పడిపోయారు. స్థానికులు ఆ రాజుకు సపర్యలు చేయగా.. కొద్దిసేపటి తర్వాత తేరుకున్నారు. తనను కాపాడినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ రోజు దీపావళి పండగ కావడంతో.. ఇకపై ఈ గ్రామానికి కూడా ‘దీపావళి’గా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచీ ఆ గ్రామం దీపావళి అయ్యింది. ఈ గ్రామంలో దీపావళి పండుగ పదిరోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
ఇళ్లు అంటించిన ఎలుక..
టెక్కలి మండలం అయోధ్యాపురం పంచాయతీలో ‘దీపావళిపేట’ అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో వందేళ్ల కిందట అన్నీ పూరి గుడిసెలే ఉండేవి. ప్రతి ఇంటిలో నూనె దీపాలనే వినియోగించేవారు. ఓ రోజు వెలుగుతున్న దీపం ఒత్తిని తుంటరి ఎలుక తీసుకెళ్లి ఓ ఇంటికి నిప్పుపెట్టింది. దీంతో పూరిళ్లు అన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. దీపంతో పేట మొత్తం ఆహుతి అవ్వడంతో తొలుత దీపాలపేటగా పిలిచేవారు. ఆ తర్వాత దీపావళి పేటగా మార్పు చెందింది.
పున్నానపాలెం.. దీపావళికి దూరం
దీపావళి పేరుతో ఉన్న గ్రామాల్లో సందడికి విరుద్ధంగా.. శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం మండలం పున్నానపాలెంలో ఈ పండగకు ఏ సందడీ ఉండదు. రెండు వేల జనాభా ఉన్న ఈ గ్రామంలో ఏఒక్కరూ దీపావళి, నాగుల చవితి జరుపుకోరు. ఇదిచాలా ఏళ్ల నుంచి వస్తున్న ఆనవాయితీ. 150 ఏళ్ల కిందట ఈ గ్రామంలోని ఒక రైతుకు దీపావళి, నాగులచవితి పండగ చేసిన తర్వాత కష్టాలు కలగడంతో అప్పటి నుంచి ఈ పండుగలు చేసుకోవట్లేదని గ్రామపెద్దలు చెప్పారు. చిన్నపిల్లలు సైతం టపాసులు పేల్చకుండా ఉండటం విశేషం.
ఇది కూడా చదవండి
TTD Chairman: టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు..
మరిన్ని ఏపీ వార్తల కోసం