Share News

ఇటు వరద ముంపు.. అటు నేతల అరెస్టు ముప్పు!

ABN , Publish Date - Sep 05 , 2024 | 03:15 AM

వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి లండన్‌ పర్యటన డోలాయమానంలో పడింది. కుమార్తె పుట్టినరోజు వేడుకకు హాజరయ్యేందుకు లండన్‌ వెళ్లడానికి సీబీఐ కోర్టు నుంచి ఆయన ఇప్పటికే అనుమతి తీసుకున్నారు.

ఇటు వరద ముంపు.. అటు నేతల అరెస్టు ముప్పు!

లండన్‌ పర్యటనపై జగన్‌ తర్జనభర్జన

7న వెళ్తారంటున్న వైసీపీ వర్గాలు

అమరావతి, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి లండన్‌ పర్యటన డోలాయమానంలో పడింది. కుమార్తె పుట్టినరోజు వేడుకకు హాజరయ్యేందుకు లండన్‌ వెళ్లడానికి సీబీఐ కోర్టు నుంచి ఆయన ఇప్పటికే అనుమతి తీసుకున్నారు. ఈ నెల 25వ తేదీలోగా తిరిగి వచ్చేస్తానని కోర్టుకు నివేదించారు. ఈ నెల ఏడో తేదీన జగన్‌ దంపతులు బయల్దేరాల్సి ఉంది. అయితే విజయవాడ వరద ముంపులో లక్షలాది మంది చిక్కుకుపోయారు. వరద సంభవించిన రెండ్రోజుల తర్వాత జగన్‌ సింగ్‌నగర్‌లో మొక్కుబడిగా పర్యటించి.. సీఎం చంద్రబాబు వల్లే వరద వచ్చిందని చేసిన ఆరోపణలు, తన నివాసాన్ని కాపాడుకోవడానికి లేని బుడమేరు గేట్లు ఎత్తారంటూ తెలియకుండా మాట్లాడడంపై రాజకీయంగా విమర్శలు వెల్లువెత్తాయి. వైసీపీ తరఫున కోటి రూపాయల సాయమందిస్తానన్న ఆయన.. ఈ విరాళం సీఎం సహాయనిధికి కాకుండా ఏదో రూపంలో అందిస్తాననడంపైనా అభ్యంతరాలు వచ్చాయి. పుట్టెడు కష్టాల్లో ఉన్న బుడమేరు బాధితులను వదిలేసి కుమార్తె పుట్టిన రోజు కోసం తాను లండన్‌కు వెళ్తే రాజకీయంగా దుమారం రేగుతుందని ఆయన భయపడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలకు ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంతో వారు అరెస్టు ముప్పును ఎదుర్కొంటున్నారు. ఏ క్షణంలోనైనా వీరి అరెస్టు తప్పదని ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. అటు జనాలను, ఇటు పార్టీ నేతలను వదిలేసి లండన్‌ వెళ్లడం రాజకీయంగా మంచిది కాదని జగన్‌ అభిప్రాయపడుతున్నారని అంటున్నాయి. ఏదీ తేల్చుకోలేకపోతున్నారని చెబుతున్నారు. అయితే ఆయన 7న లండన్‌ వెళ్తారని వైసీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

Updated Date - Sep 05 , 2024 | 08:09 AM