Share News

పెట్టుబడులకు ఇదే మంచి సమయం ఏపీకి రండి

ABN , Publish Date - Oct 30 , 2024 | 05:15 AM

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఇదే మంచి సమయమని, టెక్నాలజీ సహకారంతో పాటు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ప్రపంచ టెక్‌ దిగ్గజ సంస్థలకు మంత్రి నారా లోకేశ్‌ ఆహ్వానం పలికారు.

పెట్టుబడులకు ఇదే మంచి సమయం ఏపీకి రండి

అమరావతిని ఏఐ క్యాపిటల్‌గా తీర్చిదిద్దేందుకు సహకరించండి

మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్లకు లోకేశ్‌ అభ్యర్థన

డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌, ఏఐ అభివృద్ధికి సహకరిస్తామన్న సత్య

అడోబ్‌ అభివృద్ధి, పరిశోధనా కేంద్రాన్ని ఏపీలో ఏర్పాటు చేయండి

అనుకూల ప్రాంతంలో యాపిల్‌ తయారీ యూనిట్‌ నెలకొల్పండి

అడోబ్‌ సీఈవో, యాపిల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌కు లోకేశ్‌ వినతి

దిగ్గజ టెక్‌ కంపెనీలకు మంత్రి లోకేశ్‌ ఆహ్వానం

అమరావతి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఇదే మంచి సమయమని, టెక్నాలజీ సహకారంతో పాటు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ప్రపంచ టెక్‌ దిగ్గజ సంస్థలకు మంత్రి నారా లోకేశ్‌ ఆహ్వానం పలికారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి లోకేశ్‌ మంగళవారం మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల, అడోబ్‌ సీఈవో శంతను నారాయణ్‌, యాపిల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (ఆపరేషన్స్‌) ప్రియా బాలసుబ్రహ్మణ్యంతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఉన్న అవకాశాలను, పెట్టుబడిదారులకు ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని వారికి వివరించారు. ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో ప్రగతిశీల ప్రభుత్వం ఇన్వెస్టర్ల ఫ్రెండ్లీ విధానాలతో ముందుకు సాగుతోందని చెప్పారు. అంతర్జాతీయ పెట్టుబడులకు తమ ప్రభుత్వం పన్నుల రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు గ్లోబల్‌ కంపెనీల కార్యకలాపాలను సులభతరం చేయడానికి రూపొందించిన విధానాలు అదనపు ఆకర్షణగా నిలుస్తాయన్నారు.


ఐటీ హబ్‌లకు మైక్రోసాఫ్ట్‌ సహకారం కావాలి

రెడ్‌మండ్‌లోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలో రాష్ట్రాభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై సత్య నాదెళ్లతో లోకేశ్‌ చర్చించారు. ఏపీని టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు ప్రణాళికలు రూపొందిస్తున్నారని, ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఐటీ హబ్‌లు, ఇన్నోవేషన్‌ పార్కులను నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ హబ్‌లను ప్రపంచస్థాయి సాంకేతిక కేంద్రాలుగా తీర్చిదిద్దడంలో మైక్రోసాఫ్ట్‌ సహకారం కావాలని కోరారు. క్లౌడ్‌ ఆధారిత ప్లాట్‌ఫాంల అమలు, డేటా అనలిటిక్స్‌ కోసం ఏఐని ఉపయోగించడం, సైబర్‌ సెక్యూరిటీని మెరుగుపరచడం, స్మార్ట్‌ సిటీ కార్యక్రమాల వంటి వాటి అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుసరించే డిజిటల్‌ గవర్నెన్స్‌ విధానాలకు మైక్రోసాఫ్ట్‌ సహకారం కావాలని మంత్రి అభ్యర్థించారు. రాజధాని అమరావతిని ఏఐ క్యాపిటల్‌గా చేయాలని భావిస్తున్నామని, ఈ క్రమంలోనే అక్కడ ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామని వివరించారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలు, డైనమిక్‌ టెక్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వీటిని పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్‌కు రావాలని, నూతన ఆవిష్కరణల కోసం ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేయాలని సత్య నాదెళ్లను కోరారు. ఏపీలో పెట్టుబడులు పెట్టే అవకాశాలను పరిశీలించి, ఏపీ సమగ్రాభివృద్ధి ప్రణాళికల్లో భాగస్వాములు కావాలన్నారు. ఐటీ, ఇంజినీరింగ్‌ ప్రతిభావంతులపై దృష్టి సారించాల్సిందిగా కోరారు. మైక్రోసాఫ్ట్‌ సాంకేతిక నైపుణ్యంతో ఉత్పాదకతను పెంచే వ్యవసాయ విధానాలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నామని తెలిపారు. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినె్‌సలో భాగంగా స్ట్రీమ్‌లైన్డ్‌ అప్రూవల్స్‌, ఫాస్ట్‌-ట్రాక్‌ ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్‌, ప్రొ-బిజినెస్‌ పాలసీలతో వ్యాపార, వాణిజ్య రంగాలకు వేగవంతమైన సేవలను అందుబాటులోకి తీసుకువచ్చామని వివరించారు. ఏపీలో సిద్ధంగా ఉన్న మౌలిక సదుపాయాలు, డిజిటల్‌ గవర్నెన్స్‌ వ్యూహాత్మక లాజిస్టిక్‌లకు అనువుగా ఉంటాయి. దీనికి బలమైన పర్యావరణ వ్యవస్థ మద్దతుగా నిలుస్తుందని తెలిపారు. ఏపీలో డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌, ఏఐ రంగాల అభివృద్ధికి సహకరిస్తామని సత్య నాదెళ్ల హామీ ఇచ్చారు.

అడోబ్‌ రీసెర్చ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయండి

డిజిటల్‌ మీడియా, క్లౌడ్‌ ఆధారిత సేవల్లో అగ్రగామిగా ఉన్న అడోబ్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని ఆ కంపెనీ సీఈవో శంతను నారాయణ్‌ను మంత్రి నారా లోకేశ్‌ కోరారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో అడోబ్‌ సీఈవోతో ఆయన సమావేశమై ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఇన్నోవేషన్‌ అండ్‌ గ్రోత్‌ విజన్‌తో అడోబ్‌ కంపెనీ చేస్తున్న కృషి ఆంధ్రప్రదేశ్‌ డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ విజన్‌కు సరిపోతుందని లోకేశ్‌ పేర్కొన్నారు. ఏపీని గోబల్‌ టెక్‌ హబ్‌గా మార్చడానికి సహకారం అందించాలని కోరారు. ఏఐ వినియోగం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలను వేగవంతంగా అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. డిజిటల్‌ నైపుణ్యాలతో ఏపీ యువతను శక్తిమంతం చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నామని, ఈ విషయంలో భాగస్వామి కావాలని అడోబ్‌ సీఈవోను కోరారు. డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ను మెరుగుపర్చడంలో అడోబ్‌ నైపుణ్యం తమకు ఎంతో ఉపకరిస్తాయన్నారు. స్మార్ట్‌ గవర్నెన్స్‌, ఏఐ-డ్రైవెన్‌ సొల్యూషన్స్‌ అమలుకు ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కోరారు. పరిశ్రమల వినియోగానికి సంబంధించి క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధి, ప్రభుత్వ కార్యకలాపాలు, పౌర సేవల్లో క్లౌడ్‌ ఇంటిగ్రేషన్‌కు భాగస్వామ్యం వహించే అంశాన్ని పరిశీలించాలన్నారు. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, స్టార్ట్‌పలకు అడోబ్‌ సృజనాత్మక సాధనాలు ఏపీ సమగ్రాభివృద్ధికి దోహదపడతాయన్నారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలనే లోకేశ్‌ ప్రతిపాదనలపై అడోబ్‌ సీఈవో శంతను నారాయణ్‌ సానుకూలంగా స్పందించారు. కంపెనీలో సహచరులతో చర్చించి ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.


యాపిల్‌ విస్తరణకు అవసరమైన సహకారం

ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా గుర్తింపు ఉన్న యాపిల్‌ సంస్థ కేంద్ర కార్యాలయాన్ని మంత్రి లోకేశ్‌ సందర్శించి.. ఆ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ (ఆపరేషన్స్‌) ప్రియా బాలసుబ్రహ్మణ్యంతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో యాపిల్‌ కార్యకలాపాలను విస్తరించాలని, అవసరమైన సహకారం ఇవ్వడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఏపీలో ఉన్న 4 ఎలకా్ట్రనిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్లలో అనుకూలమైన ప్రాంతాన్ని ఎంచుకుని తయారీ యూనిట్‌ను నెలకొల్పాలని కోరారు. ఏపీలో ఉన్న అత్యంత నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్‌, అధునాతన సాంకేతిక పర్యావరణ వ్యవస్థ ప్రయోజనకరంగా ఉంటాయని తెలిపారు. విశాఖపట్నంలో ఇప్పటికే టీసీఎస్‌ సంస్థ తమ కార్యకలాపాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటోందని తెలిపారు. యాపిల్‌ గ్లోబల్‌ సప్లయ్‌ చైన్‌ మేనేజ్‌మెంట్‌లో విస్తృత అనుభవం, లాజిస్టిక్స్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రొ-బిజినెస్‌ చర్యలు ప్రయోజనకరంగా ఉంటాయని వివరించారు. యాపిల్‌ భాగస్వామ్యంతో ఏపీలో స్కిల్‌ డెవల్‌పమెంట్‌ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా స్థానిక ప్రతిభను అభివృద్ధి చేయడానికి తమ ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని చెప్పారు. మరోవైపు ప్రధాన మార్కెట్లకు సులభతరమైన యాక్సెస్‌ కలిగిన ఆంధ్రప్రదేశ్‌.. పెట్టుబడులకు వ్యూహాత్మక ప్రదేశమని మంత్రి లోకేశ్‌ వివరించారు. తయారీ, పంపిణీ వ్యవస్థలకు అనువైన ఎకోసిస్టమ్‌ ఏపీలో ఉందన్నారు. లాజిస్టిక్స్‌, సప్లయి చైన్‌ నిర్వహణకు భరోసా కల్పిస్తూ ఆధునిక నౌకాశ్రయాలు, రహదారులతో అన్ని విధాలుగా అనుకూలతలు ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు రాష్ట్రంలో పర్యటించాలని ప్రియా బాలసుబ్రహ్మణ్యంను మంత్రి లోకేశ్‌ ఆహ్వానించారు.

Updated Date - Oct 30 , 2024 | 05:15 AM